అనంతపురం క్రైం: ఎంత పని చేశావు దేవుడా.. బంగారు కుమారుడిని తీసుకెళ్తివే భగవంతుడా’.. అంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. నీకేం అన్యాయం చేశామయ్యా అంటూ దేవుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విలపించడం చూపరులను కలిచివేసింది. ఆ పాడు లారీ నా జీవితాన్ని నాశనం చేసిందంటూ భార్య వెక్కివెక్కి ఏడ్చింది.
వెనుక వస్తున్న లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. పెళ్లై ఎనిమిది నెలలైనా కాని ఓ పశువైద్యాధికారిని బలి తీసుకుంది. అనంతపురంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తాడిమర్రి పశువైద్యాధికారి ఎ.నవతేజ (27) దుర్మరణం చెందాడు. ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు... కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన రామాంజనేయులు (గడివేముల మండలం గడియపేటలో హెచ్‌ఎం), శారదాదేవి దంపతుల కుమారుడు ఎ.నవతేజ 2012 సెప్టెంబరులో పశువైద్యాధికారిగా ఉద్యోగం పొందాడు.
అప్పటి నుంచి తాడిమర్రిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అనంతపురం ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయంలో ఏఈగా పని చేస్తున్న సుజితతో 2013 డిసెంబర్‌లో వివాహమైంది. అనంతపురంలోని మూడో రోడ్డులో నివాసం ఉంటున్నారు. నవతేజ శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో ఇంటి నుంచి ద్విచక్ర వాహనంలో ఆర్టీసీ బస్టాండ్‌కు బయల్దేరారు. (అక్కడి నుంచి బస్సులో తాడిమర్రి వెళ్లేవారు) సైఫుల్లా ఫ్లై ఓవర్ బ్రిడ్జి (శ్రీనివాసనగర్ వైపు) దిగుతున్న సమయంలో ముందు వెళ్తున్న లారీ కాస్త స్లో అయింది. దీంతో నవతేజ బ్రేక్ వేసి వాహనం ఆపాడు. ఇదే సందర్భంలో వెనుక నుంచి ఎరువుల లోడుతో వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది.
దీంతో తీవ్రంగా గాయపడిన నవతేజ అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సర్వజనాస్పత్రికి తరలించారు. సమాచారం అందకున్న మృతుడి తల్లిదండ్రులు అనంతపురం చేరుకున్నారు. విగతజీవుడై పడి ఉన్న కుమారుడిని చూసి చలించిపోయారు. పెళ్లయిన తొమ్మిది నెలలకే కుమారుడు కన్ను మూయడాన్ని వారు జీర్ణించుకోలేక గుండెలవిసేలా రోదించారు. భార్య సుజిత కన్నీరుమున్నీరయ్యారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఎస్‌ఐ సాగర్ కేసు దర్యాప్తు చేపట్టారు.
అయ్యయ్యో..
Published Sat, Sep 6 2014 1:32 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement
Advertisement