రెండేళ్లక్రితం బదరీనాథ్... ఈ ఏడాది రాజమండ్రి... ఎక్కడ యాత్రలు జరిగినా జిల్లావాసులు వెళ్లడం... అనుకోని ప్రమాదాల్లో ఇరుక్కుపోవడం.. ఆనక వారి వివరాలకోసం అధికారులు నానా తిప్పలు పడటం ఆనవాయితీగా మారింది. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారి వివరాలు ముందే నమోదు చేయించుకునేలా చైతన్యపరిస్తే వారికి భద్రత కల్పించేందుకు... వారి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందనడంలో సందేహం లేదు.
శ్రీకాకుళం సిటీ :పుష్కరాలకు విరివిగా తరలిరావాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించడంలో అధికారులు చూపించిన శ్రద్ధ వారి భద్రత విషయంలో చూపడంలేదనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా ఎన్నో పర్యాటక ప్రాంతాలకు... యాత్రలకు జిల్లానుంచి వేలాది తరలివెళ్లడం మామూలే. వారు వెళ్లేందుకు చేసుకున్న ఏర్పాట్లు... వారిభద్రతపై తీసుకుంటున్న చర్యలు తెలుసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. ముఖ్యంగా గోదావరి పుష్కరాల విషయానికి వస్తే... జిల్లా నుంచి సుమారు ఐదు లక్షల మంది పైగా హాజరవుతున్నట్టు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. సుమారు రెండువేల మందికి పైగా అధికారులు, సిబ్బంది వివిధ శాఖలనుంచి పుష్కర విధులకోసం తరలించారు. పోస్టల్‌శాఖ కూడా రూ. 20లు చెల్లిస్తే ఇంటికే పుష్కరజలాలు అందించేందుకు కూడా ఓ ఏర్పాటు చేసింది. అంటే దాదాపు పుష్కరాలకు సంబంధించి ఎంతో కాలం ముందునుంచే అన్ని ప్రభుత్వ విభాగాలు విధి, విధానాలు ఖరారు చేసుకున్నా... యాత్రీకుల భద్రతకు సంబంధించి మాత్రం ఏవిధమైన చర్యలూ చేపట్టలేదన్నది తెలుస్తోంది.
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ లక్ష్మీనరసింహం జిల్లాలో అన్ని మండలాల్లో తహశీల్దార్‌లకు, కొన్ని శాఖల అధికారులకు యాత్రీకుల భద్రతపై పలు సూచనలు చేశారు. వారి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. అయినా ఆ దిశలో ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. పుష్కరాల ముందు నుంచే మండల స్థాయిలో ఎంత మంది యాత్ర లకు బయలుదేరుతున్నారు. వారు సురక్షితంగా తిరిగి వస్తున్నారా లేదా, టోల్‌ఫ్రీ నంబర్ పరిస్థితి, ఒక వేళ యాత్రికులకు ఇబ్బందులు తలెత్తితే ఏ చర్యలు చేపట్టాలి, ముఖ్యంగా పుష్కరాలకు కొద్ది రోజుల ముందు నుంచే ఆయా విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది. అసలు గోదావరి పుష్కరాలకు జిల్లా వాసులు ఇప్పటి వరకు ఎంత మంది వెళ్లారో కూడా అధికారుల వద్ద సమాచారం లేదు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దేవాదాయశాఖలో కూడా లేకపోవడం విశేషం.
వాహనాల స్థితిగతులపై పరిశీలన ఏదీ?
ఇప్పటివరకు రోజూ సుమారు 100 నుంచి 115 వరకు బస్సులను ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 13వ తేదీ ఒక్కరోజే సుమారు పది వేల మందికి పైగా ప్రయాణికులు పుష్కరాలకు వెళ్లారు. పుష్కరాల సమయంలో మొత్తం సుమారు లక్షమందికి పైగా ఆర్టీసీ సేవలను వినియోగించుకోనున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. అలాగే శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్ నుంచి రోజుకు 20కి పైగా రైళ్లు రాజమండ్రి మీదుగా ప్రయాణిస్తున్నట్లు, రోజుకు పదివేల మందికి పైగా జిల్లా వాసులు రైల్వే సేవలను ఉపయోగించుకుంటున్నారని ఆ శాఖ అధికారులు తెలిపారు.
ఇవి గాకుండా పలు ప్రైవేట్ వాహనాలు, కార్లు, ప్రైవేట్ బస్సులతో పాటు ఇతర సౌకర్యాల ద్వారా ప్రయాణించే వారు సుమారు మూడు లక్షలకు పైగా ఉండవచ్చని ఒక అంచనా. ఇందులో ప్రైవేటు వాహనాల్లో రక్షణ ఎంత? వాటిని పర్యవేక్షించేందుకు అధికారులు ఏమేరకు శ్రద్ధ చూపుతున్నారన్నది తెలియడంలేదు. ఇంత మంది జిల్లా వాసులు పుష్కరస్థానాలకు బయలు దేరుతున్నా.. కనీసం జిల్లా కలెక్టర్ ఆదేశాలను చాలా ప్రభుత్వ శాఖలు బేఖాతరు చేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇంకా పుష్కరాలు ఈ నెల 25వ తేదీ వరకు ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా రెవెన్యూ, దేవాదాయశాఖ తోపాటు సంబంధిత శాఖలు ప్రత్యేక దృష్టి సారించి జిల్లా వాసుల భద్రతకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
గుణపాఠాలు నేర్చుకోలేమా?
Published Fri, Jul 17 2015 1:11 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement