దేవుడే.. తీసుకుపోయాడు!
Published Fri, Feb 28 2014 3:29 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
శివరాత్రి పర్వదినం కావడంతో ఆ దంపతులు.. తమ పిల్లలతో కలసి దేవుడి దర్శనానికని బయల్దేరారు. వచ్చీరాని మాటలతో తమ మూడేళ్ల చిన్నారి అల్లరిని దారి పొడువునా సంతోషంగా భరిస్తూ, మురిసిపోయారు. కాసేపట్లో గమ్యస్థానం చేరుకుంటారు.. ఇంతలోనే పెద్ద శబ్దం. ఏం జరిగిందో తెలుసుకునేలోపే వారు ప్రయాణిస్తున్న వాహనం పల్టీలు కొడుతోంది. అనుకోని ఈ సంఘటనతో అంతా భీతిల్లిపోయారు.. ఆ భీతి నుంచి ఇంకా బయటపడకముందే పిడుగులాంటి నిజాన్ని చూశారు. అంతవరకూ ఆటపాటలతో సందడి చేసిన తమ గారాలపట్టి.. రక్తమోడుతూ, కొనఊపిరితో గిలగిలా కొట్టుకుంటూ కళ్లముందే ప్రాణాలు వదులుతుంటే.. ఏమీ చేయలేక నిశ్ఛేష్టులై ఉండిపోయారు. దేవుడు దర్శనానికి వెళ్తున్న ఆ చిన్నారిని.. ఆ దేవుడే తన వద్దకు తీసుకుపోయాడు.
బెలగాం/గరుగుబిల్లి, న్యూస్‌లైన్ : రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక దుర్మరణం చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ గ్రామానికి చెందిన అడప రత్నాకర్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ బొబ్బిలిలో కుటుంబ సభ్యులతో కలసి నివాసం ఉంటున్నారు. శివరాత్రి సందర్భంగా పిల్లలకు పాలకొండ గ్రామంలో దేవుని వద్ద కొప్పు తీయించాలని కారులో కుటుంబ సమేతంగా బయల్దేరారు. రత్నాకరే కారు డ్రైవింగ్ చేస్తున్నాడు. గరుగుబిల్లి మండలం ఖడ్గవలస జంక్షన్ దాటిన తరువాత కారు టైర్‌కు పంక్చరైంది. దీంతో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో రత్నాకర్ కుమార్తె హరీష్మ(3) తీవ్ర గాయాలపాలై, సంఘటన స్థలంలోనే మృతి చెందింది. కుమారుడు అరుణ్‌కుమార్‌కు, రత్నాకర్‌కు తీవ్రగాయాలయ్యాయి. వీరిని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కళ్ల ముందే కుమార్తె మృతి చెందడం.. భర్త, కుమారుడు తీవ్ర గాయాలపాలు కావడంతో రత్నాకర్ భార్య కావ్య ఖిన్నురాలైంది. భోరున విలపించింది.
Advertisement
Advertisement