భయం వద్దు.. భవిత మనదే
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: క్షేత్ర స్థాయిలో వైఎస్సార్‌సీపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ సమీక్షలు జరిగాయి. పార్టీ అధికారంలోకి రాలేదన్న నిరాశతో ఉన్న కార్యకర్తల్లో ఉత్సాహం నింపి.. భవిష్యత్తుపై భరోసా కల్పిం చేందుకు నాయకులు ప్రయత్నించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సమీక్షతోపాటు కింది స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ కార్యకర్తలు, నాయకుల నుంచి త్రిసభ్య కమిటీ అభిప్రాయాలు సేకరించింది. కమిటీ సభ్యులైన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, విజయనగరం జెడ్పీ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్, మరో నాయకుడు గుడివాడ అమర్‌నాథ్‌లు స్థానిక వైఎస్సార్ కల్యాణ మండపంలో శనివారం నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిం చారు. శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఆమదాలవలస, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, నరసన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గంలో ఓటమికి కార ణాలను, పార్టీ నేతల పాత్రను కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు.
అలాగే పాలకొండ, రాజాం, పాతపట్నం నియోజకవర్గాల్లో పార్టీ విజయానికి దోహదం చేసిన అంశాలనూ తెలుసుకున్నారు. అభ్యర్థులతోపాటు మండలస్థాయి నాయకులు, ముఖ్య కార్యకర్తలతో స్వయంగా మాట్లాడి అభిప్రాయాలుసేకరించారు. రోజంతా సాగిన ఈ సమీక్షల్లో ఒక్కో నియోజకవర్గం తరఫున 50 నుంచి 70 మంది కార్యకర్తలు, నేతలు హాజరయ్యారు. ఎన్నికల ఫలితాలపై నిశితంగా సమీక్షించారు. అభ్యర్థుల పని తీరు, ప్రచారాల తీరు, ఇతర నేతల పాత్ర, ఎన్నికల వ్యూహాలు, ఏ విషయాల్లో వెనుకబడ్డాం, ఎన్నికలను ప్రభావితం చేసిన అంశాలపై లోతుగా చర్చించి వాస్తవాలను సేకరించారు.
భవిష్యత్తుకు ప్రణాళిక
మరోవైపు పార్టీ భవిష్యత్తు గురించి కూడా చర్చించారు. కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి సూచనలు స్వీకరించారు. భవిష్యత్తు మనదేనన్న ధీమాతో ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. జగన్‌మోహన్‌రెడ్డి పార్టీని మరింత పటిష్టంగా ముందుకు నడిపిస్తారని, ఇందుకు రంగం సిద్ధమైందని వివరించారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాడే అవకాశం లభించిందన్నారు. వచ్చే ఐదేళ్లలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజల పక్షాన చేపట్టాల్సిన పోరాటాలపై దృష్టి సారించాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ సమీక్షల్లో అందిన సూచనలు, అభిప్రాయాలతో పూర్తిస్థాయి నివేదికను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు అందజేస్తామని కమిటీ సభ్యులు చెప్పారు. వీటి ఆధారంగా ఆయన రాజమండ్రిలో జూన్ 4,5,6 తేదీల్లో జిల్లాల వారీ సమీక్షలు నిర్వహిస్తారని వివరించారు.
స్థైర్యం నింపిన సమీక్షలు
ఈ సమీక్షలతో పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం పెరిగింది. మొహమాటాలకు తావు లేకుండా నిక్కచ్చి అభిప్రాయా లు చెప్పాలని కమిటీ సభ్యులు ముందే స్పష్టం చేయడంతో పలు నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడించారు. ఎంపీ ఎన్నికల్లో జరిగిన సమన్వయ లోపాలు, ప్రత్యర్థి పార్టీ చేసిన కుట్రలు, క్రాస్ ఓటింగ్‌ను ప్రోత్సహించడంలో నేతల పాత్ర తదితర అంశాలపై చర్చించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎంపీ అభ్యర్థి రెడ్డి శాంతి, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, పాలకొండ, పాతపట్నం, రాజాం ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కలమట వెంకటరమణ, కంబాల జోగులు, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల అభ్యర్ధులు దువ్వాడ శ్రీనివాస్, వజ్జ బాబూరావు, నర్తు రామారావు, గొర్లె కిరణ్‌కుమార్, పార్టీ సీజీసీ సభ్యుడు పాలవలస రాజశేఖరం, సీఈసీ సభ్యుడు అంధవరపు సూరిబాబు, మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు హనుమంతు కిరణ్‌కుమార్, మహిళా విభాగం సభ్యురాలు కామేశ్వరి, ఇతర ముఖ్య నేతలు వై.వి.సూర్యనారాయణ, గొండు కృష్ణమూర్తి, మార్పు ధర్మారావు, పాలవలస విక్రాంత్, కిల్లి వెంకటసత్యనారాయణ, దువ్వాడ శ్రీకాంత్, పేరాడ తిలక్, నర్తు నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.