సాక్షి, అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం సాంఘీక సంక్షేమశాఖ బాలికల వసతి గృహంలో విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్న వసతి గృహంలోని బాలికల దీనస్థితిని చూసి విజిలెన్స్ డీఎస్పీ ఎం రజని చలించిపోయారు. బాలికలు స్నానం చేయాడానికి కనీస సౌకర్యాలు లేకపోవడంతో వార్డెన్ తీరుపై ఆమె మండిపడ్డారు. 126 మంది బాలికలకు కేవలం నాలుగు లీటర్ల పాలతోనే సరిపెడుతున్నారని, హాస్టల్‌లో చిన్నారులు అనారోగ్యం పాలైనా పట్టించుకోకుండా.. వార్డెన్ షేక్ నాగర్ బీబీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని డీఎస్పీ పేర్కొన్నారు.
సెప్టిక్ ట్యాంక్ పగిలిపోయి హాస్టల్ మొత్తం దుర్వాసన వస్తున్నా వార్డెన్ ఏమాత్రం స్పందించకుండా పిల్లల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. తాగడానికి, కాలకృత్యాలకు కూడా నీళ్లు లేకపోవడంతో బాలికలే బయట నుంచి నీటిని మోసుకొని వస్తున్నారు. శుభ్రం చేయని నీటిని తాగడంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని బాలికలు విజిలెన్స్ అధికారులకు తెలిపారు. ఇటీవల ఇదే జిల్లాలోని దేవరపల్లి మండలంలోని చిన్నాయిగూడెం బాలికల వసతి గృహంలో విజిలెన్స్ అధికారుల తనిఖీల్లోనూ.. బాలికల దీన పరిస్థితులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment