ఇక్కడ చిలుకలు కత్తులు దూస్తాయి | Gaddar In Srikakulam | Sakshi
Sakshi News home page

ఇక్కడ చిలుకలు కత్తులు దూస్తాయి

Published Mon, Jul 30 2018 1:26 PM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM

Gaddar In Srikakulam - Sakshi

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న గద్దర్‌

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఇక్కడ చిలుకలు కత్తులు దూస్తాయి.. చీమలు పాములను బెదిరిస్తాయి.. సిక్కోలు గురించి ఎప్పుడో స్థిరపడిన ఈ నానుడిని ప్రజా గాయకుడు గద్దర్‌ మరోసారి గుర్తు చేశారు. శ్రీకాకుళంలో ఆదివారం రాత్రి ఆయన ఓ ప్రైవేటు హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 40 కోట్ల మంది దళితులు ఉన్నారని, వారిపై జరుగుతున్న దాడులను వ్యతిరేకించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

1970లోనే సిక్కోలులో ఉద్యమాలు ప్రారంభమయ్యాయని, ఇది ఉద్యమాల పురిటి గడ్డ అని అన్నారు. దళితులపై దాడులు అరికట్టాలంటే రాష్ట్రంలో ఉన్న దళిత ఎంపీలు, కేంద్ర మంత్రులు ఏకకాలంలో రాజీనామాలు చేయాలన్నారు. అలా చేస్తేనే ఈ తరహా దాడులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయని అన్నారు. 

దళితులకు రాజ్యాంగంలో పొందుపరిచిన 89 యాక్ట్‌ను నిర్వీర్యం చేసి దాన్ని సవరించడం సరికాదన్నారు. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన ప్రజాప్రతినిధులు అవినీతిలో కూరుకుపోయి, దాని నుంచి తప్పించుకునేందుకు అనేక చట్టాలను సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. చట్టాన్ని, రాజ్యాంగాన్ని నిర్జీవంగా తయారు చేశారని మండిపడ్డారు.

మత, కుల, ప్రాంతం, భాష పిచ్చితో నీతి నిజాయితీ, సామాజిక అభివృద్ధిని ఖూనీ చేస్తున్నారని అన్నారు. దళిత ప్రజల రక్షణ కు ఏ విధమైన విధానాలు కావాలో తయారు చేసి దానికి ఏ పార్టీ మద్దతిస్తే వారికే సహకరిస్తామని చెప్పాలని, లేకుంటే తమ ఓట్లతో తగిన బుద్ధి చెబుతామని ఎదురు తిరగాలని సూచించారు. 

ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్లు దోపిడీ చేసి తమకు ఇష్టం వచ్చినట్లు కార్పొరేట్లకు అనుకూలంగా పాలన కొనసాగిస్తున్నారన్నారు. సమాజంలో అందరితోపాటుగా సమాన హోదా కల్పించనాడే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలి పారు. నేటి ప్రభుత్వాలు ప్రపంచబ్యాంకులు, ఎమ్‌ఎన్సీ, డబ్ల్యూటిఓ, సెజ్‌లతో చేతులు కలిపి పూర్తిగా పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధిని గాలికి వదిలేస్తున్నాయని ఆరోపించారు. విద్య, వైద్యం ఉచితంగా అందించిన నాడే సమాజం అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలిపారు. 

ఈ సందర్భంగా దళిత మహాసభ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బెంజిమన్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు వివాదాస్పదమైన తీర్పునిచ్చిందని, అందుకు నిరసనగా నేడు శ్రీకాకుళం నగరంలో దళిత ప్రజల మానవ హక్కుల మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గద్దర్‌ హాజరవుతున్నారని తెలిపారు. దళిత మహాసభను శ్రీకాకుళం నగరంలో ఎన్టీఆర్‌ మున్సిపల్‌ గ్రౌండ్‌లో సోమవారం సాయంత్రం 3.30గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు జిల్లాలో గల దళితులంతా అధిక సంఖ్యలో హాజరవ్వాలని కోరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement