ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ క్లోజ్‌ | Fusion Foods Restaurant Open In Siripuram Visakhapatnam | Sakshi
Sakshi News home page

అక్కడ మూత.. ఇక్కడ పూత

Published Wed, Nov 14 2018 8:24 AM | Last Updated on Sat, Nov 17 2018 1:46 PM

Fusion Foods Restaurant Open In Siripuram Visakhapatnam - Sakshi

ఎయిర్‌పోర్ట్‌లో మూతపడిన ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ సిరిపురం జంక్షన్‌లో ఆధునికీకరించిన ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కుట్రకు.. పాత్రధారి, నిందితుడు శ్రీనివాసరావుకు షెల్టర్‌ జోన్‌గా మారిన ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ ఎయిర్‌పోర్ట్‌ శాఖ మూతపడింది. కానీ అదే సమయంలో సిరిపురం జంక్షన్‌లో వుడా(వీఎంఆర్‌డీఏ) స్థలంలో నడుస్తున్న ఇదే రెస్టారెంట్‌ శాఖను లక్షల ఖర్చుతో ఆధునికీకరించి.. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది పునః ప్రారంభించారు.

మామూలుగా అయితే ఇందులో చెప్పుకోవాల్సిన విశేషమేమీ లేదు గానీ.. సరిగ్గా జననేతపై హత్యాయత్నం జరిగిన తర్వాతే ఈ రెస్టారెంట్‌ ఆధునికత సంతరించుకోవడం.. పైగా లీజు గడువు రెండేళ్లలో ముగియనున్న తరుణంలో భారీ ఖర్చుతో రెనోవేట్‌ చేయడంపై స్థలం లీజుకిచ్చిన వుడా వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నా యి. మరో 33 ఏళ్ల పాటు లీజు పొడిగించాలని ఫ్యూజన్‌ ఫుడ్స్‌ కోరినప్పటికీ 2020 నాటికి ఖాళీ చేయాల్సిందేనని వుడా గతంలోనే స్పష్టం చేసింది. అయినా లక్ష్యపెట్టికుండా.. అదీ యాధృచ్ఛికమే కావొచ్చు గానీ.. వై.ఎస్‌.జగన్‌పై హత్యాయత్న ఘటన తర్వాతే ఫ్యూజన్‌ ఫుడ్స్‌ యజమాని, టీడీపీ నేత హర్షవర్ధన్‌ ప్రసాద్‌ చౌదరి సిరిపురం బ్రాంచ్‌లో మకాం వేసి రీమోడలింగ్‌పై దృష్టిపెట్టడంపై విభిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: జననేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నానికి విశాఖ విమానాశ్రయంలోని ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ కేంద్రంగానే కుట్ర జరిగిందన్న వాదనలు  బలపడుతున్న సంగతి తెలి సిందే. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావును రక్షణ శాఖ అధీనంలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌లోని తన రెస్టారెంట్‌లో ఉద్యోగం ఇప్పించడం మొదలు.. కత్తులు, మారణాయుధాలతో విచ్చలవిడిగా సంచరించినా పట్టించుకోకపోవడం.. ప్రత్యేకంగా వసతి కల్పించడం.. వైఎస్‌ జగన్‌పై ఎయిర్‌పోర్ట్‌లో హత్యాయత్నం చేయడం.. తదితర పరిణామాలు చూ స్తే.. హర్షవర్ధన్‌ అండ లేకుండానే శ్రీనివాసరావు ఇంతకు తెగబడ్డాడా అనే సందేహాలు ఎవరికైనా వస్తాయి. ఇక అక్టోబర్‌ 25న మధ్యాహ్నం వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగే సమయానికి సరిగ్గా పది నిమిషాల ముందే హర్షవర్ధన్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి వెళ్లిపోవడం, ఘటన దరిమిలా ‘శ్రీనివాసరావు చాలా మంచోడండీ, అమాయకుడండీ, ఏదో అభిమానంతో పిచ్చి పని చేసుంటాడు’.. అని వకాల్తా పుచ్చుకోవడంతో హర్షవర్ధన్‌ తీరుపై అనుమానాలు వెల్లువెత్తాయి. తన వద్ద పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఏకంగా ప్రతిపక్ష నేతపై హత్యాయత్నానికి దిగితే.. దాన్ని చిన్నఘటనగా చిత్రీకరిస్తూ.. సదరు ఉద్యోగినే వెనకేసుకొచ్చిన హర్షవర్ధన్‌ను ఇప్పటివరకు ప్ర శ్నించని పోలీసు అధికారుల నిర్వాకం చూస్తేనే కుట్రకోణంలో పెద్దల పాత్ర ఉందనేది స్పష్టమవుతోంది. ఇప్పుడు సద రు హర్షవర్ధన్‌ సిరిపురం జంక్షన్‌లో ఉన్న ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ను రూ.లక్షలు ఖర్చు చేసి అర్ధంతరంగా రీమోడలింగ్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.

లీజు గడువు ముంచుకొస్తున్నా.. ముస్తాబు
వాస్తవానికి సిరిపురం జంక్షన్‌లోని ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ లీజుపై ఇప్పటికే విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(వీఎంఆర్‌డీఏ) విమర్శలు మూటకట్టుకుంది. సిరిపురంలో ఉన్న హెచ్‌ఎస్‌బీసీకి నెలకు ఎకరాకు రూ. 1.40 లక్షల లీజు రెంటు చెల్లించేలా ఒప్పందం చేసుకున్న వీఎంఆర్‌డీఏ(అప్పటి వుడా).. దాని పక్కనే ఉన్న ఫ్యూజన్‌ఫుడ్స్‌ రెస్టారెంట్‌ స్థలానికి మాత్రం టీడీపీ పెద్దల ఒత్తిడికి తలొగ్గి ఎకరానికి నెలకు రూ.42 వేల అద్దె మాత్రమే నిర్ణయించింది. 2003 మార్చిలో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో 10,842 చదరపు అడుగుల స్థలాన్ని నెలకు రూ. 13,500 నామమాత్రపు అద్దె చెల్లించేలా తొమ్మిదేళ్ల పాటు లీజుకు ఇచ్చారు. లీజు గడువు పెంచాలని హర్షవర్ధన్‌ 2011లో దరఖాస్తు చేసుకోగా,  అప్పటికే వుడాకు రూ.11,27,823 బకాయి ఉన్నందున గడువు ముగిసిన వెంటనే ఖాళీ చెయ్యాలని అప్పటి వుడా నోటీసులు జారీ చేసింది. దీనిపై జిల్లా కోర్టులో ఫ్యుజన్‌ ఫుడ్స్‌ పిటిషన్‌ దాఖలు చేసినా.. దాన్ని కోర్టు కొట్టేయడంతో హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరుగుతుండగానే బకాయిలు చెల్లించేసిందన్న సాకుతో.. అదే వుడా 2015 వరకూ రూ.24,369 ధరతో లీజు పొడిగించింది. ఆ తర్వాత 2015లో టీడీపీ పెద్దల సిఫార్సుతో మళ్లీ 2020 వరకు లీజు గడువు పొడిగిస్తూ వుడా నిర్ణయించింది. కానీ ఈసారి హర్షవర్ధన్‌ ఐదు, పదేళ్ళు కాదు.. ఏకంగా 33 ఏళ్ళ పాటు లీజు పొడిగించాలంటూ గతేడాది  దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే 2003 నుంచి అతి తక్కువ లీజుకు ఇవ్వడం వల్ల వీఎంఆర్‌డీఏ చాలా నష్టపోయిందనీ, ఇక 33 సంవత్సరాలకు కట్టబెడితే కోట్ల రూపాయలు ఖజానాకు నష్టం వాటిల్లుతుందని వీఎంఆర్‌డీఏ అధికారులు సర్కారుకు స్పష్టం చేశారు. దీంతో ఆ ఫైలు ఆగిపోయింది. అయితే హర్షవర్ధన్‌ ప్రసాద్‌ తాజాగా లక్షలు వ్యయం చేసి రెస్టారెంట్‌కు రీమోడలింగ్‌ చేయడంపై వీఎంఆర్‌డీఏ అధికారులు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండేళ్లలో లీజు పూర్తై, స్థలం ఖాళీ చేయాల్సిన దశలో అర్ధంతరంగా లక్షలు ఖర్చు చేసి పనులు చేపట్టడం వెనుక ఆంతర్యమేమిటో అర్ధం కావడం లేదని వీఎంఆర్‌డీఏ ఉన్నతాధికారి ఒకరు సాక్షి ప్రతినిధి వద్ద వ్యాఖ్యానించారు.

ఎన్‌వోసీలు లేకుండానే ఎయిర్‌పోర్ట్‌లో ఇన్నాళ్లూ హల్‌చల్‌
హత్యాయత్న ఘటన తర్వాత రెండు మూడురోజులపా టు యధావిధిగానే పనిచేసిన ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ ఆ తర్వాత మూతపడింది. కేసు విచారణలో భాగంగా పోలీసులు రెస్టారెంట్‌లో పనిచేసే  శ్రీనివా సరావు సహోద్యోగులను ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌స్టేషన్‌కు తీ సుకువచ్చి అర్ధరాత్రి వరకు విచారించారు. ఈ క్రమంలో నే వారిలో చాలామందికి ఎన్‌వోసీ(నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌) లు లేవని తేలింది.
ఎయిర్‌పోర్ట్‌ ప్రాంగణంలో పనిచేయాలంటే తప్పని సరిగా ఎన్‌వోసీలు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు హర్షవర్ధన్‌ చౌదరి నిబంధనలేమీ పాటించకుండా సిబ్బందితో ఇష్టారాజ్యంగా పనిచేయించారు. ఎన్‌వోసీల వివాదం తెరపైకి రావడంతో పోలీసులు ఫ్యూజన్‌ఫు డ్స్‌ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ ఎన్‌వోసీలు తీసుకోవా లని సూచించారు. ఇదంతా ఇప్పటికిప్పుడు పూర్తయ్యే ప్రక్రియ కాకపోవడంతో హర్షవర్ధన్‌ ఆ రెస్టారెంట్‌ను మూసివేశారు. దీనికితోడు విచారణ పేరిట సీఐ ఎస్‌ఎఫ్, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) అధికారులు విమానాశ్రయంలోనే మకాం వేయడంతో ఎందుకొచ్చిన గొడవని హర్షవర్ధన్‌ ఎయిర్‌పోర్ట్‌ జోలికి పోవడం లేదు. అదే సమయంలోనే సిరిపురం బ్రాంచ్‌పై దృష్టి పెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement