
రాజకీయ ‘చెద’రంగం!
‘ఇది రాజకీయ‘చెద’రంగం... దీన్ని ఆడలేకపోయా... అందుకే మంత్రి పదవి రాలేదేమో! నా సీనియార్టీని చంద్రబాబు గుర్తించి ఆ మంత్రి పదవి ఇస్తారేమోనని భావించా!
► పార్టీలో నిబద్ధతకు గుర్తింపు లేదన్న గౌతు శివాజీ
► అధిష్టానం తీరుతో మీడియా ముందు కంటతడి
► సీనియర్ నేత కళా వెంకటరావుకు ‘ఎనర్జీ’
► రవాణా శాఖతో అచ్చెన్నాయుడికి ప్రమోషన్
► కార్మిక, క్రీడా శాఖల్లో విఫలమైనా కీలక శాఖ బాధ్యతలు
‘ఇది రాజకీయ‘చెద’రంగం... దీన్ని ఆడలేకపోయా... అందుకే మంత్రి పదవి రాలేదేమో! నా సీనియార్టీని చంద్రబాబు గుర్తించి ఆ మంత్రి పదవి ఇస్తారేమోనని భావించా! కానీ ఆశపడలేదు! పార్టీ ఆవిర్భావం నుంచి నిబద్ధతతో పనిచేస్తున్నా! దానికి గుర్తింపు రాలేదు...’ ఇదీ జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకుడు గౌతు శ్యామసుందర శివాజీ ఆవేదన! జిల్లాలో తన సమకాలీనుడైన కిమిడి కళావెంకటరావు పార్టీ మారొచ్చినా పెద్దపీట వేయడం, మరో సమకాలీన నేత ఎర్రన్నాయుడి తమ్ముడు అచ్చెన్నాయుడికి ప్రాధాన్య శాఖలతో ప్రమోషన్ ఇవ్వడం శివాజీ కన్నీటికి కారణమైందనే చర్చ మొదలైంది! కార్మిక, క్రీడా శాఖల్లో విఫలమైనా రవాణా, బీసీ సంక్షేమం వంటి కీలక శాఖలు అచ్చెన్నకు ఇవ్వడంలో అంతరార్థం బాగా పనిచేయడం కన్నా చంద్రబాబు మెచ్చిన సుగుణమేదో ఆయనలో ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో పార్టీలో తొలి నుంచి కష్టపడినవారి కంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి టీడీపీలో చేరినవారికే పెద్దపీట వేయడం రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ సీనియర్ నాయకులకు మింగుడుపడట్లేదు. జిల్లాలో పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. సోమవారం సాయంత్రం శ్రీకాకుళంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కంటతడి పెట్టారు. పార్టీ ఆవిర్భావం నుంచి నిబద్ధతతో సేవలందించినా గుర్తించకుండా అధిష్టానం మొండిచేయి చూపడాన్ని జీర్ణించుకోలేకపోయారు. మూడేళ్ల క్రితమే శివాజీకి మంత్రిమండలిలో చోటుదక్కుతుందని ఆశించినా వివిధ కారణాలు చూపించి తనకన్నా జూనియర్ నాయకుడైన అచ్చెన్నాయుడి వైపే చంద్రబాబు మొగ్గు చూపించారు. అప్పట్లో శివాజీ కుమార్తె శిరీషను పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా చేశారు.
పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్‌కు మంత్రి పదవి కల్పించడం కోసం ఎప్పటికైనా మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ జరుగుతుందని ఏడాది క్రితం నుంచే ఊహాగానాలు మొదలయ్యాయి. అప్పటి నుంచే ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు మంత్రి పదవి కోసం చాపకింద నీరులా ప్రయత్నాలు ప్రారంభించారనేది బహిరంగ రహస్యమే! పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తనకు కలిసొచ్చిన ప్రతి అంశాన్ని చక్కగా వినియోగించుకొని లోకేశ్‌కు సన్నిహితులుగా మారిపోయారు.
చివరకు లోకేశ్ సిఫారసుతోనే ఇంధన వనరులు (ఎనర్జీ) వంటి ప్రాధాన్యం ఉన్న శాఖతో జిల్లాలో రెండో మంత్రిగా అడుగుపెట్టగలిగారు. అయితే కళా పార్టీ మారొచ్చిన నేపథ్యంలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ జరిగితే జిల్లా సీనియర్‌గా తనకే మంత్రి పదవి వస్తుందని శివాజీ ఆశించారు. చివరకు తన తండ్రికి మంత్రిగా అవకాశం కల్పించడానికి ఒకవేళ తన పార్టీ పదవే అడ్డొస్తే వదులుకోవడానికీ సిద్ధమేనని శిరీష జిల్లాలో ఓ ముఖ్య నేత వద్ద చెప్పినా సదరు నేత ఆ విషయాన్ని అధిష్టానం దృష్టి తీసుకెళ్లలేదనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. తన కుమార్తె తప్ప జిల్లాలో టీడీపీ నాయకులెవ్వరూ తనకు మద్దతుగా నిలవకపోవడం కూడా శివాజీని కలిచివేసి ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
జిల్లాకు మూడేళ్లలో ఒరిగిందేమిటి?
చంద్రబాబు మంత్రివర్గంలో గత మూడేళ్లుగా అచ్చెన్నాయుడు కార్మిక, ఉపాధి, యువజన, క్రీడా శాఖలను నిర్వహించారు. అయితే ఆయా శాఖల బాధ్యతలు గాకుండా జిల్లాపై ఆధిపత్యం కోసం, ఇరిగేషన్ వంటి ఇతర శాఖల విషయాల్లో జోక్యం చేసుకోవడంతోనే ఆయన కాలం గడిపేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అభివృద్ధిలో అట్టడుగునున్న జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినా సొంత ప్రాంతానికి చేసిందేమీ లేదనే విమర్శలు ఉన్నాయి.
సిక్కోలుతో పాటు ఉత్తరాంధ్రలో దాదాపు లక్ష మంది కార్మికులకు ఏకైక ఆధారమైన జూట్ మిల్లులకు లాకౌట్ ప్రకటించారు. అనేక చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. ఈ మూడేళ్ల కాలంలో జిల్లాకు ఒక్క పరిశ్రమనూ తేలేకపోయిన అచ్చెన్న కనీసం ఆ మూతపడిన పరిశ్రమలనైనా తెరిపించలేక కార్మిక మంత్రిగా విఫలమయ్యారు. ఇక క్రీడా, యువజన సర్వీసుల శాఖలు కూడా ఆయన వద్దే ఉన్నా జిల్లాలో క్రీడల ప్రోత్సాహానికి తీసుకున్న చర్యలు లేవు. చివరకు జిల్లా కేంద్రంలో కూల్చేసిన కోడి రామ్మూర్తి స్టేడియం పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేసి దాదాపు ఏడాదైపోతున్నా మోక్షం కలగలేదు. ఇటీవల మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివెళ్లి నిరసన వ్యక్తం చేయడంతో ఆగమేఘాలపై ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే జిల్లా క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం లభించలేదు. ఇటీవల దివ్యాంగుల క్రికెట్‌లో ఇటీవల పాకిస్తాన్ జట్టును చితక్కొట్టి ప్రపంచకప్‌ను సాధించిన భారతజట్టులోని కీలక సభ్యుడు దున్న వెంకటేశ్వరరావు జిల్లావాసే! అతనికి భారీ నజరానా కాదుకదా కనీసం క్రీడాశాఖ తరఫున సన్మానం కూడా చేయలేదు.
పదవులతో మేలు జరిగేనా?
మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో అచ్చెన్నాయుడికి రవాణా, బీసీ సంక్షేమ, చేనేత, వస్త్ర మంత్రిత్వశాఖలు దక్కాయి. అలాగే కళావెంకటరావుకు ఎనర్జీ మంత్రిత్వశాఖ లభించింది. ఈ ఇద్దరు మంత్రులతో జిల్లాకు ఇకనైనా మేలు జరుగుతుందేమోనని సిక్కోలు ప్రజలు ఆశిస్తున్నారు. జిల్లాలో 80 శాతం పైగా బీసీలే! కానీ వారి జనాభా దామాషా ప్రతిపాదికన చూస్తే బీసీ రుణాలు ఏమూలకు సరిపోవట్లేదు. వంద వరకూ బీసీ సంఘాలు ఏర్పాటు చేయాల్సివున్నా జిల్లాకు ప్రస్తుతం 35కి మించి కులసంఘాలు లేవు. ఆయా సంఘాలను ఏర్పాటు చేసి, సంక్షేమానికి తగినట్లుగా నిధులు మంజూరు చేయాల్సి ఉంది. అలాగే జిల్లాలో చేనేత కార్మికులున్న గ్రామాలు వంద వరకూ ఉన్నాయి.
పొందూరు, నరసన్నపేట మండలాల్లో చేనేత క్లస్టర్లు ప్రారంభిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినా వాటికి అతీగతీ లేదు. ఇక పొందూరు ఖాదీ ప్రపంచ ఖ్యాతిగాంచినా అక్కడి ఖాదీ సంఘం, చేనేత కార్మికుల పరిస్థితి దీనావస్థలో ఉంది. చివరకు శ్రీకాకుళంలోనున్న ఖాదీ గ్రామోద్యయ సంఘాన్ని నిర్వీర్యం చేసేసి, సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా సంఘం స్థలంలో నిర్మించిన భవనాన్నీ అద్దెకు ఇచ్చేసిన ఘనత కూడా టీడీపీ ప్రభుత్వానిదే. వీటన్నింటినీ అచ్చెన్న చక్కదిద్దుతారో లేదో వేచి చూడాల్సిందే!
కళాతో ‘ఎనర్జీ’వచ్చేనా?
జిల్లాలో కొవ్వాడ అణువిద్యుత్తు పార్కుతో పాటు కాకరాపల్లి, పొలాకిలో ధర్మల్ విద్యుత్తు కేంద్రాల ఏర్పాటుకు ఇంధన వనరుల మంత్రిగా కళా వెంకటరావు ఏమేరకు కృషి చేస్తారనేదీ చర్చనీయాంశమైంది. కాకరాపల్లిలో ఈస్ట్‌కోస్ట్ థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం భరించలేక ప్రైవేట్ యాజమాన్యం అర్ధంతరంగా చేతులెత్తేసింది. దీనికి రుణం ఇచ్చిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా జెన్‌కోకు భారీ మొత్తానికి అప్పగించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నించినా ఫలించలేదు.
ఇక పోలాకిలో జపాన్ ఆర్థిక సహాయంతో నిర్మించ తలపెట్టిన ధర్మల్ విద్యుత్తు కేంద్రం కూడా ప్రతిపాదన దశలోనే ఆగిపోయింది. ఇక గుజరాత్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ కళా సొంత నియోజకవర్గంలోని కొవ్వాడకే తరలివచ్చిన అణువిద్యుత్తు పార్కు పనులు ఇప్పటివరకూ ప్రారంభం కాలేదు. దీని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా సంస్థ వెస్టింగ్ హౌస్ ఇటీవలే దివాళా పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. ఇవన్నీ అధిగమించి కళా జిల్లాకు ఎంత ‘ఎనర్జీ’ తీసుకువస్తారో వేచిచూడాల్సిందే!