
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి అభివృద్ధికి సింగపూర్ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటున్న ఒప్పందాల్లో ఊహకందని విచిత్రం బహిర్గతమైంది. రాయితీ, అభివృద్ధి ఒప్పందం, షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్‌పై సంతకాల కోసం ఓ సంస్థ పుట్టుకొచ్చింది. ఆ సంస్థను సింగపూర్ కన్సార్టియం సృష్టించింది. తొలి నుంచి సింగపూర్ కంపెనీలకు దాసోహమైన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు పుట్టుకొచ్చిన సంస్థతో ఒప్పందంపై సంతకాలు చేయించుకునేందుకు సిద్ధమైంది. రాజధాని అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో సింగపూర్ ప్రభుత్వంతో జీ టు జీ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ డెవలపర్స్‌గా ప్రైవేట్ కంపెనీలైన అసెండాస్, సెమ్‌బ్రిడ్జి, సెమ్బ్‌కార్ప్‌లను నామినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
మూడు కంపెనీలతో కూడిన కన్సార్టియంను ఒరిజనల్ ప్రాజెక్టు ప్రాంపెనెట్‌గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత ఆ కన్సార్టియంకు స్విస్ చాలెంజ్ పేరుతో స్టార్టప్ ఏరియా 1,691 ఎకరాలను కట్టబెట్టారు. షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్ ప్రకారం స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో సింగపూర్ కన్సార్టియంకు 58 శాతం వాటా, కేపిటల్ సిటీ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి 42 శాతం వాటా ఉంది. షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్‌పైన, రాయితీ, అభివృద్ధి ఒప్పందంపైన సింగపూర్ కన్సార్టియం సంతకం చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆ కంపెనీలు సంతకాలు చేయబోమని స్పష్టం చేశాయి. ఆ కంపెనీల తరఫున ఒప్పందాలపై సంతకాలు చేయడానికి కొత్తగా సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్ పీఈటీ లిమిటెడ్ (ఎస్‌ఏఐహెచ్)ను సృష్టించాయి. తమ తరఫున ఆ కొత్త కంపెనీ సంతకం చేస్తుందని గతేడాది సెప్టెంబర్ 25న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాయి. సింగపూర్ కంపెనీలు కోరినట్లే రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
తప్పులను హైకోర్టు ఎత్తి చూపినా..
స్విస్ చాలెంజ్ విధానం పేరుతో నామినేషన్‌పై సింగపూర్ కన్సార్టియంకు భూములు కట్టబెట్టడంలో తప్పులను హైకోర్టు ఎత్తి చూపినా ప్రభుత్వం తీరు మారలేదు. స్విస్ చాలెంజ్ విధానంలో తప్పులను సరిచేయకపోగా ఆ తప్పులకు సమర్థించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఎనేబ్లింగ్ యాక్ట్ (ఏపీఐడీఈఏ)–2001కి చట్ట సవరణ చేశారు. ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ పరిశీలన చేయాల్సిన అవసరం లేదని చట్టాన్ని సవరించారు. ఇప్పుడు కూడా సింగపూర్ కంపెనీలు కోరినట్లు కీలకమైన రాయితీ అభివృద్ధి ఒప్పందం, షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్‌లో మార్పులు చేయడానికి, అలాగే సంతకందారుల మార్పునకు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను మార్చేయడం గమనార్హం.
జీవోకు విరుద్ధంగా సంతకాలకు సిద్ధం
ఏదైనా పనిచేయడానికి టెండర్లో కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థతోనే సంబంధిత ప్రభుత్వ శాఖ ఒప్పందం చేసుకుంటుంది. అలాగే ఒక సంస్థ నుంచి అప్పు తీసుకుంటే ఆ సంస్థతోనే ఒప్పందం జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రాజధాని స్టార్టప్ ఏరియా అభివృద్ధికి ఒరిజనల్ ప్రాజెక్టు ప్రొపెనెంట్‌గా సింగపూర్ కన్సార్టియం స్విస్ చాలెంజ్ విధానంలో ప్రతిపాదనలను సమర్పించింది. ఆ ప్రతిపాదనల్లోనే రాయితీ, అభివృద్ధి, షేర్ హోల్డింగ్ డాక్యుమెంట్లను కూడా సమర్పించింది. వీటిపై ఆర్థిక శాఖ మంత్రి యనమల నేతృత్వంలోని హైపవర్ కమిటీ సింగపూర్ కంపెనీలతో నేరుగా సంప్రదింపులు జరిపింది. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ అంశాలపై నేరుగా టెలిఫోన్‌లో బేరసారాలు సాగించారు. అనంతరం సింగపూర్ కన్సార్టియంకు స్టార్టప్ ఏరియా అప్పగిస్తూ గత ఏడాది మే 8న జీవో 179 జారీ చేశారు. అదే జీవోలో ఒరిజనల్ ప్రాజెక్టు ప్రొపనెంట్.. అంటే సింగపూర్ కన్సార్టియం సంస్థలతో రాయితీ అభివృద్ధి, షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్లు చేసుకోవాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పుడు ఆ జీవోకు విరుద్ధంగా సింగపూర్ కన్సార్టియం కేవలం తొమ్మిది మంది ఉద్యోగులతో కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్‌ఏఐహెచ్‌తో ఒప్పందాలు చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆదినుంచీ దాసోహమే..
రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ), సింగపూర్ కంపెనీలు సంయుక్తంగా అమరావతి డెవలప్‌మెంట్ పార్టనర్ (ఏడీపీ) పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ఏర్పాటు చేశాయి. అయితే సింగపూర్ కంపెనీలు ఇప్పుడు ఏడీపీ స్పెషల్ పర్పస్ వెహికల్‌గా ఉండరాదని, కేవలం సాధారణ ఏడీపీగానే ఉండాలని స్పష్టం చేశాయి. అందుకు కూడా అంగీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీని ప్రకారం రాయితీ, అభివృద్ధి ఒప్పందం సింగపూర్ కంపెనీలకు బదులు ఎస్‌ఏఐహెచ్, సీఆర్‌డీఏ మధ్య జరగనుంది. అలాగే షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్ కూడా ఎస్‌ఏఐహెచ్, ఏడీపీ, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్)ల మధ్య జరగనుంది. అయితే ఒరిజనల్ ప్రాజెక్టు ప్రొపనెంట్ కంపెనీలతో ఒప్పందం చేసుకోకుండా ఆ కంపెనీలు సూచించిన మరో కంపెనీతో ఒప్పందం చేసుకోవడం నిబంధనలకు విరుద్ధమని న్యాయ, ఆర్థిక శాఖలు స్పష్టంగా చెప్పాయి. గతంలో జారీ చేసిన జీవో–179కు వ్యతిరేకమని పేర్కొన్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడంలేదు.
రాయితీ, అభివృద్ధి ఒప్పందం అంటే...
రాయితీ, అభివృద్ధి ఒప్పందం అంటే స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో సింగపూర్ కన్సార్టియంకు ఇవ్వాల్సిన 1,691 ఎకరాలతో పాటు ఆ కన్సార్టియంకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీలు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన నిబంధనలు, చెల్లించాల్సిన పెనాల్టీలు, అలాగే సింగపూర్ కన్సార్టియం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనున్న రెవెన్యూ తదితర అంశాలు ఉంటాయి. స్టార్టప్ ఏరియా ద్వారా మూడు దశల్లో సింగపూర్ కన్సార్టియం రూ. 5,768.60 కోట్లు పొందుతుంది. అవే మూడు దశల్లో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.446 కోట్లు మాత్రమే రెవెన్యూ కింద వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం, సింగపూర్ కన్సార్టియం ఏమేమి చేయాలో ఈ ఒప్పందంలో ఉంటుంది.
కంపెనీ ఎలా మారుస్తారు?: ఆళ్ల రామకృష్ణారెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే
తొలుత సింగపూర్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య జీటూజీ ఒప్పందం చేసుకున్న తరువాత సింగపూర్ ప్రైవేట్ కంపెనీలను రంగంలోకి దించడమే తప్పు. ఇప్పుడు రాయితీ, అభివృద్ధి, షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్‌లపై సింగపూర్ కన్సార్టియం సంతకం చేయకుండా మరో ప్రైవేట్ కంపెనీని ఏర్పాటుచేసి ఆ కంపెనీతో ఒప్పందంపై సంతకాలు చేయిస్తామనడం వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉంది. ఈ విధంగా సింగపూర్ ప్రైవేట్ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యాపారాలపై కేంద్రం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సింగపూర్ కంపెనీలు పెట్టిన షరతులకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి షరతులు పెట్టలేదు. దీనివల్ల భవిష్యత్‌లో సింగపూర్ కంపెనీలపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు. ఇది రాష్ట్రానికి నష్టం. స్విస్‌చాలెంజ్ పేరుకు మాత్రమే. ఇప్పటికే నామినేషన్‌పై సింగపూర్ కన్సార్టియంకు 1,691 ఎకరాలను అప్పగించారు. సింగపూర్ కంపెనీల పేరుతో రైతుల భూముల, వారి శ్రమను దోచుకోవడం తప్ప భూములిచ్చిన రైతులకు ఇప్పటివరకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయలేదు.
ఆంధ్రుల రాజధాని అమరావతిని సింగపూర్ ప్రభుత్వం నిర్మిస్తుందని సినిమా చూపించారు. జీ టూ జీ (ప్రభుత్వానికి, ప్రభుత్వానికీ మధ్య) ఒప్పందం అన్నారు. క్రమంగా సింగపూర్ ప్రభుత్వం అదృశ్యమై మూడు ప్రైవేట్ కంపెనీల కన్సార్టియం ముందుకొచ్చింది. స్విస్ చాలెంజ్ పేరుతో ప్రతిపాదనలు ఇచ్చింది. 1,691 ఎకరాలను వారికి ధారాదత్తం చేసింది మన ప్రభుత్వం. సింగపూర్ వారి షరతులన్నింటికీ తల ఊపింది. రాయితీ, అభివృద్ధి ఒప్పందం, షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్లపై ఆ కన్సార్టియం సంతకం చేయాల్సి ఉంది. కానీ, స్క్రీన్ ప్లే మళ్లీ మారింది. కేవలం తొమ్మిది మంది ఉద్యోగులు పనిచేసే ఒక చోటా కంపెనీని కన్సార్టియం ముందుకు తెచ్చింది. ఒప్పంద సంతకాలు ఆ చోటా కంపెనీయే చేస్తుందట. ముసుగు తొలగడంలేదూ?.. వేల మంది రైతులూ, కూలీల చెమట చుక్కలతో తడిసి పునీతమైన బంగారు భూమి బేహారుల క్రీడా స్థలంగా మారబోతోంది. ప్రభుత్వ పెద్దల ధనాశ ఐదు కోట్ల మంది మధుర స్వప్నాన్ని పీడ కలగా మార్చబోతోంది.
Comments
Please login to add a commentAdd a comment