'కడియం శ్రీహరిది అసత్యప్రచారం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి రికార్డులను తాము అడగడం లేదని తెలంగాణ ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేయడం సరికాదని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. తాము పలుమార్లు రికార్డులు ఇవ్వాలని అడిగినా స్పందించకుండా లక్షలాది మంది విద్యార్ధుల జీవితాలతో రాజకీయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ నరసింహన్ సమక్షంలో తెలంగాణ మంత్రి కడియం శ్రీహరి, తాను చర్చించామని, ఆతరువాత గవర్నర్ సూచన మేరకు రెండు రాష్ట్రాల అధికారులతో కూడి తామిద్దరం చర్చించామని తెలిపారు.
ఆ సమావేశంలో రికార్డులన్నింటినీ అప్పగిస్తామని కడియం శ్రీహరే స్వయంగా అంగీకరించి తరువాత మాటతప్పారన్నారు. తాము పలుమార్లు లేఖలు రాసినా తెలంగాణ ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి తమ రికార్డులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసిందన్నారు. ఇప్పటికైనా మీడియా బాధ్యత తీసుకుంటే తెలంగాణ మంత్రి కడియం శ్రీహరితో చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. చర్చలకు మంత్రి కడియం రావాలని పేర్కొన్నారు. తాము అనేక ప్రయత్నాలు చేసినా రికార్డులు ఇవ్వకుండా తిరిగి అసత్యప్రచారాలు చేయడం కడియం శ్రీహరికి తగదని హితవు పలికారు.
అయిదుసార్లు లేఖలు రాశాం
వేణుగోపాలరెడ్డి తమ రికార్డులు అప్పగించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలికి, తెలంగాణ ప్రభుత్వానికి తాము అయిదుసార్లు లేఖలు రాసినా అక్కడినుంచి స్పందన లేకుండా పోయిందని ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలి ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ విజయప్రకాశ్, ప్రొఫెసర్ నరసింహరావులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉన్నత విద్యామండలి, తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులతో పలుమార్లు సంప్రదింపులు చేసిన వివరాలను అందించారు. అనేకమార్లు లేఖలురాసినా స్పందించకుండా తాము సంప్రదించలేదనడం దారుణమన్నారు. రికార్డులకోసం కమిటీవేసి విభజన చేద్దామని తమనుంచి పేర్లు ప్రతిపాదించినా వారు రికార్డులు ఇవ్వకుండా జాప్యంచేస్తున్నారని పేర్కొన్నారు. రికార్డులకోసం సమయం, తేదీ తెలియచేయాలని తాము కోరినా వారినుంచి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు.