Water canels
-
కాంట్రాక్టర్లకు కాసుల పండుగ.. రైతులకు తప్పని ఇక్కట్లు
సాక్షి, సరుబుజ్జిలి(శ్రీకాకుళం): మండల పరిధిలో సుమారు 4500 హెక్టార్ల సాగు భూమిని కాలువలపై ఆధారపడి సాగు చేస్తున్నారు. అయితే ఈ కాలువ గట్లు సక్రమంగా లేకపోవడంతో ప్రతి ఏటా రైతులకు కష్టాలు తప్పడం లేదు. వంశధార కుడి ప్రధాన కాలువతో పాటు పిల్ల కాలువలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ విషయమై వంశధార అధికారులకు పలు సమావేశాల్లో అందించిన వినతులు బుట్టదాఖలవుతున్నాయి. గత రెండేళ్లకాలంలో వంశధార కాలువలకు నీరు చెట్టు పథకంలో భాగంగా చేపట్టిన పనుల వలన కాంట్రాక్టర్ల జేబులు నిండాయి తప్ప రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో టీడీపీ నాయకులు తూతూమంత్రంగా పనులు నిర్వహించారని అంటున్నారు. దీంతో ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువ గట్లను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. -
ఆక్రమణల కూల్చివేత మంచిదే
-
ఆక్రమణల కూల్చివేత మంచిదే
కానీ చట్ట ప్రకారం వ్యవహరించండి: హైకోర్టు రాష్ట్రంలో నాలాలు, చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు అభినందనీయమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ కూల్చివేతల విషయంలో చట్ట ప్రకారం వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఆక్రమించినవారిగా పేర్కొంటున్నవారికి నోటీసులు ఇవ్వకుండా, వాదనలను వినిపించే అవకాశమివ్వకుండానే కూల్చివేతలకు ఉత్తర్వులు జారీ చేయరాదని మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించింది. రెండు వారాల గడువు ఇచ్చి వారి వాదన వినాలని.. తర్వాతే కూల్చివేతలపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. చట్టాల అమలు విషయంలో సమతుల్యత పాటించాల్సిన బాధ్యత అటు ప్రభుత్వంపై, ఇటు న్యాయస్థానంపై ఉందని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. - సాక్షి, హైదరాబాద్ రెండో రోజు విచారణలో.. తమవి అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కొందరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం జరిగిన విచారణ సందర్భంగా.. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యహరిస్తున్నారని పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు. అయితే నాలాలు, చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినందునే కూల్చివేస్తున్నామని జీహెచ్ఎంసీ, రెవెన్యూశాఖల తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి కోర్టుకు నివేదించారు. దశల వారీగా కూల్చివేత చేపడుతున్నామని.. అన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని చెప్పారు. దీంతో అందరికీ వర్తించేలా ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పిన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు.. ఎటువంటి సందిగ్ధతకు తావు లేకుండా శుక్రవారం నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ‘‘జీహెచ్ఎంసీ పరిధిలో నాలాలు, చెరువులను ఆక్రమించుకుని 28 వేల నిర్మాణాలు వెలిశాయన్న విషయంలో ఎటువంటి వివాదం లేదు. ఈ ఆక్రమణలున్న విషయం నిర్దిష్ట కాలం నుంచే అధికారులకు తెలుసు (పత్రికా కథనాల ప్రకారం నాలుగు సంవత్సరాలుగా). అయినా అధికారులు వాటివైపు కన్నెత్తి చూడలేదు. మరిన్ని అక్రమ నిర్మాణాలు వెలిసేందుకు అనుమతిచ్చారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూశాఖల్లో అవినీతి ఉందన్న విషయంలోనూ వివాదం లేదు. ఓ నిర్మాణం కూల్చివేత సమర్థనీయమా, కాదా? అది ఏకపక్షమా.., కపట ఉద్దేశాలున్నాయా? అన్న విషయాలను న్యాయస్థానాలు పట్టించుకోకుండా పక్కకు వెళ్లవు. ఇటువంటి వ్యవహారాల్లో పౌరుల వైపు నుంచి ఆలోచించాలని ఓ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అక్రమ నిర్మాణాలకు పౌరులు మాత్రమే ఎందుకు బాధితులుగా మారాలని, ప్రభుత్వానికి ఎందుకు బాధ్యత ఉండకూడదని ఆ తీర్పులో ప్రశ్నించింది. దశాబ్దాల తరబడి చట్టాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో... బాధితులకు న్యాయస్థానం అండగా ఉండకపోవడానికి ఎటువంటి కారణం కూడా లేదని సుప్రీం పేర్కొంది. ఆ తీర్పు ఇప్పుడు ఈ కేసులకు కూడా వర్తిస్తుంది. ఆక్రమణలంటూ మున్సిపల్, రెవెన్యూ అధికారులు పెద్ద సంఖ్యలో కూల్చివేతలకు దిగారు. ముందు నోటీసులు ఇవ్వడం గానీ, అధికారుల చెబుతున్న వాటితో విభేదించేందుకు అవకాశం గానీ ఇవ్వడం లేదు. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే ఇది చెల్లుబాటు కాదు..’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. కుటుంబాలన్నీ రోడ్డున పడతాయి సహజ న్యాయసూత్రాలను పాటించాల్సిన అవసరం లేదని చట్టం స్పష్టంగా చెబుతుంటే తప్ప.. ఉత్తర్వులు జారీ చేసే ముందు వాదన వినిపించే అవకాశమివ్వడం తప్పనిసరని న్యాయమూర్తి పేర్కొన్నారు. అంతేగాకుండా ఆ చర్య వల్ల వ్యక్తిగత హక్కులు, ఆస్తి, వస్తు నష్టం వంటి పరిణామాలు ఏర్పడే అవకాశమున్నన్నప్పుడు కూడా వాదనలకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దీనికి మినహాయింపు ఉంటుందని.. ఆ అత్యవసర పరిస్థితేమిటో చెప్పి సమర్థించుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంటుందని చెప్పారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, తమ నిర్మాణాలు సక్రమమైనవేననే ఆధారాలు చూపే అవకాశం కూడా ఇవ్వకపోతే అధికారుల ఏకపక్ష చర్యల నుంచి ప్రజలకు రక్షణ ఉండదన్నారు. తద్వారా పౌరులకు తీరని నష్టం వాటిల్లుతుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ‘‘మహిళలు, పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు కుటుంబాలతో సహా రోడ్డునపడతారు. తీవ్ర మనోవేదనకు, ఇబ్బందులకు గురవుతారు. ఆక్రమణల గురించి తెలిసీ అధికారులు ఇంత కాలం మౌనంగా ఉన్నారు. ఆక్రమణలుగా చెబుతున్న స్థలాల్లో ఉంటున్న వారి వాదనలను వినిపించేందుకు.. ఆ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లేందుకు తగిన గడువు ఇవ్వడం ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఎంతో సముచితం. నాలాలు, చెరువులను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారని ఎవరినైతే అనుమానిస్తున్నారో వారందరికీ నోటీసులు జారీ చేయండి. అవి అక్రమ నిర్మాణాలనేందుకు ఉన్న ఆధారాలు ఇవ్వండి. కూల్చివేతలకు దారి తీసిన పరిస్థితులను ప్రస్తావించండి. నోటీసులకు స్పందించేందుకు, స్థలాన్ని విడిచి వెళ్లేందుకు రెండు వారాల గడువు ఇవ్వండి. తరువాత తగిన నిర్ణయం వెలువరించి, కూల్చివేత ఏ విధంగా సమర్థనీయమో వివరించండి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశాకే కూల్చివేతల చర్య తీసుకోండి..’’ అని అధికారులకు న్యాయమూర్తి ఆదేశించారు. ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఆ స్థలంలో తదుపరి నిర్మాణాలేవీ చేపట్టడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ.. విచారణను అక్టోబర్ 18కి వాయిదా వేశారు. -
చేతులు కాలాక.. నాలాలు
ఇన్ బాక్స్: తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకి దాదాపు అన్ని చెరువులు, కుంటలు, ప్రాజెక్ట్‌లు నిండాయి. హైదరా బాద్‌లో దశాబ్దాలుగా నాలాలను ఆక్ర మించి ఇళ్లు కట్టుకోవడంతో జరుగుతున్న ఉత్పాతం ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. దీనికి తోడు, నాలాలలో పూడిక సరిగ్గా తీయక నీళ్లు రోడ్లపైకి పారి ప్రజలకి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆక్రమణలకు గురైన చోట నాళాలు నీటి ఉధృతికి తట్టుకోక చాలా ప్రాంతాలలో ఇండ్లలోకి అపార్ట్ మెంట్లలోకి నీళ్లు వచ్చాయి. నాలాలపై అక్రమంగా ఇండ్లు కట్టుకున్న వారు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారన్నది నిజమే కానీ అక్రమ కట్టడాలను, నాలాల పరీవాహక ప్రాంతాలని సరిచేయకపోతే మునుముందు చాలా ప్రమాదకరం. కిర్లోస్కర్ నివేదిక ప్రకారం నగరంలో 28 వేల నాలా అక్రమ కట్టడాలు ఉన్నాయని తెలుస్తోంది. నిజాం పేటలోని బండారి లే అవుట్ సముద్రంగా మారడంతో ప్రజల ఇబ్బందులు అంతాఇంతా కాదు. నాలాలపై అక్రమ కట్టడాలు తొల గించాల్సిందే కాని ఇళ్లు కోల్పో యిన వారికి సరైన ఆవాసం ఏర్ప రిచి ప్రక్షాళన చేస్తేనే రేపటి భారీ వర్షాలను ఎదుర్కొని నిలబడగలం.. కనీ వినీ ఎరుగకుండా దెబ్బతిని పోయిన అనేక ప్రాంతాల్లో మామూలు పరిస్థి తులు వచ్చేలా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలి, భారీవర్ష బాధిత కుటుం బాలకి చేయూత నివ్వాలి. జరుుని రాజేశ్వర్, కాప్రా, హైదరాబాద్ స్వేచ్ఛ, స్వతంత్రం మీకేనా? నా కోసం ఎదురుచూస్తారని తెలుసు/నేను వస్తే పులకించిపోతారని తెలుసు అందుకే నా రాక ఆలస్యమైనా, కచ్చితంగా వస్తానని తెలుసు/మీరు రమ్మన్నప్పుడు నేను రావడానికి చెరువులు, చెట్లను రక్షించారా!/కాలుష్యాన్ని తగ్గిస్తున్నారా!/పోనీ ఈ మారుతున్న కాలానికి,/నా కోసం ఒక ఇంకుడుగుంతనైనా ఏర్పాటు చేసుకున్నారా! చెప్పండి./నాకు చెన్నై పైన లేదు కోపం/హైదరాబాద్ పైన అంతకంటే లేదు. ఎప్పుడొస్తానో తెలియదు/వచ్చినప్పుడు ఎంత మేలు చేస్తానో...అందరికీ తెలుసు/అలాగని భూమాత అంత సహనం నాకు లేదు./ మా 5 గురిలోఎవరికి కోపం తెప్పించినా పరవాలేదు కానీ, /భూమాత సహనాన్ని పరీక్షించాలనుకుంటే మాత్రం/మేమంతా ఒక్కటై ముంచెత్తుతాం జాగ్రత్త!/నా రాక కోసం ఎదురు చూస్తారు/మిమ్మల్ని పలకరిద్దామని వచ్చా!/ఆనందిస్తారు! నష్టం చేసిందం టారు/నష్టాన్ని ఆకాశం నుంచి పరిశీలిస్తారు/విహార యాత్ర చేయడానికి వెళ్ళినట్లు ఉంటుంది /పనులు పేరుకుపోయారుు అంటారు/పేరుకుపోరుున చెత్తను కడిగేశా! నేనంతే!/నా దిశ మారింది../నేను వచ్చి కొన్ని రోజులైనా... అన్నింటినీ/ నిండు కుండల్లా నింపా/ఎంతైనా అనుకున్నట్లు ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ కాలం కదా! కబ్జాల కాలం. అవినీతి కట్టడాల కాలం/ఎక్కడ ఉండమంటారు చెప్పండి. నన్ను స్వేచ్ఛగా ఉండనిచ్చే కాలమా! ఇది/నాకు కూడా స్వేచ్ఛ, స్వతంత్రం కావాలి. ఇట్లు మీ వాన అలియాస్ వర్షం - తలారి సుధాకర్, కరీంనగర్ -
సాగు నీటి కోసం జాగారం
బాల్కొండ,న్యూస్‌లైన్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి కోసం ఆయక ట్టు రైతులు కాలువల వద్దనే పగలూ,రాత్రి కాపలా కాస్తున్నారు. తాము సాగు నీటి కోసం అవస్థలు పడుతుంటే పాలకులు మాత్రం ప్రాజెక్టు నుంచి పొరుగు జిల్లాలకు దర్జాగా సరఫరా చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లక్ష్మీ కాలువ ఆధారంగా నిర్మించిన వేంపల్లి, నవాబు ఎత్తిపోతల పథకం వద్ద ఈ పరిస్థితి నెలకొంది. సక్రమంగా నీటి పంపకాలు చేయడంలో అధికారులు విఫలం కావడంతో రైతులు కాలువ వద్ద టెంట్లు వేసుకుని మరీ కాపలా కాస్తున్నారు. తమ వంతు వచ్చే వరకూ ఎదురు చూస్తున్నారు. కాలువ వద్దనే టెంట్లు వేసుకుని జాగారం చేస్తున్నారు. వేంపల్లి ఎత్తి పోతల పథకం నుంచి నీటి పంపకాలను సక్రమంగా చేయడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో రైతుల మధ్య అవగాహన కుదరక వారు వంతుల వారీగా నీటి కోసం కాలువ వద్ద కాపలా కాస్తున్నారు. ఎత్తి పోతల నుంచి పది రోజుల పాటు నవాబు లిఫ్ట్‌కు నీరందించాలని అధికారులు నిర్ణయించారు. అదే కాలువకు ఉన్న మిగతా గ్రామాల ఆయకట్టు రైతులు తూం లను తెరవడం ద్వారా నీరు గమ్యానికి చేరడంలేదు. దీంతో నవాబు లిఫ్ట్ గ్రామాల రైతులు వంతుల వారీగా కాపలా కాస్తున్నారు. కాలువలు సైతం పూడికతో, ముళ్ల పొదలతో నిండి నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నవాబు లిఫ్ట్ గ్రామాలు నవాబు లిఫ్ట్ గ్రామాలు వేల్పూర్, లక్కోర, వెంకటాపూర్, అంక్సాపూర్, సాహెబ్పేట్ ,కుకునూర్, కోమన్‌పల్లి, అమీనాపూర్, దొన్కల్ గ్రామస్తులు కాలువ వద్ద అక్కడక్కడ ఎనిమిది చోట్ల గ్రామస్తులు నీటి కోసం వంతుల వారీగా కాపలా కాస్తున్నారు. ఎముకలు కొరికే చలిలో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందుల నడుమ కాపలా కాస్తూ నీటిని నవాబు లిఫ్ట్‌కు చేర్చుతున్నారు. నీటి వినియోగదారుల సంఘాలు విఫలం నీటి పంపకాలపై రైతులకు అధికారులకు మధ్య సమన్వయపరచాల్సిన నీటి వినియోగదారుల సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయి. దీంతో రైతులు నీటి కోసం పడిగాపులు కాస్తున్నారు. వేంపల్లి లిప్ట్ రెండో యూని ట్ ఆధారంగా చెరువులు నింపే గ్రామాలకు వంతుల వారీగా నీటిని విభజించి చెరువులు నింపాలి. అలా ఒకరి వంతులో ఒకరు నీటిని వినియోగించుకోకుండా నీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులు మాట్లాడాలి. కాని వారి పదవీ కాలం కూడా దగ్గర పడటంతో రైతులను వారు పట్టించు కోవడం లేదనే విమర్శలున్నాయి. దీంతో రైతుల మధ్య విభేదాలు తలెత్తే పరి స్థితి ఏర్పండింది. నీళ్ల కోసం కొట్లాడుకునే పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పం దించాలని రైతులు కోరుతున్నారు. -
కొనసాగుతున్న కృష్ణమ్మ పరవళ్లు
నాగార్జునసాగర్, న్యూస్‌లైన్: నాగార్జునసాగర్ జలాశయం నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతుంది. మంగళవారం ఎన్ఎస్పీ అధికారులు నాగార్జునసాగర్ జలాశయం నుంచి 6 క్రస్ట్‌గేట్లను ఐదు అడుగుల మేర పైకి లేపి దిగువకు 48,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నెల 17 సాగర్ జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యానికి (590 అడుగులకు) చేరడంతో ఎన్ఎస్పీ అధికారులు నాలుగు క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి ఇన్‌ఫ్లో పెరడగంతో ఈ నెల 18న ఆరుగేట్లు, 19న 8 గేట్లకు పెంచారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లో తగ్గడంతో మంగళవారం అధికారులు నీటి విడుదలను 8 గేట్ల నుంచి 6 క్ర స్ట్గేట్లకు కుదించారు. నాగార్జునసాగర్ జలాశయ గరిష్టనీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం పూర్తిస్థాయి నీటిమట్టం ఉంది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 1,04,371 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తుండటంతో కుడి, ఎడమ, వరద కాల్వలతో పాటు ఎస్ఎల్బీసీ ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 1,01,478 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. పర్యాటకులు సందడి నాగార్జునసాగర్‌లో మంగళవారం పర్యాటకులు సందడి నెలకొన్నది. సాగర్ జలాశయం పూర్తిస్థాయిలో నిండటంతో పాటు ఎన్ఎస్పీ అధికారులు ఆరు క్రస్ట్‌గేట్లను పైకి ఎత్తి నీటిని కిందకి విడుదల చేస్తుండడంతో సాగర్ అందాలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు -
భద్రాచలం వద్ద 52.7 అడుగుల నీటిమట్టం
భద్రాచలం, న్యూస్‌లైన్ : ఉగ్రరూపం దాల్చిన గోదావరి నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. భద్రాచలం వద్ద సోమవారం రాత్రి 8 గంటలకు నీటిమట్టం 52.7 అడుగులకు చేరుకోవటంతో మూడో ప్రమాదహెచ్చరికను ఉపసంహరిస్తున్నట్లు భద్రాచలం సబ్ కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ప్రకటించారు. వరద తగ్గినా గోదావరి పరీవాహక ప్రాంతంలోని పలు గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. వాజేడు, కూనవరం, వీఆర్‌పురం మండలాలకు సోమవారం కూడా రాకపోకలు సాగలేదు. ఈ మండలాల్లో గ్రామాలు వరద ముంపులోనే ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భద్రాచలం నుంచి వెంకటాపురం వరకూ..., అదే విధంగా చింతూరుకు వెళ్లే రహదారులపై వరద నీరు తొలగిపోవడంతో వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. రామాలయం స్నాన ఘట్టాల వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాలు వరద ముంపు నుంచి బయట పడ్డాయి. దీంతో ఈ ఆలయాలను అర్చకులు శుభ్రం చేశారు. వాజేడు మండలం ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది. చీకుపల్లి వాగుకు అవతల ఉన్న 32 గ్రామాలకు ఎటువంటి రాకపోకలు లేవు. కి లోమీటరు మేర రహదారిపై వరద నీరు ఉండటంతో పడవల ద్వారా ప్రయాణం చేయటం కష్టంగా మారింది. దీంతో గ్రామాలకు బయటిప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. వరద కొద్దిగా తగ్గుముఖంపట్టినప్పటికీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు నీటిలోనే ఉండటంతో సరఫరాను పునరుద్ధరించలేదు. దీంతో భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని 573 గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. ముంపు ప్రాంతాల్లో కిరోసిన్ కూడా అందుబాటులో లేకపోవటంతో బాధితులు చీకట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇదిలా ఉండగా సోమవారం డివిజన్లో విస్తారంగా వర్షం కురిసింది. దీంతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు నుంచి 19 గేట్లను ఎత్తి 70 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. రామాలయం వీధులు : భద్రాచలం పట్టణంలోని రామాలయం వీధులు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. సుభాష్ నగర్ కాలనీలోకి ప్రవేశించిన వరద నీరు రామాలయం వరకూ రావటంతో పాటు కరకట్ట స్లూయిస్ లీకుల ద్వారా వచ్చిన నీరు తోడైంది. దీంతో రామాలయానికి వెళ్లే దారిలో పడవలపై ప్రయాణించాల్సి వచ్చింది. విస్తాకాంప్లెక్స్ పూర్తిగా వరద నీటిలోనే మునిగిపోయింది. శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం జరిగే మిథిలాస్టేడియంను వరద నీరు చుట్టిముట్టింది. పరిసర ఇళ్ల వారు తానీషా కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో తలదాచుకుంటున్నారు. ఇళ్లల్లో సామాన్లన్నీ తడిసిపోవటంతో గత పది హేను రోజులుగా వ్యాపారాలు సాగకపోవటంతో విస్తాకాంప్లెక్స్ దుకాణ దారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వరద తగ్గినప్పటికీ ఇక్కడ నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపిస్తే తప్ప దుకాణాలు బయటపడే అవకాశం లేదు. నీటిపారుదలశాఖ ఈఈ శ్రావణ్‌కుమార్ పర్యవేక్షణలో అధికారులు ప్రత్యేక మోటార్లను ఏర్పాటు చేసి నీటిని తోడే ప్రయత్నం చేస్తున్నారు. వరదలతో అతలాకుతలం : అధికారులు ముంపు గ్రామాలను సందర్శించకపోవటంతో బాధితులకు ఎటువంటి సాయం అందటం లేదు. ముంపు గ్రామాల్లో అసలు ఏం జరుగుతోందో కూడా తెలియని పరిస్థితి ఉంది. విద్యుత్‌సరఫరా లేక సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతినటంతో గ్రామాల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం రావటం లేదు. జిల్లా అధికార యంత్రాంగం ప్రకటిస్తున్న నివేదికలకు, గ్రామ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న పునరావాస శిబిరాలకు ఎక్కడా పొంతన లేకుండా ఉంది. చింతూరు మండలంలోని చూటూరు గ్రామాన్ని మూడు రోజులుగా వరదనీరు చుట్టిముట్టినప్పటికీ ఏ ఒక్క అధికారి కూడా గ్రామాన్ని సందర్శించ లేదు. ఆ గ్రామ సర్పంచ్ సవలం దాలయ్య సోమవారం మండల కేంద్రాన్ని వచ్చి సెక్టోరియల్ అధికారిని నిలదీశాడు. అధికారులు ముంపు గ్రామాలను సందర్శించకుండా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితులు అంటున్నారు. గ్రామాలను వరద నీరు విడిచినప్పటికీ పారిశుధ్య చర్యలపై అధికారులుదృష్టి సారించటం లేదు. దీంతో గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జ్వర పీడితులు సంఖ్య పెరుగుతూనే ఉంది. పునరావాస శిబిరాల్లో సరైన సౌకర్యాలు లేకపోవటంతో బాధితులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అమాత్యులెక్కడ : వరదలతో భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని వందలాది గ్రామాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నా వారిని పరామర్శించే వారే కరువవుతున్నారు. వరద ఉగ్రరూపం దాల్చినా ఇప్పటి వరకూ జిల్లాకు చెందిన మంత్రి ఇటు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ప్రభుత్వం దృష్టి సారించకపోవటంతో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు అంటున్నారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పునరావాస చర్యలు చేపట్టకపోతే ముంపు ప్రాంతాల్లో మరి కొన్ని మరణాలు సంభవించే అవకాశం ఉందని ఈప్రాంత వాసులు అంటున్నారు.