అందరి విఘ్నాలు తొలగించే వినాయకుడ్ని నవరాత్రుల అనంతరం నిమజ్జనం చేయడం ఆచారంగా వస్తుంది. సాధారణంగా హిందూ పండగల్లో వినాయక చవితికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దేశవ్యాప్తంగా గణనాథుడికి ఎంతో ఘనంగా పూజలు చేస్తారు. మండపాలు వేసి అందంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో 9 రోజుల పాటు పూజలు చేసి తర్వాత గంగమ్మ ఒడికి సాగనంపుతారు.
హిందూ దేవుళ్లలో ఎవరికి పూజలు చేసినా ఆ ప్రతిమలను ఇంట్లోనే పెట్టుకుంటాం. కానీ ఒక్క వినాయకుడిని మాత్రమే నిమజ్జనం ఎందుకు చేస్తాం?దీని వెనకున్న కారణం ఏంటన్నది తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.
గణపతి కేవలం గణాలకు అధిపతి మాత్రమే కాదు... ఘనమైన దైవం కూడా. ఎందుకంటే, ఈ సృష్టి యావత్తూ అనేకమైన గణాలతో కూడిన మహాగణమే. ఈ గణాలన్నింటిలోనూ అంతర్యామిగా ఉంటూ, సృష్టిని శాసించే మహా శక్తిమంతుడు. అంతటి శక్తిమంతమైన దైవం కాబట్టే గణపతికి ఎంతో ఘనంగా పూజలు చేస్తారు భక్తులు. అందుకే ఆయన ఘనులకే ఘనుడు.
రుతుధర్మాన్ననుసరించి జరుపుకునే పండుగలలో వినాయక చవితి ముఖ్యమైనది. యేటా వర్షరుతువు చివర్లో భాద్రపద శుద్ధ చవితినాడు వస్తుందీ పండుగ. వేసవి తాపం తగ్గి, బీటలు వారిన భూమి వర్షపు జల్లులతో ప్రాణశక్తిని పుంజుకుని పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. పుష్పాలు విచ్చి పరిమళం వెదజల్లుతుంటాయి. నదులలో నీరు నిండి జీవనతత్వం అభివృద్ధి చెందుతుంది. బుధుడు అధిపతియైన హస్త... వినాయకుని జన్మనక్షత్రం. బుధగ్రహానికి ఆకుపచ్చనివంటే ఇష్టం. వినాయకునికి కూడా గడ్డిజాతి మొక్కలంటే ఇష్టం. అందుకే ఆయనను గరికతోనూ, వివిధ ఆకులతోనూ పూజిస్తాం.
మట్టితోనే ఎందుకు?
గణేశుని మట్టితో చేయడం వెనుక కూడా విశేషముంది. ఈ కాలంలో జలాశయాల్లో దిగి మట్టిని తీయడం వల్ల పూడిక తీసినట్లు అవుతుంది. నీళ్లు తేటపడతాయి. మట్టితో బొమ్మను చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటికి అంటితే మంచిది. ఒండ్రుమట్టిలో నానడం శరీరానికి మంచిదని ప్రకృతి చికిత్స వైద్యులు చెబుతుంటారు. ప్రకృతి చికిత్సకు ఒండ్రుమట్టిని వాడటం మనకు తెలిసిందే. షోడశోపచార పూజల్లో వాడే పత్రిని మనం తాకడం వల్ల కూడా వాటిలోని ఔషధ గుణాలు మనలోకి ప్రవేశిస్తాయి. తొమ్మిది రోజులు విగ్రహాన్ని, పత్రాలను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో గాలి ఔషధ గుణాల్ని పంచుతుంది. ఎంతో మేలు చేస్తుంది.
వినాయకుడిని దగ్గరలో ఉన్న చెరువు, నది లేదంటే బావిలో నిమజ్జనం చేస్తారు. అందుకు తగ్గట్లుగా ఈ కాలంలో నదులు, చెరువులు నిండుగా కళకళలాడుతుంటాయి. మట్టి విగ్రహాల్ని, పత్రిని నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీటిలో ఉండే క్రిమి కీటకాలు చనిపోతాయి. కానీ ఈమధ్యకాలంలో గణపతికి రసాయనిక రంగులు వేస్తున్నారు. ఇలాంటి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల వాటిలో నివసించే జీవులకు హానికారకమవుతుంది.అందుకే మట్టి గణపతులనే పూజించాలని చెబుతారు.
నిమజ్జనమెందుకు?
అయితే పదిరోజుల పాటు పూజలు చేసిన వినాయక విగ్రహాన్ని పదకొండోరోజున మేళతాళాలతో జల నిమజ్జనం చేయడంలో ఒక వేదాంత రహస్యం ఉంది. పాంచభౌతికమైన ప్రతి ఒక్క పదార్థం, అంటే పంచభూతాల(భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం) నుంచి జనించిన ప్రతి ఒక్క సజీవ, నిర్జీవ పదార్థమూ మధ్యలో ఎంత వైభవంగా, ఇంకెంత విలాసంగా గడిపినప్పటికీ అంతిమంగా మట్టిలో కలసిపోవాల్సిందే.అలా ఎందుకంటే, భూమినుంచి పుట్టింది ఎంత గొప్పగా పెరిగినా, తిరిగి భూమిలోనే కలిసిపోతుందన్న సత్యాన్ని చాటేందుకే. దేనిమీదా వ్యామోహాన్ని పెంచుకోకూడదన్న నీతిని చెప్పేందుకే!ధ్యానావాహనాది షోడశోపచార పూజలు చేసిన అనంతరం ఉద్వాసన చెప్పి తిరిగి ఆ నీటిలోనే నిమజ్జనం చేస్తారు.
శాస్త్రీయ కారణాలు..
వినాయక నిమజ్జనం వేనక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి అంటున్నారు నిపుణులు. వినాయక చవితి నాటికి.. జోరుగా వానలు కురిసి.. వాగులు, వంకలు, నదులు, చెరువులు పొంగి పొర్లుతుంటాయి. వరదలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక అలాంటి సమయంలో మట్టితో చేసిన గణపయ్య విగ్రహాలను నీళ్లల్లో నిమజ్జనం చేయడం వల్ల.. వరద ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు.
అలానే వానాకాలంలో ప్రవహించే నీటిలో క్రిమికీటకాలు అధికంగా ఉంటాయి. ఇలాంటి సమయంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా.. ఆయన పూజకు వాడిన ఆకులను కూడా నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీరు పరిశుభ్రంగా మారుతుందని చెబుతున్నారు. మట్టి గణపతి నీటిలో కలిశాక 23 గంటలకు తమలోని ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్‌ను నీళ్లలోకి వదిలేస్తాయి. ఈ ఆల్కలాయిడ్స్ వల్ల నీళ్లలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియా నశిస్తుంది. ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇదే వినాయక నిమజ్జనం వెనుక దాగి ఉన్న రహస్యం.
Comments
Please login to add a commentAdd a comment