సాక్షి, రాజమండ్రి :గోదావరి పుష్కరాల ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైందని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ చెప్పారు. రోజూ తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ మాత్రమే ఘాట్లలో స్నానాలకు భక్తులను అనుమతి ఇస్తారని వెల్లడించారు. తర్వాత నదిలో పేరుకుపోయిన చెత్త సేకరణ మొదలవుతుందని చెప్పారు. ఆదివారం సాయంత్రం రాజమండ్రి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి సోమవారం సాయంత్రం రాజమండ్రి రానున్నారని చెప్పారు. మంగళవారం ఉదయం కుటుంబ సమేతంగా ఆయన పుష్కర స్నానం చేస్తారని వివరించారు. పుష్కరాలకు దాదాపు మూడున్నర కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న దృష్ట్యా రాజమండ్రిలో ట్రాఫిక్‌ను మూడు అంచెల్లో క్రమబద్ధీకరించేందుకు డైనమిక్ ప్లాన్ అమలు చేయనున్నట్లు తెలిపారు.
ఈ ప్రకారం సోమవారం సాయంత్రం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయని, నగర ప్రజలు సహకరించాలని మంత్రి నారాయణ కోరారు. కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ పుష్కరాల పనులన్నీ పూర్తయ్యాయని, కేవలం తుది మెరుగులే మిగిలాయని చెప్పారు. అన్ని ఘాట్‌ల నుంచి సమాచారం సేకరించి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. అక్కడ అన్ని శాఖల అధికారులు ఉంటారని, ముఖ్యమంత్రి కూడా ఇక్కడి నుంచే పరిశీలించే అవకాశం ఉందని చెప్పారు. ఘాట్‌లలో సమాచారం ఎప్పటికప్పుడు పంపించేలా ఘాట్ ఇన్‌చార్జిలకు ట్యాబ్లెట్‌లు ఇస్తున్నామని వివరించారు. భక్తులకు తాగునీటిని ఉచితంగా అందజేస్తామని, ప్రతిరోజూ 10 లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామని చెప్పారు.
నిత్యావసరాల ధరల నియంత్రణ
నిత్యావసరాల ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. కిలో టమాటా రూ.20, ఉల్లిపాయలు రూ.20, బంగాళాదుంపలు రూ.10, కందిపప్పు రూ.96, బీపీటీ బియ్యం రూ.30 చొప్పున రైతుబజార్లలో విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సంచార రైతుబజార్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
హెలికాప్టర్‌లో గగన విహారం
పుష్కర శోభతో కళకళలాడుతున్న రాజమండ్రిని పది నిమిషాలపాటు గగనతలం నుంచి తిలకించడానికి పవన్‌హన్స్ ఏర్పాట్లు చేస్తోందని మంత్రి నారాయణ వెల్లడించారు. ఇందుకు రూ.1,999 టికెట్ తీసుకోవాలని, ఆర్ట్స్ కాలేజీ వద్ద టికెట్ కౌంటర్ ఉంటుందని చెప్పారు. టికెట్లు తీసుకున్నవారిని అక్కడి నుంచి మధురపూడి విమానాశ్రయానికి బస్సులో తీసుకెళ్లి తీసుకొస్తారని వెల్లడించారు.
అన్నదానానికి ఏర్పాట్లు
రోజూ నాలుగు లక్షల మంది భక్తులకు అన్నదానం చేయడానికి వీలుగా 61 ఆధ్యాత్మిక, ధార్మిక, స్వచ్ఛంద సంస్థలకు అనుమతి ఇచ్చినట్లు రాజమండ్రి సబ్‌కలెక్టర్ విజయరామరాజు చెప్పారు. దాదాపు 3 వేల మంది సహాయకులు సత్యసాయి, అమ్మభగవాన్, ఆర్‌ఎస్‌ఎస్ తదితర సంస్థల నుంచి వస్తున్నారని వెల్లడించారు. వికలాంగులు ఘాట్ వద్దకు వచ్చి క్షేమంగా తిరిగివెళ్లేలా ఒక్కో వీల్‌చైర్‌తోపాటు ఒక్కో సహాయకుడు ఉంటారని చెప్పారు. ఎన్‌ఎస్‌ఎస్ క్యాండెట్లు 400 మంది వరకూ ట్రాఫిక్ నియంత్రణలో సహాయం అందిస్తారన్నారు. అలాగే నదిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా తక్షణం రంగంలోకి దిగేందుకు జాతీయ ప్రకృతి విపత్తుల నియంత్రణ సంస్థ (ఎన్‌డీఆర్‌ఎస్), నావికాదళం నుంచి బృందాలు వచ్చాయని చెప్పారు. భక్తులకు పుష్కరాల సమాచారం ఇచ్చేందుకు రాజమండ్రిలో 48 చోట్ల సమాచార కేంద్రాలు ఏర్పాటు చేశామని, వాటిలో ప్రధానమైన 25 కేంద్రాల్లో జీపీఎస్ సౌకర్యం కూడా కల్పించినట్లు వివరించారు. అలాగే 8333000020 నంబరుకు మిస్డ్‌కాల్ ఇస్తే పుష్కరాల సమాచారం ఫోల్‌లో అందించేందుకు ఐవీఆర్‌ఎస్ ద్వారా ఏర్పాటు చేసినట్లు వివరించారు. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఏర్పాట్లు పూర్తి
Published Mon, Jul 13 2015 1:42 AM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM
Advertisement
Advertisement