ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాయలసీమ - నీటి సదస్సు
ప్రజా ఉద్యమానికీ నడుంకట్టాలని ప్రజలకు పిలుపు
సాక్షి, హైదరాబాద్: రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్ట్‌లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తొలుత పూర్తిచేశాకే రాజధాని శంకుస్థాపన కార్యక్రమం చేపట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆ ప్రాంతానికి చెందిన వివిధ రంగాల ప్రముఖులు డిమాండ్ చేశారు. నాలుగేళ్ల వరుస కరువుతో అల్లాడుతున్న సీమ జిల్లాల సాగు, తాగునీటి అవసరాలను విస్మరించి పాలకులు రాజధాని శంకుస్థాపనల పేరిట హడావుడి చేయడం తగదన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశాకనే ఇతర అంశాలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలన్నారు. రాయసీమ అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో నగరంలోని ప్రకాష్ నగర్‌లో ‘గ్రాట్’ వ్యవస్థాపకుడు విశ్రాంత ఐజీ ఎ.హనుమంతరెడ్డి అధ్యక్షతన ఆదివారం ‘రాయలసీమ - నీటి సదస్సు’ జరిగింది.
ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ విశ్రాంత చీఫ్ ఇంజనీర్, సెంటర్ వాటర్ కమిషన్ మాజీ డెరైక్టర్ శ్రీరాం రెడ్డి మాట్లాడుతూ రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై అక్కడి ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజల నుంచి స్ఫూర్తిగా తీసుకొని అంతా కలిపి ప్రజా ఉద్యమం రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని వర్గాల వారూ ప్రత్యేక జేఏసీలు ఏర్పాటు చేసుకొని పోరాటం చేయాలన్నారు. సీమలో ఇంకా 60 లక్షల ఎకరాలకు నీరు అందాల్సి ఉందని తెలిపారు.
రాయలసీమ కార్మిక కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తక్షణమే రాజధాని శంకుస్థాపన ఆపాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీని కలిసి రాయలసీమ దుర్భిక్ష పరిస్థితులపైన, నీటి పంపకాల్లో జరుగుతున్న అన్యాయంపైనా అంతా తెలియజేయాలన్నారు. గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిస్ పి. లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా వల్ల సీమకు ఒరిగేదేమీ లేదని చెప్పారు. గుంటూరు నుంచి ఆపై జిల్లాలకే లాభం చేకూరుతుందని తెలిపారు. అఖిల భారత రైతు సమాఖ్య సలహాదారు చెంగల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమం రావాలన్నారు.
ప్రాజెక్టుల సమగ్ర సమాచారాన్ని కరపత్రాలు, తదితర రూపాల్లో ప్రజలకు తెలియజేయాల్సి ఉందని చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన ఎ.హనుమంత రెడ్డి మాట్లాడుతూ తమ ప్రాంతం నుంచి రాజధాని, హైకోర్టును అప్పట్లో తరలించి అన్యాయం చేశారని తెలిపారు. తాగు నీటికి ప్రాధాన్యం, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, 70 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని సదస్సు తీర్మానించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రైతు నేతలు దశరధరామిరెడ్డి, రత్నాకర్, జల సంఘం అధ్యక్షుడు ఇస్మాయిల్, ‘గ్రాట్’ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లే ఓబుల్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు శ్యామల తదితరులు పాల్గొన్నారు.
‘సీమ’ ప్రాజెక్టుల తర్వాతే రాజధాని శంకుస్థాపన
Published Mon, Aug 10 2015 2:41 AM | Last Updated on Sun, Sep 3 2017 7:07 AM
Advertisement
Advertisement