- డీఐజీ కాంతారావు
- ముగిసిన ఏపీఎస్పీ నాలుగో బెటాలియన్ వార్షిక క్రీడలు
మామునూరు, న్యూస్‌లైన్ : క్రీడల్లో రాణించే పోలీసులకు మంచి భవిష్యత్ ఉంటుందని వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కాంతారావు అన్నారు. మామునూరు ఏపీఎస్పీ నాలుగో బెటాలియన్‌లో మూడు రోజులుగా జరుగుతున్న వార్షిక క్రీడలు బుధవారం సాయంత్రం ముగిశాయి. ఈ సందర్భంగా డీఐజీ కాంతారావు, కమాండెంట్ నటరాజు పోలీసు క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డీఐజీ ముఖ్యఅతిథిగా హాజరై మా ట్లాడారు. విధి నిర్వహణలో మానసిక ఒత్తిడికి గురయ్యే పోలీసులు క్రీడలపై కూడా దృష్టి సారించాలని సూచించారు. పోలీస్‌శాఖ క్రీడల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. పోలీసు వ్యవస్థలో కీలకమైన కానిస్టేబుళ్ల విధులతోపాటు క్రీడల్లో రాణిస్తూ శాఖకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. నాలుగో బె టాలియన్ కమాండెంట్ నటరాజు మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడుతాయని చెప్పారు.
పోలీసులు ప్రతి రోజు కొంత సమయం క్రీడలకు కేటాయించి దేహదారుఢ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. అనంతరం కానిస్టేబుళ్లు, జవహర్ నవోదయ విద్యాలయ, పాత్ ఫైండర్ పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కాగా, కబడ్డీ, వాలీబాల్, పరుగు పందెం, టగ్‌ఆఫ్‌వార్‌లో గెలుపొందిన వారికి డీఐజీ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ హనుమంతు, ఏజీపీ నారాయణ, డీఎస్పీలు రాజేశ్వర్‌రావు, జనార్దన్‌రెడ్డి, ఆర్‌ఎస్సైలు నహీమ్, నున్న రాజు, శ్రీనివాస్‌రావు, తదితరులు పాల్గొన్నారు.