
తండ్రి చేతినుంచి జారిపడి.. మూసీలో చిన్నారి గల్లంతు
తండ్రి భుజాలపై ఉన్న ఓ చిన్నారి మూసీ నదిలో పడి గల్లంతైన విషాద సంఘటన గురువారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
హైదరాబాద్, న్యూస్‌లైన్: తండ్రి భుజాలపై ఉన్న ఓ చిన్నారి మూసీ నదిలో పడి గల్లంతైన విషాద సంఘటన గురువారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ చిన్నారి కోసం రాత్రి వరకు గాలించినా ఆచూకీ లభించలేదు. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం పర్వతాపూర్‌కు చెందిన చీముల సరళ, బాల్‌రెడ్డి దంపతులు పదిహేనేళ్ల క్రితం నగరానికి వచ్చి మన్సూరాబాద్ సహారా ఎస్టేట్‌లో స్థిరపడ్డారు. వీరి కుమారుడు మేఘ శ్యామ్‌రెడ్డి 12 ఏళ్ల క్రితం దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన ప్రతిభను వివాహం చేసుకుని లండన్‌లో స్థిరపడ్డారు. శ్యామ్‌రెడ్డి అక్కడ వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు ప్రమోద్‌రెడ్డి (10), శాన్వీ (5), మాన్వీ (ఏడాదిన్నర) సంతానం. ఈ కుటుంబం సెలవుల్ని గడిపేందుకు గతనెల 15న సహారా ఎస్టేట్‌కు వచ్చారు. ఈ నెల 26న లండన్‌కు తిరుగు ప్రయాణం కావలసిన ఉంది. వీరంతా బుధవారం నాగార్జునసాగర్ వెళ్లొచ్చారు.
గురువారం ఉదయం ప్రతిభ తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. శ్యామ్‌రెడ్డి.. మాన్వీ, ప్రమోద్‌లను కారులో తీసుకుని నాగోల్‌లో ఉన్న మూసీ నది వంతెన వద్దకు వచ్చారు. కుమారుడికి మూసీ గురించి వివరిస్తుండగా భుజాన ఉన్న మాన్వీ వంతెన పైనుంచి నదిలోకి పడిపోయింది. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో శ్యామ్‌రెడ్డి కిందకు వెళ్లేసరికే చిన్నారి గల్లంతైంది. సమాచారం అందుకున్న ఎల్బీ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. అది వీరికి సాధ్యం కాకపోవడంతో హయత్‌నగర్ నుంచి అగ్నిమాపక విభాగం అధికారుల్ని రప్పించి తాళ్ల సాయంతో వెతికించినా ప్రయోజనం లభించలేదు. దీంతో జీహెచ్‌ఎంసీతో పాటు ట్యాంక్‌బండ్ వద్ద విధులు నిర్వర్తించే గజ ఈతగాళ్లను తీసుకొచ్చి గాలింపు చేపట్టారు. కొద్దిదూరం వెతికేసరికి చీకటి పడడంతో సహాయక చర్యలు తాత్కాలికంగా నిలిపేశారు. తిరిగి శుక్రవారం ఉదయం ప్రారంభించనున్నారు. మేఘశ్యామ్‌రెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
విచారణ చేపట్టాలి.. బాలల హక్కుల సంఘం
మాన్వీ మూసీలో పడిన విషయం తెలుసుకున్న బాలల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అచ్యుతరావు సంఘటనా స్థలానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆడపిల్ల కావడంతో ఇందులో ఏదైనా కుట్ర ఉండి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు.