చాపాడు మండలంలో నిన్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ వివేకానందరెడ్డి
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం పట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి గొప్ప మానవతావాది అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆర్భాటాలకు దూరంగా నిరాడంబరంగా ఉంటూ సామాన్యులకు అందుబాటులో ఉండేవారని తెలిపారు. తన తమ్ముడు చాలా సౌమ్యుడని వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. వివేకానందరెడ్డి మరణం చాలా బాధ కలిగించిందన్నారు.
1981లో తన తండ్రి సమితి ప్రెసిడెంట్‌గా సమయంలో ఆయన కూడా సమితి ప్రెసిడెంట్‌గా ఉన్నారని శ్రీకాంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. తమ రెండు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు. 2009లో తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించడంలో ఆయన పాత్ర కూడా ఉందన్నారు. బాబాయ్ అంటే వైఎస్ జగన్‌కు ఎంతో అభిమామని, ఈ విషాద వార్తను తట్టుకునే శక్తిని వైఎస్సార్ కుటుంబానికి భగవంతుడు ప్రసాదించాలని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.
వివేకా నిరాడంబరుడు: కడప మేయర్
వైఎస్ వివేకానందరెడ్డి మరణం చాలా బాధాకరని కడప మేయర్ సురేశ్ అన్నారు. నిన్న కూడా చాపాడు మండలంలో తమతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని తెలిపారు. ఈరోజు ఇలాంటి దుర్వార్త వినాల్సి రావడం దురదృష్టకరమన్నారు. 20 ఏళ్లుగా కడప రాజకీయాల్లో తమకు చేదోడు వాడుగా నిలిచిన వివేకానందరెడ్డి హఠాన్మరణం చెందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. ఆయన చాలా నిరాడంబరంగా ఉండేవారని, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment