
వంచనకు దూరంగా..
- రాజధాని శంకుస్థాపనకు గైర్హాజరు సరైందే..మాది సూత్రబద్ధమైన వైఖరి
- నాడు తప్పులు వేలెత్తి చూపి నేడు చప్పట్లు కొట్టాలా..?
- రాజధానికి కాదు.. రియల్ కుంభకోణాలనే వ్యతిరేకిస్తున్నాం
- జగన్ గైర్హాజరీపై వైఎస్‌ఆర్‌సీపీ నేతల వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: వంచనకు దూరంగా... విలువలకు దగ్గరగా ఉండడమే తమ పార్టీ విధానమని, తమ నాయకుడు మొదటి నుంచి అనుసరిస్తున్న విధానం అదేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంటున్నారు. రాజధాని అమరావతి శంకుస్థాపనకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరు కాకపోవడంపై జరుగుతున్న చర్చకు స్పందిస్తూ వారు ఈ వ్యాఖ్య చేశారు. తాము రాజధానికి వ్యతిరేకం కాదని, ఆ పేరిట సాగుతున్న రియల్‌ఎస్టేట్ వ్యాపారాన్నే వ్యతిరేకిస్తున్నామని వివరించారు.సాంప్రదాయమనో, మర్యాద అనో, శంకుస్థాపనకు హాజరు కావడమంటే రాజధాని పేరుతో రాష్ర్ట ప్రభుత్వం సాగిస్తున్న కుంభకోణాలన్నిటికీ తాము ఆమోదముద్ర వేసినట్లవుతుందని, పేద రైతుల పొట్టకొట్టి సింగపూర్ బినామీ కంపెనీలకు దోచిపెట్టడాన్ని సమర్థించినట్లవుతుందని వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఇపుడు తాము ఈ కార్యక్రమానికి హాజరుకావడమంటే.. రాజధానికి సంబంధించి ఏ దశలోనూ అఖిలపక్షాన్ని భాగస్వామిని చేయకుండా రాష్ర్టప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలన్నిటికీ పచ్చజెండా ఊపినట్టవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వామపక్షాలు కూడా తమ వైఖరితోనే ఉన్నాయని మరో నేత పేర్కొంటూ సీపీఎం నిర్ణయించుకున్న విషయాన్ని గుర్తుచేశారు.
‘గుంటూరు పరిసరాలలో రాజధాని నిర్మాణం చేపడతామని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించిన రోజునే దానిని జగన్ స్వాగతించారు. ఆ తర్వాత జరుగుతున్న వ్యవహారాలనే ఆయన ప్రశ్నిస్తూ వచ్చారు. రాజధానికి సంబంధించి తాము ముందు నుంచీ చేస్తున్న విమర్శలకు సమాధానం లేనందున శంకుస్థాపనకు తనను ఆహ్వానించవద్దని తమ అధినేత జగన్ ముందుగానే సీఎం చంద్రబాబుకు సవివరమైన లేఖరాశారు.’ అని వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు.
‘రైతుల నుంచి బలవంతంగా భూములను సమీకరించడం, బహుళ పంటలు పండే పంట భూములను లాక్కోవడం, భూసేకరణ చట్టం ప్రయోగిస్తానని బెదిరించడం, రైతులపై కేసులు పెట్టడం, రాజధాని ప్రాంతంలో సెక్షన్ 144, సెక్షన్ 30 ప్రయోగించి రైతులను భయభ్రాంతులకు గురిచేయడం, సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ జరిపించకపోవడం, మొత్తంగా పారదర్శకత లేకపోవడం వంటి వాటిపై జగన్ అసెంబ్లీలోనూ, వెలుపలా నిలదీశారు. రాజధాని రైతుల కోసం ఆ ప్రాంతంలో పర్యటించి వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. అవన్నీ మరచిపోయి ఇపుడు ప్రభుత్వం దాదాపు రూ.400 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తూ జరుపుతున్న శంకుస్థాపనకు జగన్ హాజరు కావాలా.. అలా చేస్తే ఈ తప్పులన్నిటికీ మేము ఆమోదముద్ర వేసినట్లు కాదా’ అని మరో సీనియర్ నేత ప్రశ్నించారు.
‘రాజధాని నిర్మాణం వ్యవహారం లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ వెంచర్ మాత్రమేనని, అది పేదలకు పనికి వచ్చే రాజధాని కాదని జగన్ అనేకమార్లు విమర్శించారు.రైతుల నుంచి బలవంతంగా వేలాది ఎకరాల పంటపొలాలను లాక్కుని లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సాగిస్తుండడాన్ని మొదటి నుంచి నిలదీస్తున్న నేత జగన్. ఇవాళ శంకుస్థాపనకు హాజరైతే తనను తాను వంచించుకున్నట్లు కాదా? తప్పులన్నిటికీ ఆమోదముద్ర వేస్తున్నట్లు కాదా? అందుకే ఆయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.’ అని మరో ముఖ్యనేత వివరించారు. ‘ముఖ్యమంత్రి తర్వాత అంతటి ప్రాధాన్యత గలిగిన విపక్ష నేతకు ఏరోజూ ప్రాధాన్యం ఇవ్వలేదు. భూమి పూజప్పుడు ప్యూనుతో కబురంపారు. రాజధానిపై ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. పైగా వ్యక్తిగత దూషణలతో ఎదురుదాడి చేశారు. ఇపుడు శంకుస్థాపనకు పిలవడంలో రాజకీయకోణం దాగి ఉందే తప్ప మరొకటి కాదు.’ అని ఇంకో సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
విలువలే ఊపిరిగా..
‘జగన్ నేటి తరం నాయకుడు. హిప్పోక్రసీ తెలియని ముక్కుసూటి నేత. ఆత్మవంచనకు ఆయన ఆమడదూరం. సంప్రదాయ రాజకీయనాయకుల మాదిరిగా పైన ఒకరకం, లోన మరో రకంగా వ్యవహరించే నేత కాదు. మాటలకు చేతలకు పొంతన లేకుండా వ్యవహరించడం ఆయనకు సరిపడదు. రాజకీయాలలోనూ విలువలుండాలని కాంక్షించే వ్యక్తి. తాను నమ్మినదానిపై గట్టిగా నిలబడే రకం. ఈ విషయం ఇప్పటికే అనేకమార్లు రుజువయ్యింది.
ఈ విషయాన్ని నేటి తరం అర్ధం చేసుకుంటోంది’’ అని వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన ఓ యువనాయకుడు అభిప్రాయపడ్డారు. ‘ఓదార్పు యాత్ర విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్ని ఇబ్బందులెదురైనా ముందుకే సాగడం, కాంగ్రెస్ పార్టీలోనేకొనసాగితే కేంద్ర మంత్రిపదవి దక్కే అవకాశమున్నా, కేసులతో వేధించినా వెనక్కి తగ్గకపోవడం, సంతకాలు పెట్టిన 150 మంది ఎమ్మెల్యేలు వెంట నడిచే అవకాశమున్నా సీఎం పదవి చేపట్టకుండా రోశయ్యపేరును ప్రతిపాదించడం, ఒక ప్రాంతంలో పార్టీకి ఇబ్బంది తలెత్తుతుందని తెలిసినా సమైక్య ఉద్యమం సాగించడం ’ వంటివి జగన్ ముక్కుసూటితనానికి నిదర్శనాలని వారు వివరిస్తున్నారు.