
ఢిల్లీ : కేంద్ర జలవనరుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ మాటలతో 2018 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తికాదని తేలిపోయిందని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఏపీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేవీపీ రామచంద్రరావు, పల్లంరాజు తదితరులతో కలసి రఘవీరా రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు.
సమావేశం అనంతరం రఘువీరారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..పోలవరం పునరావాసంపై కేంద్రానికి బాధ్యత లేనట్లుగా చెబుతున్నారని మండిపడ్డారు. పోలవరంపై టీడీపీ, బీజేపీ డ్రామాలాడుతున్నాయని వ్యాఖ్యానించారు. పంపకాలలో తేడాలు రావడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. పోలవరం ప్రాజెక్టు కుక్కలు చింపిన విస్తరిగా మారిందని విమర్శించారు. గడ్కరీ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని, పార్లమెంటులో ఈ అంశాలను లేవనెత్తుతామని తెలిపారు.