ganapathi boppa moria
-
గణపతిని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తాం?అసలు కారణమిదే!
అందరి విఘ్నాలు తొలగించే వినాయకుడ్ని నవరాత్రుల అనంతరం నిమజ్జనం చేయడం ఆచారంగా వస్తుంది. సాధారణంగా హిందూ పండగల్లో వినాయక చవితికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దేశవ్యాప్తంగా గణనాథుడికి ఎంతో ఘనంగా పూజలు చేస్తారు. మండపాలు వేసి అందంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో 9 రోజుల పాటు పూజలు చేసి తర్వాత గంగమ్మ ఒడికి సాగనంపుతారు. హిందూ దేవుళ్లలో ఎవరికి పూజలు చేసినా ఆ ప్రతిమలను ఇంట్లోనే పెట్టుకుంటాం. కానీ ఒక్క వినాయకుడిని మాత్రమే నిమజ్జనం ఎందుకు చేస్తాం?దీని వెనకున్న కారణం ఏంటన్నది తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి. గణపతి కేవలం గణాలకు అధిపతి మాత్రమే కాదు... ఘనమైన దైవం కూడా. ఎందుకంటే, ఈ సృష్టి యావత్తూ అనేకమైన గణాలతో కూడిన మహాగణమే. ఈ గణాలన్నింటిలోనూ అంతర్యామిగా ఉంటూ, సృష్టిని శాసించే మహా శక్తిమంతుడు. అంతటి శక్తిమంతమైన దైవం కాబట్టే గణపతికి ఎంతో ఘనంగా పూజలు చేస్తారు భక్తులు. అందుకే ఆయన ఘనులకే ఘనుడు. రుతుధర్మాన్ననుసరించి జరుపుకునే పండుగలలో వినాయక చవితి ముఖ్యమైనది. యేటా వర్షరుతువు చివర్లో భాద్రపద శుద్ధ చవితినాడు వస్తుందీ పండుగ. వేసవి తాపం తగ్గి, బీటలు వారిన భూమి వర్షపు జల్లులతో ప్రాణశక్తిని పుంజుకుని పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. పుష్పాలు విచ్చి పరిమళం వెదజల్లుతుంటాయి. నదులలో నీరు నిండి జీవనతత్వం అభివృద్ధి చెందుతుంది. బుధుడు అధిపతియైన హస్త... వినాయకుని జన్మనక్షత్రం. బుధగ్రహానికి ఆకుపచ్చనివంటే ఇష్టం. వినాయకునికి కూడా గడ్డిజాతి మొక్కలంటే ఇష్టం. అందుకే ఆయనను గరికతోనూ, వివిధ ఆకులతోనూ పూజిస్తాం. మట్టితోనే ఎందుకు? గణేశుని మట్టితో చేయడం వెనుక కూడా విశేషముంది. ఈ కాలంలో జలాశయాల్లో దిగి మట్టిని తీయడం వల్ల పూడిక తీసినట్లు అవుతుంది. నీళ్లు తేటపడతాయి. మట్టితో బొమ్మను చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటికి అంటితే మంచిది. ఒండ్రుమట్టిలో నానడం శరీరానికి మంచిదని ప్రకృతి చికిత్స వైద్యులు చెబుతుంటారు. ప్రకృతి చికిత్సకు ఒండ్రుమట్టిని వాడటం మనకు తెలిసిందే. షోడశోపచార పూజల్లో వాడే పత్రిని మనం తాకడం వల్ల కూడా వాటిలోని ఔషధ గుణాలు మనలోకి ప్రవేశిస్తాయి. తొమ్మిది రోజులు విగ్రహాన్ని, పత్రాలను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో గాలి ఔషధ గుణాల్ని పంచుతుంది. ఎంతో మేలు చేస్తుంది. వినాయకుడిని దగ్గరలో ఉన్న చెరువు, నది లేదంటే బావిలో నిమజ్జనం చేస్తారు. అందుకు తగ్గట్లుగా ఈ కాలంలో నదులు, చెరువులు నిండుగా కళకళలాడుతుంటాయి. మట్టి విగ్రహాల్ని, పత్రిని నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీటిలో ఉండే క్రిమి కీటకాలు చనిపోతాయి. కానీ ఈమధ్యకాలంలో గణపతికి రసాయనిక రంగులు వేస్తున్నారు. ఇలాంటి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల వాటిలో నివసించే జీవులకు హానికారకమవుతుంది.అందుకే మట్టి గణపతులనే పూజించాలని చెబుతారు. నిమజ్జనమెందుకు? అయితే పదిరోజుల పాటు పూజలు చేసిన వినాయక విగ్రహాన్ని పదకొండోరోజున మేళతాళాలతో జల నిమజ్జనం చేయడంలో ఒక వేదాంత రహస్యం ఉంది. పాంచభౌతికమైన ప్రతి ఒక్క పదార్థం, అంటే పంచభూతాల(భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం) నుంచి జనించిన ప్రతి ఒక్క సజీవ, నిర్జీవ పదార్థమూ మధ్యలో ఎంత వైభవంగా, ఇంకెంత విలాసంగా గడిపినప్పటికీ అంతిమంగా మట్టిలో కలసిపోవాల్సిందే.అలా ఎందుకంటే, భూమినుంచి పుట్టింది ఎంత గొప్పగా పెరిగినా, తిరిగి భూమిలోనే కలిసిపోతుందన్న సత్యాన్ని చాటేందుకే. దేనిమీదా వ్యామోహాన్ని పెంచుకోకూడదన్న నీతిని చెప్పేందుకే!ధ్యానావాహనాది షోడశోపచార పూజలు చేసిన అనంతరం ఉద్వాసన చెప్పి తిరిగి ఆ నీటిలోనే నిమజ్జనం చేస్తారు. శాస్త్రీయ కారణాలు.. వినాయక నిమజ్జనం వేనక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి అంటున్నారు నిపుణులు. వినాయక చవితి నాటికి.. జోరుగా వానలు కురిసి.. వాగులు, వంకలు, నదులు, చెరువులు పొంగి పొర్లుతుంటాయి. వరదలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక అలాంటి సమయంలో మట్టితో చేసిన గణపయ్య విగ్రహాలను నీళ్లల్లో నిమజ్జనం చేయడం వల్ల.. వరద ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు. అలానే వానాకాలంలో ప్రవహించే నీటిలో క్రిమికీటకాలు అధికంగా ఉంటాయి. ఇలాంటి సమయంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా.. ఆయన పూజకు వాడిన ఆకులను కూడా నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీరు పరిశుభ్రంగా మారుతుందని చెబుతున్నారు. మట్టి గణపతి నీటిలో కలిశాక 23 గంటలకు తమలోని ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్‌ను నీళ్లలోకి వదిలేస్తాయి. ఈ ఆల్కలాయిడ్స్ వల్ల నీళ్లలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియా నశిస్తుంది. ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇదే వినాయక నిమజ్జనం వెనుక దాగి ఉన్న రహస్యం. -
కర్నూలులో వినాయక.. నిమజ్జనం
కర్నూలు(కల్చరల్), న్యూస్‌లైన్: పార్వతీనందన... పరమ పావన... నీకిదె వందనం. ఏకదంతాయ... వక్రతుండాయ... నీకిదె వందనం. గణపతి బొప్పా మోరియా... బోలో గణేష్ మహరాజ్‌కీ జై... అంటూ నగరంలోని వీధులన్నీ మార్మోగాయి. పాతబస్తీలోని రాంబొట్ల దేవాలయం నుంచి వినాయక ఘాట్ వరకు కాషాయ పతాకాలు రెపరెపలాడాయి. ప్రధాన కూడళ్లలో విక్టరీ డ్రమ్స్ బృందాల వాయింపులకు.. భక్తులు లయబద్ధమైన నృత్యాలు చేయడం ప్రజలను ఆకట్టుకుంది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి వన్‌టౌన్‌లోని రాంబొట్ల ఆలయం వద్ద ఊరేగింపు సందడి మొదలైంది. గణేష్ మహోత్సవ కేంద్ర సమితి కార్యధ్యక్షులు కపిలేశ్వరయ్య, ఉపాధ్యక్షులు కిష్టన్న, పుల్లయ్య తదితర సభ్యులు ఊరేగింపునకు కార్యకర్తలను సన్నద్ధం చేశారు. విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి ప్రత్యేక పూజలు చేసి తొలి ఊరేగింపును ప్రారంభించారు. కార్యక్రమంలో దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కమలానంద భారతి, మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి, కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఏజేసీ రామస్వామి, ఎస్పీ రఘురామిరెడ్డి, గణేష్ ఉత్సవ కేంద్ర సమితి గౌరవాధ్యక్షులు రాంభూపాల్ చౌదరి, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, నాయకులు టీజీ భరత్, గణేష్ ఉత్సవ సమితి నేతలు సందడి సుధాకర్, సందడి మహేష్, కాళింగి నరసింహవర్మ తదితరులు పాల్గొన్నారు. విగ్రహాల తరలింపు వాహనాలల్లో చిన్నారులు, యువకులు వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు. రెండో ఊరేగింపు మధ్యాహ్నం ఒంటి గంటకు చౌరస్తా సమీపంలోని హనుమాన్ జంక్షన్ నుంచి.. మూడో ఊరేగింపు కల్లూరు చౌరస్తాలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. నిమజ్జనోత్సవ ఊరేగింపులో హిందూ ముస్లింలు పాల్గొనడంతో మతసామరస్యం వెల్లివిరిసింది. ఇక సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీలోనూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం కనిపించింది. పలుచోట్ల ముస్లింలు ఊరేగింపులో పాల్గొన్న కార్యకర్తలకు మంచినీళ్లు అందించడం విశేషం. నగరంలోని మూడు ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాలను ఊరేగింపుగా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వినాయక ఘాట్‌కు చేర్చారు. గణేష్ ఉత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర చిన్ననీటిపారుదల శాఖ మంత్రి టి.జి.వెంకటేష్ జ్యోతి ప్రజ్వలనతో నిమజ్జనోత్సవం ప్రారంభమైంది. కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి ధ్వజారోహణం గావించారు. పత్తికొండ ఎమ్మెల్యే కె.ఇ.ప్రభాకర్ భరత మాతకు పూలమాల వేసి పూజలు చేశారు. ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, మాజీ మంత్రి గణేష్ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షుడు రాంభూపాల్‌చౌదరి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, న్యాయవాది ఎం.డి.వై.రామమూర్తి, గణేష్ ఆలయ కమిటీ అధ్యక్షుడు బి.కె.సింగ్, ఏజేసీ రామస్వామి, జెడ్పీ సీఈఓ సూర్యప్రకాష్, డీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వి.వి.ఎస్.మూర్తి తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలనా గణపతితో నిమజ్జనానికి శ్రీకారం ఆకాశం మేఘావృతమై, చల్లదనం పర్చుకున్నవేళ... దివి నుంచి పార్వతీ పరమేశ్వరులు గణేష్ భక్తజనులను మనసారా ఆశీర్వదిస్తున్నారేమో అన్నట్లుగా వినాయక ఘాట్‌లో వాతావరణం ఆహ్లాదపరిచింది. ముందుగా విశిష్ట అతిథులంతా ప్రత్యేక ప్రజలు చేసి కలెక్టరేట్ పరిపాలనా గణపతితో నిమజ్జనోత్సవానికి శ్రీకారం చుట్టారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వినాయక విగ్రహాలను క్రేన్ ద్వారా తెప్ప మీదకు దించి కేసీ కెనాల్ నీళ్లలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ నర్సింహులు, డాక్టర్ మోక్షేశ్వరుడు, హనుమంతరావు చౌదరి, కట్టమంచి విద్యాసంస్థల అధినేత జనార్ధన్‌రెడ్డి, కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డి, వ్యాఖ్యాతలు చెన్నయ్య, ఎలమర్తి రమణయ్య, నొస్సం నర్సింహాచార్య, చంద్రశేఖర్ శర్మ, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.