ఒక్క గరికపాడు చెక్‌పోస్టు నుంచే రూ.1.30 కోట్లు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ వాహనాలకు శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రవేశ పన్ను విధించడంతో తొలి రోజు ఆదాయం రూ.1.50 కోట్లకు చేరింది. ఇందులో కృష్ణా జిల్లా సరిహద్దులోని గరికపాడు చెక్‌పోస్టు ఆదాయం రూ.1.30 కోట్ల వరకు ఉంది. త్రైమాసిక పన్ను కింద వంద ప్రైవేటు బస్సులు ట్యాక్స్ చెల్లించడంతో ఈ ఆదాయం రూ.1.20 కోట్ల వరకు ఉందని రవాణా వర్గాలు పేర్కొంటున్నాయి. లారీలు ఏడు, 30 రోజుల పన్ను చెల్లించగా, ట్యాక్సీలు, ప్రయాణీకులు చేరవేసే మ్యాక్సీ క్యాబ్‌ల ఆదాయం మొత్తం కలిపి రూ.30 లక్షల వరకు ఉందని అధికారులు చెబుతున్నారు.
క్వార్టర్లీ ట్యాక్స్ చెల్లించిన వంద ప్రైవేటు బస్సులు మరో మూడు నెలల వరకు పన్ను చెల్లించనక్కర్లేదు. గుంటూరు సరిహద్దులోని మాచర్ల, దాచేపల్లి వద్ద ఉన్న చెక్‌పోస్టుల ద్వారా రూ.5 లక్షలు, కృష్ణా-ఖమ్మం జిల్లా సరిహద్దులో ఉన్న తిరువూరు చెక్‌పోస్టు నుంచి రూ.2 లక్షలు, కర్నూలు జిల్లా పంచలింగాల వద్ద ఉన్న చెక్‌పోస్టు ద్వారా రూ.3 లక్షలు, ఉభయగోదావరి జిల్లాల సరిహద్దులో ఉన్న చెక్‌పోస్టుల ద్వారా సుమారు రూ.పది లక్షల వరకు రాబడి వచ్చినట్లు రవాణా వర్గాలు తెలిపాయి.