
సిల్వర్ పాత్రను కత్తెరించిన దృశ్యం సిల్వర్ పాత్రలో ఇరుక్కుపోయిన చిన్నారి వరలక్ష్మి
శ్రీకాకుళం, రణస్థలం: కోష్ఠ గ్రామంలోని ఓ చిన్నారి తన ఇంటి వద్ద ఆడుకుంటున్న సమయంలో నీళ్లతో ఉన్న సిల్వర్ పాత్రలో కూర్చొని ఇరుక్కుపోయింది. బయటకు రాలేక ఆర్తనాదాలు చేయడంతో తల్లిదండ్రులు ఎచ్చెర్ల త్రినాథ్, అనసూయ గమనించి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చిన్నారి వరలక్ష్మి(4)ని చూసిన స్థానికులు కూడా ఆందోళన చెందారు. అయితే చిన్నారి తండ్రి వడ్రంగి పని చేయడంతో అతని దగ్గర ఉన్న పనిముట్లతో దాదాపు రెండు గంటల పాటు శ్రమించి, తపేలాను జాగ్రత్తగా కత్తిరించారు. చిన్నారి వరలక్ష్మికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. చలికి వేడి నీళ్లు కాచి ఇంటి వద్ద పెట్టారు. అయితే ఈ నీరు చల్లారిన తర్వాత చిన్నారి కుర్చోవడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. ఈ ఘటన గురువారం ఉదయం 10 గంటల సమయంలో జరిగినా శుక్రవారం వెలుగులోకి వచ్చింది.