
లబ్బీపేట (విజయవాడ తూర్పు) : లాడ్జిలోని వంట గదిలో అకస్మికంగా గ్యాస్ సిలెండర్ పేలడంతో ఒకరికి స్వల్ప గాయాలు కాగా, ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. నివాసాల మధ్య ఉన్న లాడ్జిలో సిలెండర్ పేలిన వెంటనే మంటలతో పాటు, దట్టమైన పొగ వ్యాపించడంతో చుట్టుపక్కల వారు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశారు. వివరాల ప్రకారం మహాత్మా గాంధీ రోడ్డులోని హోటల్ ఫారŠూచ్యన్ మురళీ పార్క్ ఎదురుగా చిన్న ఇరుకు వీధిలో ఫ్రభ ఇన్ రెస్ట్‌హౌస్ (లాడ్జి) ఉంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో వంట గదితో పాటు, సిబ్బంది ఉంటారు.
సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో వంట చేస్తుండగా సిలెండర్ ఒక్కసారిగా పేలింది. దీంతో దట్టమైన పొగతో పాటు మంటలు వ్యాపించాయి. దీంతో సమీపంలో ఉన్న లాడ్జి మేనేజర్ ప్రవీణ్‌కుమార్ గౌడ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పక్క గదిలో ఉన్న ఇద్దరు యువకులు ప్రహరీ దూకి బయటపడ్డారు. అదే సమయంలో మొదటి అంతస్తులోని ఓ గదిలో ఉన్న ఇద్దరు యువతులు సైతం కిటికీలో నుంచి పక్క భవనంపైకి దూకి బయటపడగా, రెండో అంతస్తులో ఉన్న స్వీపర్ లక్ష్మి దట్టమైన పొగలోనూ మెట్లు వెతుక్కుంటూ బయటపడింది. కాగా రెండో అంతస్తులోని ఓ గదిలో ఉన్న వ్యక్తి కిందకి రాలేక, భయభ్రాంతులతో కేకలు వేశారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది పక్క భవనంపై నుంచి నిచ్చెన వేసి అతనిని కిందకు దించారు.
అగ్నిమాపక సిబ్బంది సమయస్ఫూర్తి..
సిలెండర్ పేలి మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల నివాసాల వారు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. లాడ్జి భవనానికి ఆనుకునే ఇళ్లు ఉండటంతో అందులోని వాళ్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. అంతేకాక పై అంతస్తులో చిక్కుకున్న వ్యక్తిని సైతం సురక్షితంగా కిందకు దింపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇళ్ల మధ్యన ప్రమాదం జరగడంతో ఘటనా స్థలానికి మూడు ఫైర్ ఇంజిన్లు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment