మహాపర్వం.. చివరి అంకం
మరికొద్ది గంటల్లో గోదావరి
పుష్కర మహాపర్వానికి తెర
ముగింపు సంబరానికి భారీగా ఏర్పాట్లు
సాంస్కృతిక కార్యక్రమాలు,
లేజర్‌షో, ఆకాశదీపాల ఏర్పాటు
‘ఇంటింటా పుష్కర జ్యోతి’కి ప్రభుత్వం పిలుపు
11వ రోజూ లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు
రాజమండ్రి :
పావనవాహిని మహాపర్వం చివరి అంకానికి చేరింది. గోదావరి పుష్కరాల ముగింపు ఘడియలు మరికొద్ది గంటల్లో ఆసన్నం కానున్నాయి. 11 రోజుల పాటు జరిగిన పుష్కరాలు 12వ రోజైన శనివారం సాయంత్రం 6.38 గంటలకు ముగియనున్నాయి. ఇన్ని రోజులుగా అంచనాలకు అందనట్టు.. ఆకాశమే హద్దన్నట్టుగా కోట్ల సంఖ్యలో యాత్రికులు గోదావరి స్నానఘట్టాలకు పోటెత్తి.. పుష్కర పుణ్యస్నానాలు చేశారు. పితృదేవతలకు సద్గతులు ప్రాప్తించాలని ప్రార్థిస్తూ లక్షలాదిగా పిండప్రదానాలు నిర్వహించారు. ఈ మహాసంబరానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాదు.. దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ముగింపు వేడుకలకు విస్తృత ఏర్పాట్లు
గోదావరి పుష్కర మహోత్సవాల ముగింపు వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. రాజమండ్రి పుష్కర ఘాట్, ఆర్ట్స్ కళాశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పుష్కర ఘాట్ వద్ద గోదావరి నిత్యహారతి, లేజర్‌షోతోపాటు భారీ బాణసంచా కాల్పులు జరపనుంది. అలాగే రెండు రైల్వే వంతెనల మధ్య వేలాదిగా ఆకాశదీపాలు గాలిలోకి వదలనున్నారు. ఆర్ట్స్ కళాశాల వద్ద కూడా బాణసంచా కాల్పులు ఏర్పాటు చేశారు.
పుష్కరాల ముగింపు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘ఇంటిటా పుష్కరజ్యోతి’ నిర్వహించాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. రాత్రి ఏడు గంటల సమయంలో ప్రతి ఇంటా పుష్కర జ్యోతి వెలిగించాలని కోరింది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జన్మభూమి కమిటీలను వినియోగించుకోవాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ సూచించారు.
రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో సాయంత్రం 5.30 గంటలకు కూచిభొట్ల ఆనంద్ ఆధ్వర్యంలో వెయ్యి మంది కళాకారులతో కూచిపూడి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం భారీ సెట్టింగ్ వేస్తున్నారు.
సాయంత్రం 6 గంటలకు ప్రముఖ సంగీత విద్యాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత కచేరీ.
రాత్రి 7.30 గంటలకు హరిప్రసాద్ చౌరాసియా, విశ్వమోహన్ బృందం ఆధ్వర్యంలో పంచతత్వ క్లాసికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్.
సాయంత్రం 4 గంటలకు ఆనం కళాకేంద్రంలో కె.దుర్గమ్మ బృందం ఆధ్వర్యంలో రేలా జానపద నృత్య ప్రదర్శన.
5 గంటలకు వై.నాగరాజు బృందం ఆధ్వర్యంలో యక్షగానం.
6 గంటలకు ప్రముఖ మృదంగ విద్వాంసులు యల్లా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మృదంగం విన్యాసం.
రాత్రి 8.30 గంటలకు సురభి నాటక ప్రదర్శన
11వ రోజూ భక్తుల తాకిడి
మరొక్క రోజులో పుష్కరం ముగుస్తున్న నేపథ్యంలో శుక్రవారం పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలకు తరలివచ్చారు. జిల్లావ్యాప్తంగా 32 లక్షల మందికి పైగా పుణ్యస్నానాలు చేశారు. రాజమండ్రి నగరంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం భక్తుల తాకిడి అధికంగా ఉంది. రాజమండ్రిలో కోటిలింగాలు, పుష్కరఘాట్‌లు రద్దీతో కిటకిటలాడాయి. కోటిలింగాల ఘాట్‌లో 7 లక్షలమంది పైగా భక్తులు స్నానాలు చేసినట్టు అంచనా. గ్రామీణ ఘాట్‌లలో కోటిపల్లి, సోంపల్లి, అంతర్వేది, అప్పనపల్లిల్లో సైతం భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు చేశారు. కోటిపల్లిలో 1.80 లక్షల మంది భక్తులు స్నానాలు చేశారు. రాజమండ్రిలో గోదావరి నిత్యహారతికి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాత్రి 6.30 గంటలకు నిత్యహారతి మొదలవుతుండగా, సాయంత్రం 4 గంటలకే పుష్కరఘాట్ నిండిపోయింది. దీంతో ఈ కార్యక్రమానికి ఎంతో ఆశతో వచ్చినవారు నిరాశతో వెనుదిరిగారు. టీటీడీ నమూనా ఆలయం నుంచి సరస్వతీ ఘాట్ వరకూ కోలాటాలు, బాజాభజంత్రీలతో సాగిన శ్రీనివాసుని ఊరేగింపులో స్థానికులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తులు వి.రామసుబ్రహ్మణ్యం, వాసుకి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, సినీ దర్శకుడు బోయపాటి శ్రీను, సినీనటి, మాజీ ఎంపీ జమున, సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి తదితరులు పుష్కర స్నానాలు చేశారు.
3 కోట్లమంది పైగా భక్తుల పుణ్యస్నానాలు
పుష్కరాలు ఆరంభమైన తరువాత జిల్లావ్యాప్తంగా శుక్రవారం రాత్రి వరకూ 3.05 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. గత పుష్కరాలకు 2.19 కోట్ల మంది భక్తులు వచ్చారు. శనివారం పుష్కరాలు పూర్తయ్యే సమయానికి సుమారు 3.40 కోట్ల మంది స్నానాలు చేసే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత పుష్కరాలతో పోల్చుకుంటే ఈ ఏడాది పుష్కరాలకు భారీ ఎత్తున భక్తుల రావడానికి ప్రభుత్వం, మీడియా, సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం ఒక కారణమైంది. దీనికితోడు రవాణా వ్యవస్థ మెరుగుపడడం వల్ల కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.