మిర్యాలగూడ/భువనగిరి/హుజూర్‌నగర్, న్యూస్‌లైన్: వంట గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీ కష్టాలు తప్పడం లేదు. ఆధార్ అనుసంధానంపై పూటకో తీరుగా మారుతున్న ప్రభుత్వ విధానాలతో మూడు రోజులుగా జిల్లాలో వంట గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ఆధార్ కార్డుంటేనే గ్యాస్ బుక్ చేసుకోవాలని ఆయా కంపెనీల నుంచి ఆదేశాలున్నందున ఏజెన్సీల వారు అదే తీరును అనుసరిస్తున్నారు. దీనికి తోడు గ్యాస్ సక్రమంగా దిగుమతి కాకపోవడంతో వినియోగదారులకు సిలిండర్లు సరఫరా చేయడం లేదు.
దీంతో గ్యాస్ కోసం మూడు రోజులుగా ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ నెల 30వ తేదీన నగదు బదిలీ పథకం నుంచి వంట గ్యాస్‌ను మినహాయిస్తూ కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడంతో కొంత ఊరట కలిగిందని వినియోగదారులు భావించారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వాధికారులకు గానీ, గ్యాస్ కంపెనీలకు గానీ ఆధార్ లింకు అక్కరలేదన్న జీఓలు రాలేదు. దీంతో అసలు సబ్సిడీ వంట గ్యాస్‌కు ఆధార్ కార్డుల అనుసంధాన ప్రకియ ఉన్నట్టా? లేనట్టా? అనే విషయం స్పష్టం కాక గ్యాస్ కంపెనీల ప్రతినిధులు, అధికారులు అయోమయంతో తలలు పట్టుకున్నారు. కాగా గ్యాస్ రీఫిల్లింగ్‌కు ఎంత బిల్లు వసూలు చేయాలో తెలియక ఈ నెల 1వ తేదీ నుంచి గ్యాస్ సరఫరా నిలిపేశారు.
3.29లక్షలమంది ఆధార్ అనుసంధానం పూర్తి
నగదు బదిలీ పథకం అమలు చేయకున్నా కేవలం ఆధార్ అనుసంధానం చేసుకున్న వారికి మాత్రమే గ్యాస్ బుక్ చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 6.23 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లున్నాయి. ఇప్పటి వరకు 3.29 లక్షల మంది గ్యాస్ వినయోగదారులు గ్యాస్ కంపెనీలలో ఆధార్ అనుసంధానం పూర్తి చేసుకోగా.. 1.87లక్షల మంది ఆయా బ్యాంకుల్లో అనుసంధానం చేసుకున్నారు. మిగతా వారిని కూడా ఆధార్ అనుసంధానం చేసుకోవాలని ఆయా కంపెనీల ఏజెన్సీల వారు వినియోగదారులను కోరుతున్నారు.
సిలిండర్ల సంఖ్య 12కు పెంపు
ఇప్పటి వరకు ఒక్క కనెక్షన్ ఉన్న గ్యాస్ వినియోగదారుడికి సంవత్సరానికి 9 గ్యాస్ సిలిండర్‌లు ఇచ్చేవారు. కాగా ఇటీవల ప్రభుత్వం ఆ సంఖ్యను 12కు పెంచింది. 12 సిలిండర్‌లు ఇచ్చే వ్యవహారంలో ఆయా గ్యాస్ కంపెనీలు సంసిద్దతతోనే ఉన్నాయి. కానీ ఆధార్ అనుసంధానం విషయంలో మాత్రం మినహాయింపులు ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేవు. గతంలో మాదిరిగానే ఆధార్ గ్యాస్ అనుసంధానం చేసుకున్న వారికి రూ. 1327 బిల్లు, అనుసంధానం చేసుకోని వారికి రూ. 445 బిల్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో మాదిరిగానే ఆధార్ అనుసంధానం చేసుకుంటే బ్యాంకు ఖాతాలోకి సబ్సిడీ, అనుసంధానం లేని వారికి నేరుగా సబ్సిడీ అందే అవకాశాలు ఉన్నాయి.
ఆదేశాలు రాలేదు - వెంకటేశ్వర్లు, ఏఎస్‌ఓ, నల్లగొండ
ఆధార్ కార్డుల అనుసంధానంపై కొత్తగా ఎలాంటి ఆదేశాలూ రాలేదు. పాత పద్ధతిలోనే ఆధార్ కార్డులు అనుసంధానం చేస్తున్నాము. కంపెనీల వారితో మాట్లాడినా వారికి కూడా జీఓలు అందలేదని చెప్పారు.
గ్యాస్ ఇవ్వడం లేదు
గ్యాస్ గతంలో బుక్ చేశాను. కానీ అది క్యాన్సిల్ అయ్యిందని, తిరిగి బుక్‌చేసుకోవాలని చెబుతున్నారు. మూడు రోజులుగా మాకు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లేదు. ఆధార్‌కార్డు లింకు ఉంటేనే బుక్ చేసుకుంటామని చెబుతున్నారు.
- పుష్ప, మిర్యాలగూడ
నిలిచిన గ్యాస్!
Published Tue, Feb 4 2014 4:37 AM | Last Updated on Fri, May 25 2018 6:19 PM
Advertisement