బాల్కొండ,న్యూస్‌లైన్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి కోసం ఆయక ట్టు రైతులు కాలువల వద్దనే పగలూ,రాత్రి కాపలా కాస్తున్నారు. తాము సాగు నీటి కోసం అవస్థలు పడుతుంటే పాలకులు మాత్రం ప్రాజెక్టు నుంచి పొరుగు జిల్లాలకు దర్జాగా సరఫరా చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లక్ష్మీ కాలువ ఆధారంగా నిర్మించిన వేంపల్లి, నవాబు ఎత్తిపోతల పథకం వద్ద ఈ పరిస్థితి నెలకొంది. సక్రమంగా నీటి పంపకాలు చేయడంలో అధికారులు విఫలం కావడంతో రైతులు కాలువ వద్ద టెంట్లు వేసుకుని మరీ కాపలా కాస్తున్నారు. తమ వంతు వచ్చే వరకూ ఎదురు చూస్తున్నారు. కాలువ వద్దనే టెంట్లు వేసుకుని జాగారం చేస్తున్నారు. వేంపల్లి ఎత్తి పోతల పథకం నుంచి నీటి పంపకాలను సక్రమంగా చేయడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో రైతుల మధ్య అవగాహన కుదరక వారు వంతుల వారీగా నీటి కోసం కాలువ వద్ద కాపలా కాస్తున్నారు. ఎత్తి పోతల నుంచి పది రోజుల పాటు నవాబు లిఫ్ట్‌కు నీరందించాలని అధికారులు నిర్ణయించారు. అదే కాలువకు ఉన్న మిగతా గ్రామాల ఆయకట్టు రైతులు తూం లను తెరవడం ద్వారా నీరు గమ్యానికి చేరడంలేదు. దీంతో నవాబు లిఫ్ట్ గ్రామాల రైతులు వంతుల వారీగా కాపలా కాస్తున్నారు. కాలువలు సైతం పూడికతో, ముళ్ల పొదలతో నిండి నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
నవాబు లిఫ్ట్ గ్రామాలు
నవాబు లిఫ్ట్ గ్రామాలు వేల్పూర్, లక్కోర, వెంకటాపూర్, అంక్సాపూర్, సాహెబ్‌పేట్ ,కుకునూర్, కోమన్‌పల్లి, అమీనాపూర్, దొన్కల్ గ్రామస్తులు కాలువ వద్ద అక్కడక్కడ ఎనిమిది చోట్ల గ్రామస్తులు నీటి కోసం వంతుల వారీగా కాపలా కాస్తున్నారు. ఎముకలు కొరికే చలిలో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందుల నడుమ కాపలా కాస్తూ నీటిని నవాబు లిఫ్ట్‌కు చేర్చుతున్నారు.
నీటి వినియోగదారుల సంఘాలు విఫలం
నీటి పంపకాలపై రైతులకు అధికారులకు మధ్య సమన్వయపరచాల్సిన నీటి వినియోగదారుల సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయి. దీంతో రైతులు నీటి కోసం పడిగాపులు కాస్తున్నారు. వేంపల్లి లిప్ట్ రెండో యూని ట్ ఆధారంగా చెరువులు నింపే గ్రామాలకు వంతుల వారీగా నీటిని విభజించి చెరువులు నింపాలి. అలా ఒకరి వంతులో ఒకరు నీటిని వినియోగించుకోకుండా నీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులు మాట్లాడాలి. కాని వారి పదవీ కాలం కూడా దగ్గర పడటంతో రైతులను వారు పట్టించు కోవడం లేదనే విమర్శలున్నాయి. దీంతో రైతుల మధ్య విభేదాలు తలెత్తే పరి స్థితి ఏర్పండింది. నీళ్ల కోసం కొట్లాడుకునే పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పం దించాలని రైతులు కోరుతున్నారు.
సాగునీటి కోసం జాగారం
Published Thu, Jan 9 2014 5:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM
Advertisement