భద్రాచలం, న్యూస్‌లైన్ : ఉగ్రరూపం దాల్చిన గోదావరి నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. భద్రాచలం వద్ద సోమవారం రాత్రి 8 గంటలకు నీటిమట్టం 52.7 అడుగులకు చేరుకోవటంతో మూడో ప్రమాదహెచ్చరికను ఉపసంహరిస్తున్నట్లు భద్రాచలం సబ్ కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ప్రకటించారు. వరద తగ్గినా గోదావరి పరీవాహక ప్రాంతంలోని పలు గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. వాజేడు, కూనవరం, వీఆర్‌పురం మండలాలకు సోమవారం కూడా రాకపోకలు సాగలేదు. ఈ మండలాల్లో గ్రామాలు వరద ముంపులోనే ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భద్రాచలం నుంచి వెంకటాపురం వరకూ..., అదే విధంగా చింతూరుకు వెళ్లే రహదారులపై వరద నీరు తొలగిపోవడంతో వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. రామాలయం స్నాన ఘట్టాల వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాలు వరద ముంపు నుంచి బయట పడ్డాయి. దీంతో ఈ ఆలయాలను అర్చకులు శుభ్రం చేశారు. వాజేడు మండలం ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది. చీకుపల్లి వాగుకు అవతల ఉన్న 32 గ్రామాలకు ఎటువంటి రాకపోకలు లేవు. కి లోమీటరు మేర రహదారిపై వరద నీరు ఉండటంతో పడవల ద్వారా ప్రయాణం చేయటం కష్టంగా మారింది.
దీంతో గ్రామాలకు బయటిప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. వరద కొద్దిగా తగ్గుముఖంపట్టినప్పటికీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లు నీటిలోనే ఉండటంతో సరఫరాను పునరుద్ధరించలేదు. దీంతో భద్రాచలం, పాల్వంచ డివిజన్‌లలోని 573 గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. ముంపు ప్రాంతాల్లో కిరోసిన్ కూడా అందుబాటులో లేకపోవటంతో బాధితులు చీకట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇదిలా ఉండగా సోమవారం డివిజన్‌లో విస్తారంగా వర్షం కురిసింది. దీంతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు నుంచి 19 గేట్లను ఎత్తి 70 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
రామాలయం వీధులు :
భద్రాచలం పట్టణంలోని రామాలయం వీధులు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. సుభాష్ నగర్ కాలనీలోకి ప్రవేశించిన వరద నీరు రామాలయం వరకూ రావటంతో పాటు కరకట్ట స్లూయిస్ లీకుల ద్వారా వచ్చిన నీరు తోడైంది. దీంతో రామాలయానికి వెళ్లే దారిలో పడవలపై ప్రయాణించాల్సి వచ్చింది. విస్తాకాంప్లెక్స్ పూర్తిగా వరద నీటిలోనే మునిగిపోయింది. శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం జరిగే మిథిలాస్టేడియంను వరద నీరు చుట్టిముట్టింది. పరిసర ఇళ్ల వారు తానీషా కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో తలదాచుకుంటున్నారు. ఇళ్లల్లో సామాన్లన్నీ తడిసిపోవటంతో గత పది హేను రోజులుగా వ్యాపారాలు సాగకపోవటంతో విస్తాకాంప్లెక్స్ దుకాణ దారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వరద తగ్గినప్పటికీ ఇక్కడ నీటిని మోటార్‌ల ద్వారా బయటకు పంపిస్తే తప్ప దుకాణాలు బయటపడే అవకాశం లేదు. నీటిపారుదలశాఖ ఈఈ శ్రావణ్‌కుమార్ పర్యవేక్షణలో అధికారులు ప్రత్యేక మోటార్‌లను ఏర్పాటు చేసి నీటిని తోడే ప్రయత్నం చేస్తున్నారు.
వరదలతో అతలాకుతలం :
అధికారులు ముంపు గ్రామాలను సందర్శించకపోవటంతో బాధితులకు ఎటువంటి సాయం అందటం లేదు. ముంపు గ్రామాల్లో అసలు ఏం జరుగుతోందో కూడా తెలియని పరిస్థితి ఉంది. విద్యుత్‌సరఫరా లేక సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతినటంతో గ్రామాల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం రావటం లేదు. జిల్లా అధికార యంత్రాంగం ప్రకటిస్తున్న నివేదికలకు, గ్రామ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న పునరావాస శిబిరాలకు ఎక్కడా పొంతన లేకుండా ఉంది. చింతూరు మండలంలోని చూటూరు గ్రామాన్ని మూడు రోజులుగా వరదనీరు చుట్టిముట్టినప్పటికీ ఏ ఒక్క అధికారి కూడా గ్రామాన్ని సందర్శించ లేదు. ఆ గ్రామ సర్పంచ్ సవలం దాలయ్య సోమవారం మండల కేంద్రాన్ని వచ్చి సెక్టోరియల్ అధికారిని నిలదీశాడు. అధికారులు ముంపు గ్రామాలను సందర్శించకుండా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితులు అంటున్నారు. గ్రామాలను వరద నీరు విడిచినప్పటికీ పారిశుధ్య చర్యలపై అధికారులుదృష్టి సారించటం లేదు. దీంతో గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జ్వర పీడితులు సంఖ్య పెరుగుతూనే ఉంది. పునరావాస శిబిరాల్లో సరైన సౌకర్యాలు లేకపోవటంతో బాధితులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
అమాత్యులెక్కడ : వరదలతో భద్రాచలం, పాల్వంచ డివిజన్‌లలోని వందలాది గ్రామాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నా వారిని పరామర్శించే వారే కరువవుతున్నారు. వరద ఉగ్రరూపం దాల్చినా ఇప్పటి వరకూ జిల్లాకు చెందిన మంత్రి ఇటు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ప్రభుత్వం దృష్టి సారించకపోవటంతో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు అంటున్నారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పునరావాస చర్యలు చేపట్టకపోతే ముంపు ప్రాంతాల్లో మరి కొన్ని మరణాలు సంభవించే అవకాశం ఉందని ఈప్రాంత వాసులు అంటున్నారు.
భద్రాచలం వద్ద 52.7 అడుగుల నీటిమట్టం
Published Tue, Aug 6 2013 4:20 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM
Advertisement