జి.కొండూరు మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఈ విషయాన్ని తేట తెల్లం చేస్తున్నాయి. దివంగత శాసనసభ్యుడు చనమోలు వెంకట్రావ్ సొంత మండలమైన జి.కొండూరు ఆది నుంచి కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. ఇదే నేపధ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి కూడా ఈ ప్రాంత అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మహానేత మరణానంతరం నిలిచిపోయిన సంక్షేమ పథకాలు,పాలన తీరుపై అప్పటివరకు పార్టీకి వెన్నుదన్నులా నిలిచిన కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తల్లో నిస్తేజం నెలకొంది. ఈ క్రమంలో మహానేత వైఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలు అమలు ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమవుతాయని భావించిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు వేలాది సంఖ్యలో ఆయా పార్టీలను వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సమయానికి కొంత గందరగోళ పరిస్థితులు ఉన్న పార్టీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయానికి పూర్తి స్థాయిలో బలోపేతంగా మారింది. దీనికి తోడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ పులిపాక థామస్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు దగ్గుమళ్లి భారతి, కోణా భిక్షమేశ్వరరావు, వెల్లటూరు గ్రామ మాజీ సర్పంచి జీఎన్‌ఎం.కృష్ణ ప్రసాద్,దేశం సుధాకర్ రెడ్డి,ఈలప్రోలు వెంకటేశ్వరరావు,పామర్తి శ్రీనివాసరావు తదితరులు వైఎస్సార్ సీపీలో చేరడంతో పార్టీకి అదనపు బలం పెరిగింది. దీంతోపాటు ముందు నుంచి పార్టీలో కొనసాగుతున్న జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పామర్తి వెంకటనారాయణ,వేమిరెడ్డి వెంకటరెడ్డి,వేమిరెడ్డి పుల్లారెడ్డి,సంఘి రెడ్డి,చెరుకూరి శ్రీనివాసరావు లతో పాటు కొత్తగా వచ్చిన పార్టీ నాయకులు సమన్వయంతో పార్టీని ముందుకు తీసుకెళ్లారు. దీంతో నియోజకవర్గంలో మిగిలిన మండలాలకు భిన్నంగా ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఏకపక్షమయ్యాయి. ఇదే తరహాలో రానున్న అసెంబ్లీ ,పార్లమెంట్ ఫలితాలు కూడ వస్తాయని పార్టీ అభిమానులు భావిస్తున్నారు.
అత్యధిక స్థానాలు కైవసం
మండలంలో మొత్తం 16 ఎంపీటీసీ సెగ్మెంట్‌లు ఉండగా అందులో 11 స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు. ఎంపీపీ అభ్యర్థిగా జి.కొండూరు-2 స్థానం నుంచి బరిలో ఉన్న వేములకొండ సాంబశివరావు సమీప టీడీపీ అభ్యర్థి ఉయ్యూరు నరసింహారావుపై 395 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మండల పరిషత్‌లు వచ్చినప్పటినుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపునా పులిపాక థామస్ రెండు సార్లు,లంకా శ్రీ గౌరి దేవి ఒక సారి కొనసాగారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఉయ్యూరు నరసింహారావు ఒక సారి మాత్రమే ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు.
జెడ్పీటీసీ అభ్యర్థి బ్రహ్మయ్యకు అత్యధిక మెజార్టీ
జి.కొండూరు మండల జెడ్పీటీసీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్న కాజా బ్రహ్మయ్య కూడా అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. నియోజకవర్గంలో ఉన్న మిగిలిన మండలాల్లో జెడ్పీటీసీలు టీడీపీ కైవసం చేసుకున్నా జి.కొండూరులో మాత్రం వైఎస్సాఆర్ సీపీ హవా కొనసాగింది. పార్టీ అభ్యర్థి కాజా బ్రహ్మయ్య సమీప టీడీపీ అభ్యర్థి ఆలూరి రాజబాబుపై 951 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాజా బ్రహ్మయ్య సతీమణి కాజా సంధ్యారాణి గడిచిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా కొన సాగి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. దీంతోపాటు చనమోలు అనుయాయుడిగా కొనసాగిన కాజా బ్రహ్మయ్య మండలంలో ఉన్న నాయకులు,కార్యకర్తలతో సంబంధాలు ఉండడం,గ్రామాల్లో వైఎస్సార్ సీపీకి ఉన్న ఆదరణ కలిసిరావడంతో కాజా గెలుపు సునాయాసమైంది. ఇప్పటివరకు మండల జెడ్పీటీసీ పదవుల్లో టీడీపీ నుంచి దొప్పల మురళి ఒకసారి, కాంగ్రెస్ పార్టీ నుంచి దగ్గుమళ్లి భారతి ఒకసారి, జోగి వెంకటేశ్వరరావు ఒకసారి కొనసాగారు.
ఎంపీటీసీ విజేతలు వీరే
జి.కొండూరు-2 స్థానం నుంచి ఎంపీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న వేములకొండ సాంబశివరావు, గంగినేని నుంచి పిల్లి వెంకటేశ్వరరావు,చెరువుమాధవరం నుంచి మండల సుమలత, జి.కొండూరు-1 నుంచి వేములకొండ శైలజ, చెవుటూరు నుంచి పుప్పాల సుబ్బారావు, వెంకటాపురం నుంచి యరమల విజయశ్రీ, వెల్లటూరు-1 నుంచి చింతపల్లి పద్మావతి, వెల్లటూరు-2 నుంచి మారాసి కోటయ్య, కందులపాడు నుంచి వేములకొండ తిరుపతి రావు, వెలగలేరు నుంచి పోలుదాసు వెంకటలక్ష్మీ, కవులూరు-2 నుంచి గుణదల వెంకటేశ్వరరావు విజయం సాధించారు.
జి.కొండూరులో వైఎస్సార్ సీపీ హవా
Published Thu, May 15 2014 3:54 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement
Advertisement