అంతర్రాష్ర్ట దొంగల ముఠా అరెస్టు
సామర్లకోట :కొంత కాలంగా జిల్లాలో వివిధ నేరాలకు పాల్పడుతున్న ముఠా సామర్లకోట పోలీసులకు పట్టుబడింది. వీరి వద్ద నుంచి సుమారు రూ.15 లక్ష ల విలువైన 530 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం స్థానిక పోలీసు స్టేషన్‌లో పెద్దాపురం డీఎస్పీ ఓలేటి అరవింద్‌బాబు ఈ వివరాలు వెల్లడించారు.విశాఖ జిల్లా యలమంచిలి మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన బొడ్డపు బాబూరావు గత 15 ఏళ్ల నుంచి నేరాల బాటలో పయనిస్తున్నాడు. అతడికి ఇంకా చాలా నేరాలతో సంబం ధం ఉంది. విశాఖపట్నం, మహారాష్ట్రలో బాబూరావుపై హత్య కేసులు నమోదయ్యాయి. నేరం చేసే సమయంలో అడ్డొచ్చిన వారిని హతమార్చేందుకు వెనుకాడలేదు. బిక్కవోలు, పెదపూడి, సామర్లకోట, ఏలేశ్వరం ప్రాంతాల్లో ఆరు నేరాలు చేశాడు.
ఇతడికి సామర్లకోట మండలం వేట్లపాలేనికి చెందిన మల్లిపూడి శ్రీనివాసరావు, కుంపట్ల విష్ణుచక్రం, విశాఖ జిల్లా సబ్బవరం మండలం పైడివాడకు చెందిన శెట్టి అప్పలరాజు సహకరించారు. వీరు బంగారు ఆభరణాల దొంగతనమే ప్రధాన వృత్తిగా ఎంచుకున్నారు. బంగారు షాపుల షట్టర్లను తొలగించేందుకు గ్యాస్ కట్టర్‌ను కూడా సమకూర్చుకున్నారు. ఏటీఎంల్లో చోరీ చేసే సమయంలో కెమెరాలో పడకుండా ఉండేందుకు నల్లటి ముసుగు, వేలిముద్రలు లభించకుండా గ్లౌజులు, మంకీ టోపీ ఏర్పాటు చేసుకున్నారు. బిక్కవోలు, పెదపూడిల్లోని బంగారు షాపుల్లో చోరీలకు పాల్పడిన వీరు.. బిక్కవోలులో ఉన్న పురాతన సుబ్రహ్మణేశ్వరస్వామి ఆలయంలో 169 గ్రాముల అమ్మవారి బంగారు మంగళసూత్రాలు, వడ్డాణం, కనుబొమ్మలు, కాసులపేరు, నక్లెస్‌ను దొంగిలించారు.
బిక్కవోలు పోలీసు స్టేషన్ పరిధిలో 220 గ్రాముల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. పెదపూడి పోలీసు స్టేషన్ పరిధిలో 86.350 గ్రాముల బంగారు ఆభరణాలను తస్కరించారు. సామర్లకోట పోలీసుస్టేషన్ పరిధిలో 54.210 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగిలించారు. ఏలేశ్వరం పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మోటార్ బైక్‌ను చోరీ చేశారు. ఈ చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుంది. నిందితులు సామర్లకోట సుగర్ ఫ్యాక్టరీ సమీపంలో అనుమానాస్పందంగా తచ్చాడుతుండగా, వారిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో తమ నేరాలను అంగీకరించారు. ఈ కేసులను ఛేదించిన క్రైం సీఐ సీహెచ్ సురేష్, క్రైం ఎస్సై వల్లీ, ఎస్సై ఎండీఎంఆర్ ఆలీఖాన్, ఇతర సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. వీరికి రివార్డులు ఇవ్వాలని ఎస్పీకి సిఫారసు చేస్తామన్నారు.