కర్నూలు(కల్చరల్), న్యూస్‌లైన్:
పార్వతీనందన... పరమ పావన... నీకిదె వందనం. ఏకదంతాయ... వక్రతుండాయ... నీకిదె వందనం. గణపతి బొప్పా మోరియా... బోలో గణేష్ మహరాజ్‌కీ జై... అంటూ నగరంలోని వీధులన్నీ మార్మోగాయి. పాతబస్తీలోని రాంబొట్ల దేవాలయం నుంచి వినాయక ఘాట్ వరకు కాషాయ పతాకాలు రెపరెపలాడాయి. ప్రధాన కూడళ్లలో విక్టరీ డ్రమ్స్ బృందాల వాయింపులకు.. భక్తులు లయబద్ధమైన నృత్యాలు చేయడం ప్రజలను ఆకట్టుకుంది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి వన్‌టౌన్‌లోని రాంబొట్ల ఆలయం వద్ద ఊరేగింపు సందడి మొదలైంది. గణేష్ మహోత్సవ కేంద్ర సమితి కార్యధ్యక్షులు కపిలేశ్వరయ్య, ఉపాధ్యక్షులు కిష్టన్న, పుల్లయ్య తదితర సభ్యులు ఊరేగింపునకు కార్యకర్తలను సన్నద్ధం చేశారు. విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి ప్రత్యేక పూజలు చేసి తొలి ఊరేగింపును ప్రారంభించారు.
కార్యక్రమంలో దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కమలానంద భారతి, మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి, కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఏజేసీ రామస్వామి, ఎస్పీ రఘురామిరెడ్డి, గణేష్ ఉత్సవ కేంద్ర సమితి గౌరవాధ్యక్షులు రాంభూపాల్ చౌదరి, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, నాయకులు టీజీ భరత్, గణేష్ ఉత్సవ సమితి నేతలు సందడి సుధాకర్, సందడి మహేష్, కాళింగి నరసింహవర్మ తదితరులు పాల్గొన్నారు. విగ్రహాల తరలింపు వాహనాలల్లో చిన్నారులు, యువకులు వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు. రెండో ఊరేగింపు మధ్యాహ్నం ఒంటి గంటకు చౌరస్తా సమీపంలోని హనుమాన్ జంక్షన్ నుంచి.. మూడో ఊరేగింపు కల్లూరు చౌరస్తాలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. నిమజ్జనోత్సవ ఊరేగింపులో హిందూ ముస్లింలు పాల్గొనడంతో మతసామరస్యం వెల్లివిరిసింది. ఇక సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీలోనూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం కనిపించింది. పలుచోట్ల ముస్లింలు ఊరేగింపులో పాల్గొన్న కార్యకర్తలకు మంచినీళ్లు అందించడం విశేషం. నగరంలోని మూడు ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాలను ఊరేగింపుగా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వినాయక ఘాట్‌కు చేర్చారు.
గణేష్ ఉత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర చిన్ననీటిపారుదల శాఖ మంత్రి టి.జి.వెంకటేష్ జ్యోతి ప్రజ్వలనతో నిమజ్జనోత్సవం ప్రారంభమైంది. కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి ధ్వజారోహణం గావించారు. పత్తికొండ ఎమ్మెల్యే కె.ఇ.ప్రభాకర్ భరత మాతకు పూలమాల వేసి పూజలు చేశారు. ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, మాజీ మంత్రి గణేష్ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షుడు రాంభూపాల్‌చౌదరి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, న్యాయవాది ఎం.డి.వై.రామమూర్తి, గణేష్ ఆలయ కమిటీ అధ్యక్షుడు బి.కె.సింగ్, ఏజేసీ రామస్వామి, జెడ్పీ సీఈఓ సూర్యప్రకాష్, డీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వి.వి.ఎస్.మూర్తి తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
పాలనా గణపతితో నిమజ్జనానికి శ్రీకారం
ఆకాశం మేఘావృతమై, చల్లదనం పర్చుకున్నవేళ... దివి నుంచి పార్వతీ పరమేశ్వరులు గణేష్ భక్తజనులను మనసారా ఆశీర్వదిస్తున్నారేమో అన్నట్లుగా వినాయక ఘాట్‌లో వాతావరణం ఆహ్లాదపరిచింది. ముందుగా విశిష్ట అతిథులంతా ప్రత్యేక ప్రజలు చేసి కలెక్టరేట్ పరిపాలనా గణపతితో నిమజ్జనోత్సవానికి శ్రీకారం చుట్టారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వినాయక విగ్రహాలను క్రేన్ ద్వారా తెప్ప మీదకు దించి కేసీ కెనాల్ నీళ్లలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ నర్సింహులు, డాక్టర్ మోక్షేశ్వరుడు, హనుమంతరావు చౌదరి, కట్టమంచి విద్యాసంస్థల అధినేత జనార్ధన్‌రెడ్డి, కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డి, వ్యాఖ్యాతలు చెన్నయ్య, ఎలమర్తి రమణయ్య, నొస్సం నర్సింహాచార్య, చంద్రశేఖర్ శర్మ, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
కర్నూలులో వినాయక.. నిమజ్జనం
Published Wed, Sep 18 2013 1:37 AM | Last Updated on Fri, Sep 1 2017 10:48 PM
Advertisement