సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టు అయిన శ్రీరాంసాగర్ కింద సాగు అవసరాలకు నీటి విడుదల ప్రక్రియ మరో రెండ్రోజుల్లో ముగియనుంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎస్సారెస్పీ స్టేజ్-1, స్టేజ్-2 కింద యాసంగిలో పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందించారు. ఎస్సారెస్పీలో లభ్యత నీటిని వాడుకుంటూ లోయర్ మానేరు డ్యామ్ వరకు ఉన్న ఆయకట్టుకు నీరందించగా దాని దిగువన ఉన్న ఆయకట్టుకు కాళేశ్వరం జలాలతో పారించారు. ఆయకట్టు చరిత్రలోనే తొలిసారి 120 టీఎంసీలను వినియోగించి 14.50 లక్షల ఎకరాలకు నీరు అందించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఎస్సారెస్పీ మొదలు ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరులలో కనీస నీటిమట్టాలను పక్కాగా నిర్వహిస్తూ జూలై వరకు తాగునీటి అవసరాలకు నీటిని పక్కనబెట్టారు. ఒకవేళ సహజ ప్రవాహాల రాక ఆలస్యమైనా కాళేశ్వరం ద్వారా ఎత్తిపోతలు మొదలు పెట్టేలా ప్రణాళికలున్నాయి.
గరిష్ట ఆయకట్టు.. గరిష్ట వినియోగం
ఎస్సారెస్పీ ప్రాజెక్టులో స్జేజ్–1 కింద 9.60 లక్షల ఎకరాలు, స్టేజ్–2లో 3.97 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. వాటితోపాటే ఎస్సారెస్పీపైనే ఆధారపడ్డ అలీసాగర్, గుత్పా కింద ఉన్న 40 వేల ఎకరాలు, కడెం కింద 40 వేల ఎకరాలు, మిడ్ మానేరు కింద 30 వేల ఎకరాలు, సదర్‌మట్–గౌరవెల్లి రిజర్వాయర్ల కింద మరో 40 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో ఈ యాసంగిలో 14.50 లక్షల ఎకరాల మేయ ఆయకట్టుకు నీరందించారు. లోయర్‌మానేరు ఎగువన ఎస్సారెస్పీ, అలీసాగర్, గుత్పా, వరద కాల్వల ఆయకట్టు కలిపి 6.50 లక్షల ఎకరాల మేర ఉండగా 5.70 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందించారు. దీనికోసం గరిష్టంగా ఎస్సారెస్పీ ప్రాజెక్టులో లభ్యత నీటిలోంచే 65 టీఎంసీల మేర నీటిని వినియోగించారు. ఇక లోయర్ మానేరు దిగువన సూర్యాపేట వరకు 8.50 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉండగా తొలిసారి చివరి వరకు నీరందించారు. ఎల్‌ఎండిలో లభ్యతగా ఉన్న 22 టీఎంసీలను వినియోగించుకోవడంతోపాటు కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా తరలించిన 33 టీఎంసీల మేర నీటిని వినియోగించారు. దీంతో పూర్తి ఆయకట్టుకు నీరందింది. 7–8 తడుల ద్వారా ఈ నీటిని విడుదల చేశారు. మొత్తంగా ఎస్సారెస్పీ కింద 14.50 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందగా 120 టీఎంసీల మేర గరిష్ట నీటి వినియోగం జరిగింది. ఈ నీటిలోంచే వెయ్యికిపైగా చెరువులు నింపారు. ఇది గతేడాది యాసంగి సీజన్‌లో చేసిన నీటి వినియోగంకన్నా 35 టీఎంసీల మేర అధికం.
సాగుకు పూర్తి.. మిగిలింది తాగుకే
Published Fri, Apr 16 2021 2:50 AM | Last Updated on Fri, Apr 16 2021 2:51 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment