- విశాఖ బీచ్‌లో కోతకు గురైన రిటైనింగ్ వాల్
సాక్షి, విశాఖపట్నం: అలల ప్రకోపానికి విశాఖ బీచ్‌లో తీరం మళ్లీ కోతకు గురైంది. కురుసుర సబ్ మెరైన్ మ్యూజియంకు ముందు ఆక్వాస్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎదురుగా శనివారం ఉదయం ఉవ్వెత్తున ఎగసిపడిన అలల ఉధృతికి సుమారు 18 మీటర్ల మేర రక్షణ గోడ (రిటైనింగ్ వాల్) కోతకు గురైంది. దీంతో తీరంలో మళ్లీ అలజడి మొదలైంది. ఏక్షణాన ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియక నగర వాసులు భీతిల్లుతున్నారు. కోస్టల్ బ్యాటరీ నుంచి రుషికొండ మధ్య సముద్ర తీరప్రాంతంలో 4.5 లక్షల క్యూబిక్‌మీటర్ల ఇసుకకొరత ఉండడం వలనే తీరం కోతకు గురవుతోందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.