సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ భాగాన మహారాష్ట్రలో ఉన్న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను గడువు కన్నా ముందే దించేందుకు మహారాష్ట్ర సర్కారు ఎత్తులు వేస్తోంది. మహారాష్ట్ర ఇంజనీర్లు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇంజనీర్ల ముందు ఇప్పటికే దీనిపై ప్రతిపాదన చేశారు. బాబ్లీ గేట్లను మూసేయడానికి ఇంకా నెల గడువు ఉంది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అధికారికంగా వెలువడాల్సి ఉంది.
వరదొస్తుంటే తొందరెందుకు..?
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏటా జూలై 1న బాబ్లీ ప్రాజెక్టులో 14 గేట్లు ఎత్తి, అక్టోబర్ 28 వరకు తెరిచి ఉంచాలి. అక్టోబర్ 29న మూసివేయాలి. ప్రతిఏటా ఇదే రీతిన కేంద్ర జల సంఘం అధికారుల సమక్షంలో గేట్లు తెరవడం, మూయడం జరుగుతోంది. ఈ ఏడాది జూలై ఒకటిన గేట్లు తెరిచిన అనంతరం ఇప్పటివరకు ఎస్సారెస్పీలోకి ఏకంగా 225 టీఎంసీల మేర కొత్తనీరు వచ్చి చేరింది. ఆదివారం సైతం ప్రాజెక్టులోకి 96 వేల క్యూసెక్కుల మేర వరదనీరు వస్తుండగా, ప్రాజెక్టు నుంచి లక్ష క్యూసెక్కుల మేర నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరదంతా బాబ్లీని దాటుకుంటూ వస్తోంది. బాబ్లీని దాటుకుంటూ వరదంతా దిగువకు వెళుతుండటం, గోదావరి నదిపై ఉన్న తెలంగాణ రిజర్వాయర్లు ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్ మానేరులన్నీ నిండుగా ఉండటంతో బాబ్లీ గేట్ల మూసివేత ప్రతిపాదనను మహారాష్ట్ర ముందుకు తెచ్చింది. గేట్లు మూస్తే బాబ్లీలో 2.74 టీఎంసీల నిల్వ సాధ్యమవుతుంది.
దీనివల్ల బాబ్లీపై ఆధారపడి చేపట్టిన ఒకట్రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని మళ్లించుకోవాలని భావిస్తోంది. అయితే దీనిపై తెలంగాణ ఎలాంటి అభిప్రాయమూ చెప్పలేదు. మహారాష్ట్రలోని గైక్వాడ్ నుంచి ఎస్సారెస్పీ వరకు ఉన్న చిన్న, చిన్న రిజర్వాయర్‌లు, చెక్‌డ్యామ్‌లు నిండుగానే ఉన్నాయి. నాందేడ్ వంటి ఎత్తిపోతల పథకాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. గైక్వాడ్ ప్రాజెక్టులోనూ 102 టీఎంసీలకుగానూ 101 టీఎంసీల మేర నిల్వలు ఉండగా 53 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరద అక్టోబర్ వరకూ కొనసాగే అవకాశాలున్నాయని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ మహారాష్ట్ర ముందుగానే గేట్లు మూసే ప్రతిపాదన చేయడం గమనార్హం. గతంలో ఒకసారి అక్టోబర్‌లో గేట్లు మూశాక, బాబ్లీ నిండి మరింత వరద కొనసాగుతున్న తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలేసిన సందర్భాలున్నాయి. దానిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయించే అవకాశాలపై ఇరిగేషన్ శాఖలో అంతర్గత చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment