gas companies
-
‘కరెంట్’తో గ్యాస్‌కు లాస్!
♦ ఎలక్ట్రానిక్స్ వస్తువుల రాకతో గ్యాస్ వ్యాపారానికి గండి ♦ వాడకం పెంచాలన్న గ్యాస్ కంపెనీల సేల్ ఆఫీసర్స్ ఒకప్పుడు గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుని ఏళ్ల తరబడి వేచి చూడాల్సివచ్చేది. లేదంటే అధిక మొత్తం వెచ్చించి బ్లాక్‌లో కొనుక్కోవడమే కాకుండా అమ్మినవారి పేరుమీదే ప్రతినెలా సిలెండర్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు సీన్ మారింది. గ్యాస్ కనెక్షన్ తీసుకునేవారే కరువవడంతో పిలిచి మరీ ఇస్తున్నారు. గ్యాస్ కంపెనీల వ్యాపారానికి ఎలక్ట్రానిక్ వస్తువులు గండికొట్టడం వల్ల ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. విజయవాడ : నగరంతోపాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో గృహావసరాల కోసం వినియోగించే గ్యాస్ వాడకం తగ్గుముఖం పట్టింది. ఆయా కంపెనీలు కొద్ది మాసాలుగా అధ్యయనం చేసి జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ వాడకం తగ్గడానికి గల కారణాలు తెలుసుకున్నాయి. మార్కెట్లో ఎలక్ట్రికల్ కుక్కర్లు, గ్యాస్స్టౌల అమ్మకాలు విరివిగా పెరగడం వల్లే గ్యాస్ వినియోగదారులు తగ్గిపోతున్నట్లు గుర్తించాయి. ఈ క్రమంలో ఆయిల్ కంపెనీల సేల్స్ ఆఫీసర్లు డొమెస్టిక్ గ్యాస్ వాడకాన్ని పెంచాలని ముందుగా ఏజెన్సీలకు లేఖలు రాశారు. జిల్లాలో సగటున ఐదు శాతం డొమెస్టిక్ గ్యాస్ వాడకం పడిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో 60 గ్యాస్ ఏజెన్సీలుఉన్నాయి. ఒక్కో ఏజెన్సీలో సుమారు 500 సిలిండర్ల వాడకం తగ్గినట్లు తెలిసింది. అంటే నెలకు 30 వేల సిలిండర్ల అమ్మకాలు తగ్గినట్లు సమాచారం. ఒక్కో లోడుకు 450 చొప్పున నెలకు జిల్లాలో 3 వేల లోడ్లు.. అంటే 1,35,000 సిలిండర్ల అమ్మకాలు జరుగుతుంటాయి. అడిగినవారికి లేదన కుండా కొత్త కనెక్షన్లు గ్యాస్ ఏజెన్సీలు రెండు నెలలుగా కొత్త కనెక్షన్లు అడిగినవారికి లేదనకుండా ఇచ్చేస్తున్నాయి. దరఖాస్తు చేసుకున్నవారికి వెంటనే ఇచ్చేస్తున్నాయి. గతంలో కొత్త కనెక్షన్ పొందాలంటే వినియోగదారులు నానా అగచాట్లు పడేవారు. ఇప్పుడు ఇలా వెళ్లి అలా కనెక్షన్ తీసుకునే రోజులొచ్చాయి. గ్యాస్ వాడకం తగ్గడానికి గల కారణాలివీ.. ► {పతి ఇంట్లో వంటలు చేసుకునేందుకు ఎలక్ట్రికల్ కుక్కర్లు, చపాతీ మేకర్లు అందుబాటులోకి వచ్చాయి. ► వేడి నీళ్లకోసం గ్రీజర్లు ముమ్మరంగా వాడుతున్నారు. ► ఎలక్ట్రికల్ ఇండక్షన్ స్టౌలు కూడా రావడంతో సాధారణ గ్యాస్ స్టౌల వినియోగం తగ్గింది. ► సోలార్ విద్యుత్ కూడా అందుబాటులోకి రావడంతో గ్యాస్ వాడకం తగ్గుముఖం పట్టింది. ► నగరంలో ఇంటింటికీ పైప్లైన్ల ద్వారా భాగ్యనగర్ గ్యాస్‌ను సరఫరా చేస్తున్నారు. ► హోటళ్లు, తినుబండారాలు విక్రయించే చిరు వ్యాపారులో గతంలో దొంగచాటుగా డొమెస్టిక్ గ్యాస్‌నే వినియోగించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌ను రూ. 925కే ఇస్తున్నారు. 14 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ రూ. 625లకే లభ్యమవుతోంది. ధరలో రూ. 300 వ్యత్యాసం మాత్రమే ఉండడంతో అధిక శాతం వ్యాపారులు కమర్షియల్ సిలిండర్లనే కొనుగోలు చేస్తున్నారు. -
నిలిచిన గ్యాస్!
మిర్యాలగూడ/భువనగిరి/హుజూర్నగర్, న్యూస్‌లైన్: వంట గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీ కష్టాలు తప్పడం లేదు. ఆధార్ అనుసంధానంపై పూటకో తీరుగా మారుతున్న ప్రభుత్వ విధానాలతో మూడు రోజులుగా జిల్లాలో వంట గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ఆధార్ కార్డుంటేనే గ్యాస్ బుక్ చేసుకోవాలని ఆయా కంపెనీల నుంచి ఆదేశాలున్నందున ఏజెన్సీల వారు అదే తీరును అనుసరిస్తున్నారు. దీనికి తోడు గ్యాస్ సక్రమంగా దిగుమతి కాకపోవడంతో వినియోగదారులకు సిలిండర్లు సరఫరా చేయడం లేదు. దీంతో గ్యాస్ కోసం మూడు రోజులుగా ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ నెల 30వ తేదీన నగదు బదిలీ పథకం నుంచి వంట గ్యాస్‌ను మినహాయిస్తూ కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడంతో కొంత ఊరట కలిగిందని వినియోగదారులు భావించారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వాధికారులకు గానీ, గ్యాస్ కంపెనీలకు గానీ ఆధార్ లింకు అక్కరలేదన్న జీఓలు రాలేదు. దీంతో అసలు సబ్సిడీ వంట గ్యాస్‌కు ఆధార్ కార్డుల అనుసంధాన ప్రకియ ఉన్నట్టా? లేనట్టా? అనే విషయం స్పష్టం కాక గ్యాస్ కంపెనీల ప్రతినిధులు, అధికారులు అయోమయంతో తలలు పట్టుకున్నారు. కాగా గ్యాస్ రీఫిల్లింగ్‌కు ఎంత బిల్లు వసూలు చేయాలో తెలియక ఈ నెల 1వ తేదీ నుంచి గ్యాస్ సరఫరా నిలిపేశారు. 3.29లక్షలమంది ఆధార్ అనుసంధానం పూర్తి నగదు బదిలీ పథకం అమలు చేయకున్నా కేవలం ఆధార్ అనుసంధానం చేసుకున్న వారికి మాత్రమే గ్యాస్ బుక్ చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 6.23 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లున్నాయి. ఇప్పటి వరకు 3.29 లక్షల మంది గ్యాస్ వినయోగదారులు గ్యాస్ కంపెనీలలో ఆధార్ అనుసంధానం పూర్తి చేసుకోగా.. 1.87లక్షల మంది ఆయా బ్యాంకుల్లో అనుసంధానం చేసుకున్నారు. మిగతా వారిని కూడా ఆధార్ అనుసంధానం చేసుకోవాలని ఆయా కంపెనీల ఏజెన్సీల వారు వినియోగదారులను కోరుతున్నారు. సిలిండర్ల సంఖ్య 12కు పెంపు ఇప్పటి వరకు ఒక్క కనెక్షన్ ఉన్న గ్యాస్ వినియోగదారుడికి సంవత్సరానికి 9 గ్యాస్ సిలిండర్లు ఇచ్చేవారు. కాగా ఇటీవల ప్రభుత్వం ఆ సంఖ్యను 12కు పెంచింది. 12 సిలిండర్లు ఇచ్చే వ్యవహారంలో ఆయా గ్యాస్ కంపెనీలు సంసిద్దతతోనే ఉన్నాయి. కానీ ఆధార్ అనుసంధానం విషయంలో మాత్రం మినహాయింపులు ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేవు. గతంలో మాదిరిగానే ఆధార్ గ్యాస్ అనుసంధానం చేసుకున్న వారికి రూ. 1327 బిల్లు, అనుసంధానం చేసుకోని వారికి రూ. 445 బిల్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో మాదిరిగానే ఆధార్ అనుసంధానం చేసుకుంటే బ్యాంకు ఖాతాలోకి సబ్సిడీ, అనుసంధానం లేని వారికి నేరుగా సబ్సిడీ అందే అవకాశాలు ఉన్నాయి. ఆదేశాలు రాలేదు - వెంకటేశ్వర్లు, ఏఎస్ఓ, నల్లగొండ ఆధార్ కార్డుల అనుసంధానంపై కొత్తగా ఎలాంటి ఆదేశాలూ రాలేదు. పాత పద్ధతిలోనే ఆధార్ కార్డులు అనుసంధానం చేస్తున్నాము. కంపెనీల వారితో మాట్లాడినా వారికి కూడా జీఓలు అందలేదని చెప్పారు. గ్యాస్ ఇవ్వడం లేదు గ్యాస్ గతంలో బుక్ చేశాను. కానీ అది క్యాన్సిల్ అయ్యిందని, తిరిగి బుక్చేసుకోవాలని చెబుతున్నారు. మూడు రోజులుగా మాకు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లేదు. ఆధార్‌కార్డు లింకు ఉంటేనే బుక్ చేసుకుంటామని చెబుతున్నారు. - పుష్ప, మిర్యాలగూడ