‘కరెంట్’తో గ్యాస్‌కు లాస్!
♦ ఎలక్ట్రానిక్స్ వస్తువుల రాకతో గ్యాస్ వ్యాపారానికి గండి
♦ వాడకం పెంచాలన్న గ్యాస్ కంపెనీల సేల్ ఆఫీసర్స్
ఒకప్పుడు గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుని ఏళ్ల తరబడి వేచి చూడాల్సివచ్చేది. లేదంటే అధిక మొత్తం వెచ్చించి బ్లాక్‌లో కొనుక్కోవడమే కాకుండా అమ్మినవారి పేరుమీదే ప్రతినెలా సిలెండర్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు సీన్ మారింది. గ్యాస్ కనెక్షన్ తీసుకునేవారే కరువవడంతో పిలిచి మరీ ఇస్తున్నారు. గ్యాస్ కంపెనీల వ్యాపారానికి ఎలక్ట్రానిక్ వస్తువులు గండికొట్టడం వల్ల ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
విజయవాడ : నగరంతోపాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో గృహావసరాల కోసం వినియోగించే గ్యాస్ వాడకం తగ్గుముఖం పట్టింది. ఆయా కంపెనీలు కొద్ది మాసాలుగా అధ్యయనం చేసి జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ వాడకం తగ్గడానికి గల కారణాలు తెలుసుకున్నాయి. మార్కెట్‌లో ఎలక్ట్రికల్ కుక్కర్లు, గ్యాస్‌స్టౌల అమ్మకాలు విరివిగా పెరగడం వల్లే గ్యాస్ వినియోగదారులు తగ్గిపోతున్నట్లు గుర్తించాయి. ఈ క్రమంలో ఆయిల్ కంపెనీల సేల్స్ ఆఫీసర్లు డొమెస్టిక్ గ్యాస్ వాడకాన్ని పెంచాలని ముందుగా ఏజెన్సీలకు లేఖలు రాశారు. జిల్లాలో సగటున ఐదు శాతం డొమెస్టిక్ గ్యాస్ వాడకం పడిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు.
జిల్లాలో 60 గ్యాస్ ఏజెన్సీలుఉన్నాయి. ఒక్కో ఏజెన్సీలో సుమారు 500 సిలిండర్ల వాడకం తగ్గినట్లు తెలిసింది. అంటే నెలకు 30 వేల సిలిండర్ల అమ్మకాలు తగ్గినట్లు సమాచారం. ఒక్కో లోడుకు 450 చొప్పున నెలకు జిల్లాలో 3 వేల లోడ్లు.. అంటే 1,35,000 సిలిండర్ల అమ్మకాలు జరుగుతుంటాయి.
అడిగినవారికి లేదన కుండా కొత్త కనెక్షన్లు
గ్యాస్ ఏజెన్సీలు రెండు నెలలుగా కొత్త కనెక్షన్లు అడిగినవారికి లేదనకుండా ఇచ్చేస్తున్నాయి. దరఖాస్తు చేసుకున్నవారికి వెంటనే ఇచ్చేస్తున్నాయి. గతంలో కొత్త కనెక్షన్ పొందాలంటే వినియోగదారులు నానా అగచాట్లు పడేవారు. ఇప్పుడు ఇలా వెళ్లి అలా కనెక్షన్ తీసుకునే రోజులొచ్చాయి.
గ్యాస్ వాడకం తగ్గడానికి గల కారణాలివీ..
► {పతి ఇంట్లో వంటలు చేసుకునేందుకు ఎలక్ట్రికల్ కుక్కర్లు, చపాతీ మేకర్లు అందుబాటులోకి వచ్చాయి.
► వేడి నీళ్లకోసం గ్రీజర్లు ముమ్మరంగా వాడుతున్నారు.
► ఎలక్ట్రికల్ ఇండక్షన్ స్టౌలు కూడా రావడంతో సాధారణ గ్యాస్ స్టౌల వినియోగం తగ్గింది.
► సోలార్ విద్యుత్ కూడా అందుబాటులోకి రావడంతో గ్యాస్ వాడకం తగ్గుముఖం పట్టింది.
► నగరంలో ఇంటింటికీ పైప్‌లైన్ల ద్వారా భాగ్యనగర్ గ్యాస్‌ను సరఫరా చేస్తున్నారు.
► హోటళ్లు, తినుబండారాలు విక్రయించే చిరు వ్యాపారులో గతంలో దొంగచాటుగా డొమెస్టిక్ గ్యాస్‌నే వినియోగించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌ను రూ. 925కే ఇస్తున్నారు. 14 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ రూ. 625లకే లభ్యమవుతోంది. ధరలో రూ. 300 వ్యత్యాసం మాత్రమే ఉండడంతో అధిక శాతం వ్యాపారులు కమర్షియల్ సిలిండర్లనే కొనుగోలు చేస్తున్నారు.