ఒక్క గ్రామం..నాలుగు టీఎంసీలు!
సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువన ఉన్న ఎల్లంపల్లి బ్యారేజీలో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వకు మరికొన్ని టీఎంసీలు అదనంగా నిల్వ చేసేందుకు నీటిపారుదల శాఖ శరవేగంగా కసరత్తు చేస్తోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో లక్ష్యం మేరకు ఆయకట్టుకు నీరందించేందుకు వీలుగా నాలుగు టీఎంసీల నీటినైనా నిల్వ చేయాలని నీటి పారుదల శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రాజెక్టులో ముంపు గ్రామమైన తాళ్లకొత్తపేటను తరలించగలిగితే అదనపు నీటి నిల్వ సాధ్యమని భావిస్తున్న అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు.
ఖరీఫ్ ల క్ష్యం 93 వేల ఎకరాలు
కరీంనగర్ జిల్లాలోని 1,85,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, ఆదిలాబాద్ జిల్లాలోని 30 వేల ఎకరాల స్థిరీకరణ కోసం 20.17 టీఎంసీల నీటి నిల్వ చేయడానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువన ఎల్లంపల్లి బ్యారేజీని నిర్మించిన విషయం తెలిసిందే. దీనికోసం మొత్తంగా రూ. 2,871 కోట్లతో కాంట్రాక్టర్లతో ఒప్పందాలు జరగ్గా, ఇప్పటి వరకు రూ. 2,625 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మరో రూ. 889 కోట్ల మేర పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
ప్రాజెక్టు కింద మొత్తంగా 21 గ్రామాలు ముంపునకు గురవుతుండగా ఇందులో ఇప్పటివరకు 7 గ్రామాలను తరలించారు. మరో 14 గ్రామాలను ఖాళీ చేయించాల్సి ఉంది. దీంతో పాటే 2 రైల్వే క్రాసింగ్, మరో 13 ఆర్‌అండ్‌బీ క్రాసింగ్‌లకు సంబంధించి అనుమతులు రావాల్సి ఉంది. ముఖ్యంగా రాయపట్నం బ్రిడ్జి పనులు త్వరగా పూర్తిచేస్తే ప్రాజెక్టు పనుల్లో కొంత వేగం పెరిగే అవకాశం ఉంది. కానీ, అందులో తీవ్ర జాప్యం జరుగుతోంది. గ్రామాలను ఖాళీ చేయకపోవడం, భూ సేకరణ జరగకపోవడంతో బ్యారేజీలో కేవలం 6.5 టీఎంసీల నీటి నిల్వకు మాత్రమే అవకాశం ఉంటోంది.
ఈ నీటినే ఎన్టీపీసీకి అందించడంతో పాటు గతేడాది మంథని ఎత్తిపోతల కింద మరో 7 వేల ఎకరాలకు సాగునీరందించారు. అయితే ప్రస్తుతం ముంపు గ్రామాల్లో ఒకటిగా ఉన్న తాళ్లకొత్తపేట గ్రామం ఒక్కదాన్ని ఖాళీ చేసినా మరో 4 టీఎంసీలకు నీటి నిల్వ పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రభుత్వం దానిపై దృష్టి కేంద్రీకరించింది. గ్రామం నిర్వాసితులకు త్వరగా ఆర్‌అండ్‌ఆర్ (సహాయ పునరావాసం) పూర్తిచేసి ఖాళీ చేయించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో కదిలిన అధికారులు ముంపు గ్రామాన్ని ఖాళీ చేయించే దిశగా కసరత్తులు చేస్తున్నారు. అనుకున్న మేరకు అదనంగా నీటిని నిల్వ చేయగలిగితే ప్రస్తుత ఖరీఫ్‌లో స్టేజ్-2 కింద 50 వేల ఎకరాలు, మంథని ఎత్తిపోతల కింద 13 వేల ఎకరాల కొత్త ఆయకట్టు నీరివ్వడంతో పాటు, మరో 30 వేల ఎకరాలను స్థిరీకరించాలని నిర్ణయించారు.