అరుణమ్మకు ఝలక్
* ఆమె వెంట టీడీపీలోకి రావాలని కాంగ్రెస్ నేతలకు గాలం
* వెళ్లాలనుకుంటే మేమే వెళ్తాం, మీవెంట రామంటున్న నేతలు
సాక్షి, తిరుపతి: మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో తన అనుచరులను ఇప్పటికే మానసికంగా సిద్ధం చేశారు. అంతేకాకుండా ఆ నియోజకవర్గ పార్టీ టికెట్టు ఆమెకే ఇవ్వాలని అనుచరవర్గం చేత డిమాండ్ చేయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్త పార్టీలో ప్రవేశం ఘనంగా ఉండాలని భావించి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను పెద్ద సంఖ్యలో తన వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలు మినహా పడమటి మండలాల నాయకులకు గాలం వేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో ఆమెకు చేదు అనుభవాలు ఎదురవుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటే, మీ వెంటే ఎందుకు చేరాలని కొందరు నేరుగా ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. రెండు రోజులుగా మాజీ మంత్రి స్వయంగా కొందరు కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, మేజర్ పంచాయతీల సర్పంచ్‌లతో ఫోన్‌లో మంతనాలు జరుపుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఉనికి కోల్పోయామని, అందరం కలసికట్టుగా తెలుగుదేశం పార్టీలో చేరితే భవిష్యత్తులో రాజకీయంగా మంచి అవకాశాలు ఇప్పించే బాధ్యతను తీసుకుంటానంటూ ఆమె వారిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు ఇప్పుడే ఏమీ చెప్పలేమని చెబుతుండగా, మరికొందరు మాత్రం తాము చేరాలనుకుంటే మీతోనే ఎందుకు చేరాలని ఎదురు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది.
జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు ఒకరి నుంచి ఇటువంటి సమాధానం ఎదురైనట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మంత్రిగా ఉన్న సమయంలో తమకు ప్రత్యేకంగా ఆమె చేసింది ఏమీ లేదని, ఇప్పుడు టీడీపీలోకి రావాలని ఏ ప్రాతిపదికన అడుగుతున్నారో అర్థం కావడం లేదని ఒక నేత వాపోయారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్రావారిపాళెం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వేణుగోపాల్‌రెడ్డిని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నియమించడం వెనుక తనను బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని, ఇందుకు ప్రతిగా కాంగ్రెస్‌కు కూడా తన తడాఖా చూపించాలని అరుణమ్మ పట్టుదలతో ఉన్నారు.
అయితే ఆమె ఏ మేరకు సఫలీకృతం అవుతారో చూడాల్సి ఉంది. పీలేరు నియోజకవర్గంపై మాత్రం ఆమె దృష్టిసారించలేదని చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గం కావడం గమనార్హం. ఆయన కేబినెట్‌లో తనకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతగానో, ఆహ్వానించినా ఆ నియోజకవర్గ నేతలు రాకపోవచ్చన్న అనుమానం ఆమెలో ఉండవచ్చని అంటున్నారు.