
అహింసే గాంధీ మార్గం
ఇందుకూరుపేట/నెల్లూరు (సెంట్రల్) : ఇతిహాసాల్లోని అహింసా మార్గాన్ని జాతిపిత మహాత్మాగాంధీ ఆదర్శంగా తీసుకుని దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని విశ్లేషకులు చెబుతుంటారని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ప్రముఖ గజల్ కళాకారుడు శ్రీనివాస్‌తో కలసి ఆదివారం నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ నుంచి పల్లిపాడు పినాకిని సత్యాగ్రహ ఆశ్రమ చైర్మన్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన వందేగాంధేయం పాదయాత్రలో ఎంపీ 13 కిలోమీటర్లు (గాంధీ ఆశ్రమం వరకు) నడిచారు.
అనంతరం ఆశ్రమంలో జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ మహాభారతంలో శ్రీకృష్ణుడు ఆయుధం ధరించకుండా మహాసంగ్రామం జరిగిందన్నారు. శ్రీకృష్ణుడిని ఆదర్శంగా తీసుకుని ప్రపచంలోనే అతి పెద్ద రెండో దేశమైన మనకు సత్యం, అహింసా మార్గాన గాంధీజీ స్వాతంత్య్రం తెచ్చారన్నారు. ఇది సామాన్య విషయం కాదన్నారు. గాంధీజీ చెప్పిన సత్యం, అహింసా మార్గాన్ని అనుసరిస్తే విజయం సాధించగలమని ఎంపీ అన్నారు.
ప్రధాని మోడీ చెప్పిన స్వచ్ఛభారత్ గురించి గాంధీజీ ఎన్నడో పేర్కొన్నారన్నారు. కనీస అవసరమైన మరుగుదొడ్లు లేకపోవడం విచారకరమన్నారు. అందుకే ప్రధాని మోడీ ఐదేళ్లలో రెండు లక్షల కోట్టు వెచ్చించైనా ప్రతి పేదకుటుంబానికి మరుగుదొడ్లు కల్పించాలన్న ఉద్దేశంతో స్వచ్ఛభారత్ చేపట్టారన్నారు. ప్రతి ఒక్కరు పారిశుధ్యంతోపాటు చెట్లు పెంపకాన్ని చేపట్టాలని కోరారు.
రాజకీయంలో ఎక్కువగా కక్ష సాధింపుతో ఉంటారన్నారు. తాను మాత్రం ఎవరిపై పనికట్టుకొని చెడు చేయనన్నారు. తన దగ్గరకు వచ్చిన వారెవరైనా ఇతరులకు ఇబ్బందిలేని పని అయితే చేసి పెడతానన్నారు. ఇతరులకు వీలైనంత సహాయం చేసినప్పుడే జీవితం ధన్యమవుతుందని ఎంపీ పేర్కొన్నారు.
స్ఫూర్తి కలిగించిన గజల్
గజల్ శ్రీనివాస్ అలపించిన గీతాలు స్ఫూర్తికలిగించాయి. అందరినీ ప్రేమతో పలకరించు..మరి ఈదారిన వస్తావో రావో...,ఉందో లేదో స్వర్గం నాపుణ్యం నా కిచ్చై..సర్వం నీకిస్తా..నాబాల్యం నాకిచ్చై తదితర గీతాలు మంత్రముగ్ధుల్ని చేశాయి. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ పూజ్యబాపూజీ నడయాడిన నేల,సత్యగ్రహ ఉద్యామాలకు ఊపిరొదిలిన పినాకిని సత్యగ్రహ ఆశ్రమాన్ని భావితరాలకు తెలియజేయలాన్న ఉద్దేశంతో శాంతి పాదయాత్ర చేపట్టామన్నారు. గాంధీ ఆశ్రమానికి క్యూలు కట్టే రోజులు త్వరలోనే వస్తాయన్నారు. ఆశ్రమం నిర్వాహకులు శ్రీనివాస్‌కు మెమోంటో ఆందజేశారు.
అనంతరం మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ ఆశ్రమానికి లక్ష విరాళం అందజేశారు. తొలుత శ్రీనివాస్, ఎంపీ రాజమోహన్‌రెడ్డి ఆశ్రమంలో రెండు మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో ఆశ్రమ కన్వీనర్ గణేశం కృష్ణారెడ్డి, ఏవీ సుబ్రహ్మణ్యం, సుబ్బారెడ్డి, శివరామయ్య, గూడూరు లక్ష్మీ, నారాయణ, రవీంద్రరెడ్డి, సుబ్రహ్మణ్యం, డైట్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి, ఆశ్రమ మేనేజర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.