పుష్కర స్నానం ఎవరు చేస్తారు? అంటే సాధారణంగా పెద్దలు, వృద్ధులు, భక్తి,ఆధ్యాత్మిక భావాలున్నవారు అని టక్కున చెబుతాం.. కానీ ప్రస్తుత పుష్కరాలకు అన్ని వయసులవారూ తరలివస్తున్నారు. ముఖ్యంగా యువతరంగం ఉప్పొంగుతోంది. పుష్కర స్నానం పుణ్యఫలం అని భావించిన తల్లిదండ్రులు, నడివయస్సు వారు తమ చిన్నారులను తీసుకొస్తుంటే.. జీవిత పడమటి పొద్దున ఉన్న వృద్ధులు మళ్లీ పుష్కరాలు చూసే అవకాశం వస్తుందో లేదోనని స్నానానికి తరలివస్తున్నారు. యువత పుణ్యంతోపాటు ఆనందానుభూతులు ఆస్వాదించడానికి వెల్లువలా గోదారి చెంతకు పోటెత్తుతున్నారు. చిన్నారులు, యువకులు అఖండ గోదారి అందాలను చూసి పులకించిపోతున్నారు. గుండెనిండా గోదారిని నింపుకుని ఉత్సాహంగా పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. యువకులు నదీమతల్లి ఒడిలో సెల్ఫీలు తీసుకుంటూ విన్యాసాలు చేస్తున్నారు. ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతూ పుష్కరానుభూతులను సొంతం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పుష్కర స్నానాలకు తరలివచ్చిన యువతలో కొందరి మనోగతం ఇదీ..!
- సాక్షి, రాజమండ్రి/వీఐపీఘాట్ (రాజమండ్రి)
పుష్కరాలను ఎంజాయ్ చేశా..
మాది విజయనగరం. సోమవారం పుష్కరాలకు స్నేహితులతో కలిసి వచ్చా. ప్రయాణ కష్టాలను పక్కన పెడితే లక్షలాది మందితో గోదావరి కన్నుల పండుగగా ఉంది. భక్తి గురించి తెలియదు కానీ.. ఇంతమంది మధ్యలో పుష్కర స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేశా. మంచి అనుభూతి మిగిలింది.
- హరీష్, డిగ్రీ విద్యార్థి, విజయనగరం
పుష్కరాల కోసమే వచ్చా..
గోదావరి గురించి పెద్దలు చెబితే విన్నాం. 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాల్లో గోదాట్లో మునిగితే మంచిదన్నారు. అందుకే వచ్చాం. చాలా బాగుంది. లక్షల మందితో కలిసి గోదావరిలో మునగడం ఇంకా బాగుంది. ఎంజాయ్ చేస్తున్నాం.
- మౌనిక, ఇంజనీరింగ్ రెండో సంవత్సరం. వాసవీ కాలేజ్, హైదరాబాద్
అమ్మా.. నాన్నలు చెబితే వచ్చా..
మాది విజయవాడ. గోదావరి గురించి అమ్మానాన్నలు చెప్పారు. పుష్కరాలు చాలా గొప్పగా జరుగుతాయన్నారు. పుష్కర స్నానం చేస్తే మంచిదంట. గోదావరిలో మునగడం గొప్ప ఎంజాయ్‌మెంట్. అందుకే వచ్చా.
- మానస, ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం. బెంగళూరు దయానందసాగర్ కాలేజీ
పుష్కరాలను చూద్దామని..
పుష్కరాలను ఇంతకు ముందు చూడలేదు. ఎలా జరుగుతాయో చూడాలని వచ్చా. పైగా మా పెద్దలు గోదావరిలో మునిగితే పుణ్యమన్నారు. పుణ్యంతో పాటు ఎంజాయ్ చేయొచ్చని వచ్చా. ఆనందంగా ఉది.
- మానస,ఇంటర్ ,విశాఖపట్టణం
భక్తితోపాటు ఆనందం కూడా..
మాది నిడదవోలు. గోదావరి పుష్కరాలలో స్నానాలు చేస్తే మంచిదన్నారు. అందుకే గోదావరి తల్లిని మొక్కేందుకు వచ్చాం. భక్తితోపాటు ఆనందం కూడా పొందాం. పుష్కరాలు చూడడం మరవలేని అనుభూతి.
- శిరీష, బీటెక్, లావణ్య ఇంటర్ రెండవ సంవత్సరం
భక్తితోనే వచ్చాం..
మాది హైదరాబాద్. గోదావరి పుష్కరాలలో స్నానాలు చేస్తే మంచిదన్న నమ్మకం. మా పెద్దలు ఇదే చెప్పారు. అందుకే పుష్కరాలకు వచ్చాం. లక్షల మంది జనం మధ్య గోదావరి తీరాన్ని చూస్తే అద్భుతంగా ఉంది. చూడడానికి రెండు కళ్లూ చాలట్లేదు. ఇది మధురానుభూతి.
- అఖిల్, బీటెక్ బెంగళూర్, నీహారిక బీటెక్
రెండో సంవత్సరం, గాయత్రి కాలే జ్ వైజాగ్
గుండె నిండా గోదారి
Published Wed, Jul 22 2015 1:46 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM
Advertisement