టీడీపీ అధినేతకు గండ్ర ప్రశ్న
జగన్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి
లేకుంటే సభాహక్కుల ఉల్లంఘన నోటీసిస్తాం
వరంగల్, న్యూస్‌లైన్: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో టీడీపీ అధినేత చంద్రబాబు ఏకాంత చర్చల మర్మమేమిటో చెప్పాలని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ, సీమాంధ్ర నాయకులతో కలిసి వెళ్లకుండా ఒక్కరే చర్చలు జరపడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌తో కలిసి ఆయన శుక్రవారం హన్మకొండలో విలేకరులతో మాట్లాడారు. అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు ప్రతీకగా నిలుస్తున్నారని, రాష్ట్రపతిని కలిసే నైతిక హక్కు ఆయనకు లేదని మండిపడ్డారు. బాబు సీఎంగా ఉన్న తొమ్మిదిన్నరేళ్లలో అసెంబ్లీలో తెలంగాణ పదం కూడా ఉచ్ఛరించనీయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
ఇప్పటికైనా తెలంగాణ టీడీపీ నాయకులు ఆ పార్టీ నుంచి బయటికి రావాలని పిలుపునిచ్చారు. స్వతంత్రంగా పోటీ చేయలేక బీజేపీ నుంచి ఆహ్వానాలు తెప్పించుకుని మరీ సభలకు హాజరవుతున్నారని ఎద్దేవా చేశారు. శాసనసభ స్పీకర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారని గండ్ర ఆరోపించారు. రాష్ట్రపతి నుంచి బిల్లు వచ్చిన తర్వాత స్పీకర్‌కు ప్రత్యామ్నాయం ఉండదనే విషయం తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. స్పీకర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా జగన్ మాట్లాడుతున్నారని, తక్షణం ఆయన తన మాటలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే జనవరి 3న జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని తెలిపారు. సభలో సభ్యుడు కానప్పటికీ అసెంబ్లీకి పిలిపిస్తామన్నారు.