భీమిలీ బీచ్ సమీపంలో గంటా క్యాంప్ కార్యాలయం
భుకబ్జాలు, రికార్డుల తారుమారు, ఫోర్జరీలు, సర్కారీ భూముల తనఖా.. ఇలా భూ బాగోతాలతో విశాఖ నగర శివారులోని ఆ ప్రాంతం రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లోకెక్కింది. విశాఖలో భూములకు పెరిగిన డిమాండ్‌ను టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నాయకులు సొమ్ము చేసుకునే క్రమంలో విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారు. అదే భీమిలి నియోజకవర్గం. అక్కడి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాష్ట్ర మంత్రి కూడా కావడాన్ని ఆసరా చేసుకొని ఆయన బంధువులు కొందరు, అనుచరులు, టీడీపీ నియోజకవర్గ నేతలు భూకబ్జాల పర్వానికి తెరతీశారు. ఆయన పేరుతో దందాలు సాగిస్తూ.. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను సొంతం చేసుకున్నారు. చివరికి ప్రభుత్వ భూములను సైతం బ్యాంకుల్లో తనఖా పెట్టి కోట్లాది రూపాయల రుణాలు తీసుకున్నారు. గత నాలుగున్నరేళ్లలో ఈ నియోజకవర్గంలో సాగిన టీడీపీ నేతల అక్రమాల పర్వంపై ప్రత్యేక కథనం..
ప్రకాశం జిల్లా నుంచి వ్యాపారం నిమిత్తం విశాఖ వచ్చి స్థిరపడ్డారు గంటా శ్రీనివాసరావు. ప్రత్యూష గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి ఎండీగా ఉంటూ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1999లో అనకాపల్లి లోక్‌సభ స్థానానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికయ్యారు. 2004లో చోడవరం ఎమ్మెల్యేగా అదే పార్టీ తరఫున గెలిచారు.2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీలో చేరి అనకాపల్లి నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్లీ టీడీపీలో చేరి 2014లో భీమునిపట్నం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇలా ఇతర నాయకుల్లా స్థిరంగా ఒక నియోజకవర్గం నుంచి కాకుండా ప్రతి ఎన్నికల్లోనూ మరో స్థానానికి మారుతుంటారని గంటాకు పేరు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన గంటా.. ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమయ్యాక కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవిని చేపట్టారు. 2014లో టీడీపీ నుంచి ఎన్నికయ్యాక రెండోసారి మంత్రి పదవి దక్కించుకున్నారు. ప్రస్తుతం మానవ వనరులశాఖ మంత్రిగా ఉన్నారు.
భాస్కరుడి ‘భూ’గోతాలు..
గంటా సమీప బంధువు పరుచూరి భాస్కరరావు ఆగడాలు, అక్రమాలు అన్నీ ఇన్నీ కావని ఆయన గురించిన తెలిసిన వారు చెబుతారు. ఆనందపురం మండలం వేములవలస గ్రామంలో 122–11లో 726 చదరపు గజాల భూమి, సర్వే నెం.122–8,9,10,11,12,13,14,15లలో 4.33 ఎకరాలు, సర్వే నెం.124–1,2,3,4 లలో 0.271 ఎకరాలు భాస్కరరావు కుదువ పెట్టిన వాటిలో ఉన్నాయి. వీటిలో సర్వే నెం.122/9ని పరిశీలిస్తే.. ఇందులో మొత్తం 59 సెంట్ల భూమి ఎన్‌హెచ్ విస్తరణ కోసమే ప్రభుత్వం సేకరించింది. ప్రభుత్వం తీసుకునే సమయానికి ముందు ఇక్కడ కేవలం 7 సెంట్ల భూమి మాత్రమే పరుచూరి భాస్కరరావు పేరిట ఉంది. సర్వే నంబర్ 122/10లో 47 సెంట్ల జిరాయితీ భూమిని ఎన్‌హెచ్ విస్తరణలో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. రికార్డుల్లో ప్రభుత్వ భూమిగానే ఉంది. ఇక్కడ భాస్కరరావు పేరిట ఒక్క గజం కూడా లేదు.
♦ సర్వే నెం. 122–11లో 66 సెంట్ల ప్రభుత్వ భూమిలో 60 సెంట్లు కోరాడ అచ్చమ్మ ఆక్రమణలో ఉన్నట్టుగా రికార్డుల్లో ఉంది. ఈ 60 సెంట్లలో బలహీన వర్గాల కాలనీ ఉంది. మిగిలిన ఆరు సెంట్లు కూడా ప్రభుత్వ మిగులు భూమిగానే చూపిస్తున్నారు.
♦ సర్వే నంబర్..122/12లో 1.04 ఎకరాల భూమిలో భాస్కరరావు పేరిట 30 సెంట్ల భూమి మాత్రమే ఉండగా.. కొంత ప్రభుత్వ భూమి, ఇంకొంత ప్రైవేటు వ్యక్తులది. భాస్కరరావుకు చెందిన 8 సెంట్ల భూమి ఎన్‌హెచ్ విస్తరణ కోసం ప్రభుత్వం సేకరించిన భూమిలో ఉంది. కానీ ఇక్కడ 1.04 ఎకరాల భూమిని కూడా తనదిగానే బ్యాంకులో కుదువపెట్టాడు.
భీమిలిలో అడుగు పెట్టాక..
గంటా శ్రీనివాసరావు భీమిలి ఎమ్మెల్యే, మంత్రి అయ్యాక ఆయన అనుచరగణం ప్రభుత్వ భూములను సైతం బ్యాంకుల్లో కుదువ పెట్టి వందల కోట్ల రుణాలు పొందారు. ఇండియన్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణం చెల్లించడంలో విఫలమైన ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ, డైరెక్టర్ల ఆస్తులతో పాటు హామీదారుగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తులను స్వాధీనం చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
భూకుంభకోణాలతోఉక్కిరిబిక్కిరి..
ఇక రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విశాఖ భూకుంభకోణంలోనూ మంత్రి గంటాపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంలో భీమిలి నియోజకవర్గ పరిధిలోనే అవకతవకలు జరగడం వీటికి బలం చేకూర్చాయి. ఒక్క భీమిలి నియోజకవర్గంలోనే రూ.2,200 కోట్ల విలువైన భూముల కుంభకోణం జరిగినట్టు అప్పటి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు.
ఇదీబ్యాంకు రుణంకథ..
విశాఖపట్నం వన్‌టౌన్ లక్ష్మీ టాకీస్ వద్ద ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది. కంపెనీలో యాక్టివ్ డైరెక్టర్లుగా గంటా సమీప బంధువు పరుచూరి వెంకట భాస్కరరావు, ఆయన సోదరులు రాజారావు, వెంకయ్య ప్రభాకరరావులున్నారు. ఈ కంపెనీకి మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు కొండయ్య, బాలసుబ్రహ్మణ్యం, నార్ని అమూల్యలు హామీదారులుగా ఉన్నారు. కంపెనీ విస్తరణ పేరుతో డాబాగార్డెన్స్ శారదావీధిలోని ఇండియన్ బ్యాంకు నుంచి రూ.141,68,07,584 రుణాలు తీసుకుంది. రుణం పొందినప్పటి నుంచి ఒక్క వాయిదా కూడా చెల్లించలేదు. 13–12–2016 నాటికి వడ్డీతో కలిపి రూ.196 కోట్ల 51 లక్షల 717 బకాయిగా ఇండియన్ బ్యాంకు తేల్చింది. దీనిపై బ్యాంకు డిమాండ్ నోటీసులు జారీ చేసినా రుణం చెల్లించకపోవడంతో ఆస్తుల స్వాధీనం మొదలు పెట్టింది. ప్రత్యూష కంపెనీకి చెందిన ఆస్తులు, కంపెనీ డైరెక్టర్ల ఆస్తులతో పాటుగా హామీదారులుగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరుల ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంటున్నామని బ్యాంక్ స్వాధీనత ప్రకటన జారీ చేసింది. విశాఖ, గాజువాక, చినగదిలి, రుషికొండ, మధురవాడ, ఆనందపురం, అనకాపల్లి, కాకినాడలలోని ప్రత్యూష కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.
భీమిలి పరిసరాల్లో ..
విశాఖ నగర శివారులో ఆర్థిక నగరాల నిర్మాణానికి అసైన్డ్, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు సేకరిస్తామని గతంలో వుడా ప్రకటించింది. గంటా వర్గీయులు ఎక్కడెక్కడ వుడా భూములు సేకరిస్తుందో తెలుసుకుని నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు, (అసైన్డ్) డీ పట్టా భూములను ముందుగానే గుప్పిట్లో పెట్టుకున్నారు. డీ పట్టా భూములకు ఎకరాకు రూ.12 లక్షల వరకు, ఆక్రమణలో ఉన్న భూములకు ఎకరా రూ.3 లక్షలు చొప్పున బేరం కుదుర్చుకుని అడ్వాన్సుగా రూ. 2 లక్షలు చెల్లించి క్రయపత్రాలు రాయించుకున్నారు. ఖాళీ పేపర్ల పై సంతకాలు తీసుకుని తమ వద్దనే ఉంచుకున్నారు. తర్వాత మంత్రి తన పరపతి ఉపయోగించి ల్యాండ్ పూలింగ్ ప్రకటన చేయించారన్న ప్రచారం జరిగింది. గంటా అనుచరులు రంగంలోకి దిగి ఆ భూములను సేకరించాల్సిందిగా రైతులతో వుడాకు దరఖాస్తు చేయించారు. ఇలా 358.47 ఎకరాల్లో బినామీలు పాగా వేయగలిగారు. ఇంతలో రూ.600 కోట్ల విలువైన ఈ వ్యవహారాన్ని ‘సాక్షి’ బట్టబయలు చేయడంతో వుడా ఈ ల్యాండ్ పూలింగ్‌కు బ్రేకులు వేసింది.
మంత్రి అల్లుడిపై కూడా దాదాపు రూ.100 విలువ చేసే భూములు వ్యవహారంలో ప్రమేయముందని ప్రచారంలో ఉంది. సాక్షి కథనంతో ఈ వ్యవహారానికి బ్రేక్ పడింది.
Comments
Please login to add a commentAdd a comment