babli project gates
-
బాబ్లీ గేట్లు దించేందుకు ‘మహా’ ఎత్తులు
సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ భాగాన మహారాష్ట్రలో ఉన్న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను గడువు కన్నా ముందే దించేందుకు మహారాష్ట్ర సర్కారు ఎత్తులు వేస్తోంది. మహారాష్ట్ర ఇంజనీర్లు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇంజనీర్ల ముందు ఇప్పటికే దీనిపై ప్రతిపాదన చేశారు. బాబ్లీ గేట్లను మూసేయడానికి ఇంకా నెల గడువు ఉంది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అధికారికంగా వెలువడాల్సి ఉంది. వరదొస్తుంటే తొందరెందుకు..? సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏటా జూలై 1న బాబ్లీ ప్రాజెక్టులో 14 గేట్లు ఎత్తి, అక్టోబర్ 28 వరకు తెరిచి ఉంచాలి. అక్టోబర్ 29న మూసివేయాలి. ప్రతిఏటా ఇదే రీతిన కేంద్ర జల సంఘం అధికారుల సమక్షంలో గేట్లు తెరవడం, మూయడం జరుగుతోంది. ఈ ఏడాది జూలై ఒకటిన గేట్లు తెరిచిన అనంతరం ఇప్పటివరకు ఎస్సారెస్పీలోకి ఏకంగా 225 టీఎంసీల మేర కొత్తనీరు వచ్చి చేరింది. ఆదివారం సైతం ప్రాజెక్టులోకి 96 వేల క్యూసెక్కుల మేర వరదనీరు వస్తుండగా, ప్రాజెక్టు నుంచి లక్ష క్యూసెక్కుల మేర నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరదంతా బాబ్లీని దాటుకుంటూ వస్తోంది. బాబ్లీని దాటుకుంటూ వరదంతా దిగువకు వెళుతుండటం, గోదావరి నదిపై ఉన్న తెలంగాణ రిజర్వాయర్లు ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్ మానేరులన్నీ నిండుగా ఉండటంతో బాబ్లీ గేట్ల మూసివేత ప్రతిపాదనను మహారాష్ట్ర ముందుకు తెచ్చింది. గేట్లు మూస్తే బాబ్లీలో 2.74 టీఎంసీల నిల్వ సాధ్యమవుతుంది. దీనివల్ల బాబ్లీపై ఆధారపడి చేపట్టిన ఒకట్రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని మళ్లించుకోవాలని భావిస్తోంది. అయితే దీనిపై తెలంగాణ ఎలాంటి అభిప్రాయమూ చెప్పలేదు. మహారాష్ట్రలోని గైక్వాడ్ నుంచి ఎస్సారెస్పీ వరకు ఉన్న చిన్న, చిన్న రిజర్వాయర్లు, చెక్‌డ్యామ్‌లు నిండుగానే ఉన్నాయి. నాందేడ్ వంటి ఎత్తిపోతల పథకాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. గైక్వాడ్ ప్రాజెక్టులోనూ 102 టీఎంసీలకుగానూ 101 టీఎంసీల మేర నిల్వలు ఉండగా 53 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరద అక్టోబర్ వరకూ కొనసాగే అవకాశాలున్నాయని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ మహారాష్ట్ర ముందుగానే గేట్లు మూసే ప్రతిపాదన చేయడం గమనార్హం. గతంలో ఒకసారి అక్టోబర్‌లో గేట్లు మూశాక, బాబ్లీ నిండి మరింత వరద కొనసాగుతున్న తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలేసిన సందర్భాలున్నాయి. దానిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయించే అవకాశాలపై ఇరిగేషన్ శాఖలో అంతర్గత చర్చ జరుగుతోంది. -
మహారాష్ట్ర: బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత
-
బాబ్లీ గేట్లు ఎత్తివేత
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ భాగాన మహారాష్ట్రలో ఉన్న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను ఆదివారం త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో పైకి ఎత్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏటా జూలై 1న బాబ్లీ గేట్లు ఎత్తి, అక్టోబర్ 28 వరకు తెరిచి ఉంచాలి. ఈ నేపథ్యంలో తెలంగాణ, మహారాష్ట్ర అధికారులు, సీడబ్ల్యూసీ ప్రతినిధుల సమక్షంలో గేట్లు ఎత్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్సారెస్పీ ఈఈ రామారావు, డిప్యూటీ ఈఈ జగదీశ్, మహారాష్ట్ర తరఫున నాందేడ్ ఈఈ ఖాలేకర్, సెంట్రల్ వాటర్ కమిషన్ ఈఈ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఈఈ మోహన్‌రావు నీటి విడుదలను పర్యవేక్షించారు. ఉదయం 11.00 గంటల నుంచి గేట్లు ఎత్తడం ప్రారంభించి ప్రతి 45 నిమిషాలకొక గేటు చొప్పున సాయంత్రం వరకు 14 గేట్లు ఎత్తినట్లు అధికారులు తెలిపారు. బాబ్లీలో నీరు నిండుగా ఉంది. గేట్లు ఎత్తడంతో దిగువన ఎస్సారెస్పీలోకి ప్రస్తుతం 0.3 టీఎంసీల నీరు వచ్చే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. గత నెల 11, 12 తేదీల్లో కూడా మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా బాబ్లీ ప్రాజెక్ట్ నిండుకుండలా మారడంతో నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో ఎస్సారెస్పీలోకి 3.98 టీఎంసీల నీరు వచ్చి చేరింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు అక్టోబర్ 28 వరకు తెరిచి ఉంచుతారు. ఆ రోజు గేట్లు దించి మళ్లీ జూన్ 30 వరకు మూసి ఉంచుతారు. గేట్ల మూసివేత సమయంలో మహారాష్ట్ర పరిధిలో నీరు నిలిచి పోయినందుకు ప్రతిగా ఏటా మార్చి 1న బాబ్లీ గేట్లు ఎత్తి 0.6 టీఎంసీల నీటిని ఎస్సారెస్పీకి వదలాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
నేడు బాబ్లీ గేట్ల ఎత్తివేత
► గోదావరిలోకి పెరగనున్న నీటి ప్రవాహం ► త్రిసభ్య కమిటీ పర్యవేక్షణలో విడుదల భైంసా : గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం ధర్మాబాద్ తాలుకా బాబ్లీ గ్రామం వద్ద నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను గురువారం అర్ధరాత్రి తెరవనున్నారు. వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను తెరిచి నీటిని వదలనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏటా జూలై 1న గేట్లు తెరిచి అక్టోబర్ 28 వరకు నది నీటి సహజ ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలని మహారాష్ట్రకు ఆదేశించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యుల పర్యవేక్షణలో గేట్లను పైకి ఎత్తనున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి గోదావరి నది ప్రవహిస్తూ నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద తెలంగాణలో అడుగీడుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూరు వరకు ఈ నది ప్రవాహం ఉంటుంది. గోదావరి నదిలో వర్షపు నీరు.. వర్షాలు లేక గతేడాది ఎస్సారెస్పీలో నీరు చేరలేదు. పుష్కరాల సమయంలో గేట్లు ఎత్తడంతో ఆ నీరు బాసర వరకు చేరింది. వర్షాలు లేక గోదావరి నదిలో తవ్విన ఇసుక గుంతల్లోనే ప్రాజెక్టు నీరు ఇంకిపోయింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం మంజీర ఉపనదితో వచ్చే నీరు బాసర వద్ద నిలిచి ఉంది. పక్షం రోజుల వరకు బాసర వద్ద పుణ్యస్నానాలకు కూడా నీరు కనిపించలేదు. గోదావరి నదిలో బావులు తవ్వి ఆలయానికి, గ్రామానికి, ట్రిపుల్ఐటీ విద్యార్థులకు నీటిని పంపించారు. జూన్ మొదటి వారం నుంచి కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి జలకళ వచ్చింది. బాసర గోదావరి నదిలో స్నానఘట్టాల వద్ద వర్షపునీరు చేరింది. రైలు, బస్సు వంతెనల నుంచి నదిలో నీరు కనిపిస్తోంది. గతేడాది నుంచి ఎడారిలా కనిపించిన గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరుగుతోంది. ఎస్సారెస్పీకి నీరు.. ఇక వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తనున్నారు. నీరంతా ఎస్సారెస్పీలోకి చేరనుంది. పైగా మహారాష్ట్రలో వర్షాలు కురుస్తున్నాయి. వరదనీరంతా గోదావరి నదిగుండా ఎస్సారెస్పీకి చేరనుంది. ప్రాజెక్టు 14 గేట్లు పైకి ఎత్తి ఉంచడంతో సహజ నది నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం ఉండదు. గోదావరి నది ప్రవహిస్తే నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎత్తిపోతల పథకాలతో నీరంది పంటలు పండుతాయి. నీరులేక గతేడాది రెండు జిల్లాలోనూ పంటపొలాలన్నీ బీడుభూములుగా మారిపోయాయి. ఈ యేడాది వర్షాలు కురుస్తుండడంతో గోదావరిలో వచ్చే నీటితో ఎత్తిపోతల పథకాలు పనిచేస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే రెండు జిల్లాల రైతులు వరి పంటలువేసేందుకు పొలాలను సిద్ధం చేసి ఉంచారు. రైతుల ఆశలు.. ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో ఏడు లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీ నీరు అందుతుంది. తీవ్ర వర్షాభావంతో ఈ రైతులంతా గతేడాది నష్టపోయారు. ఈ యేడు వాతావరణ సూచనలతో వర్షాలు కురుస్తాయని ప్రకటనలు వెలువడ్డాయి. దీంతో ఎలాగైనా ప్రాజెక్టు నిండుతుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కురుస్తున్న వర్షాలకుతోడు వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తనుండడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఎస్సారెస్పీలో నీరు చేరితే తాగు, సాగునీటి ఇబ్బందులు దూరం కానున్నాయి. -
ఎస్సారెస్పీలోకి 0.37 టీఎంసీల నీరు
బాల్కొండ: బాబ్లీ గేట్ల ఎత్తివేతతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్(ఎస్సారెస్పీ)లోకి 0.37 టీఎంసీల నీరు చేరిందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. 0.7 టీఎంసీల నీరు వచ్చి చేరుతుందని ముందుగా ప్రకటించినా అందులో సగం మాత్రమే నీరు వచ్చి చేరింది. మిగతాది వచ్చే అవకాశం లేదని ప్రాజెక్ట్ అధికారులు అంటున్నారు. ఎస్సారెస్పీ నుంచి నీటిని వెనక్కు లాక్కునే విధంగా రివర్స్ గేట్లతో బాబ్లీ ప్రాజెక్ట్‌ను నిర్మించిన మహారాష్ట్ర సర్కార్... గేట్లు ఎత్తిన తర్వాత ఏమైనా మాయ చేసి ఉండవచ్చని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి నీటి మట్టం 1091 అడుగులు కాగా గురువారం సాయంత్రానికి 1067.70 అడుగులు ఉంది. -
ఎట్లయినా ఎస్సారెస్పీకే నష్టం
బాల్కొండ: ‘బాబ్లీ’.. అంటూ ముద్దుగా పేరుపెట్టి.. గోదావరిపై ఆనకట్ట కట్టిన మహారాష్ట్ర ప్రభుత్వం మనకచ్చే నీళ్లనూ దోచేస్తోంది. అసలు ఈ ప్రాజెక్టు కట్టడంలోనే మాయ చేసింది. తన నీళ్లు తనకే.. మన నీళ్లూ తనకే వచ్చేలా కనికట్టు ప్రదర్శించింది. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తినా.. దించినా మనకేం ప్రయోజనం లేదు.. సరికదా మన నీళ్లూ వాళ్లకే వెళ్లిపోతాయి. ఇలా నిర్మించిన ‘బాబ్లీ అడ్డుకట్ట’ వల్ల ఉత్తర తెలంగాణ కల్పతరువు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు రాకపోవడంతో.. ‘ఆయకట్టు’ కన్నీళ్లు పెడుతోంది. ఎస్సారెస్పీకి నీటి గండమే ఎగువన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలో గోదావరిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ వల్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్(ఎస్సారెస్పీ)కు నీటిగండం తప్పదు. బాబ్లీ గేట్లు ఎత్తిన, దించిన ఎస్సారెస్పీ నీటికి గండమే. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం జూలై నుంచి అక్టోబర్ 28 వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తిఉంచాలి. అయితే గేట్లు ఎత్తితే ఎస్సారెస్పీలోని నికర జలాలు వెనక్కు వెళ్తాయి. దించితే ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీలోకి వచ్చే నీరు నిలిచి పోతుంది. ఇలా ఎత్తినా.. దించినా.. బాబ్లీలోకే నీరు వచ్చేలా ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఎగువన నిండిన తర్వాతే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ప్రధానంగా మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతాల నుంచే వరద వస్తుంది. ఈ నీటితోనే ప్రాజెక్ట్ నిండు కుండలా మారుతుంది. జూలై వరకు బాబ్లీ గేట్లు మూసి వేయడం వల్ల ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటికి ఆటంకం కలుగుతోంది. అనంతరం అక్టోబర్ వరకే గేట్లు తెరిచి ఉంచితే... ఎస్సారెస్పీలోకి వచ్చే వరద నీటికి గండం తప్పదు. గత పదేళ్లుగా వర్షపాతం చూస్తే.. సకాలంలో వర్షాలు కురిసింది చాలా తక్కువ. అలాంటప్పుడు ఎస్సారెస్పీ ఎగువన ఉన్న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు అక్టోబర్ వరకు మాత్రమే తెరిచి ఉంచితే లాభం లేదు. వరదలు వచ్చినా మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ లాంటి ప్రాజెక్ట్‌తో పాటు ఎగువ ప్రాంతంలో నిర్మించిన 16 చెక్‌డ్యాంలు నిండిన తర్వాతనే మిగులు జలాలను వదులుతోంది. గేట్లు ఎత్తితే బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తితే మనకు నీళ్లు వస్తాయని ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులు సంబురపడ్డారు. తీరా ఆ ప్రాజెక్ట్ నిర్మాణశైలి తెలుసుకున్న తర్వాత లబోదిబోమంటున్నారు. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తితే ఎస్సారెస్పీలోని నీళ్లు సైతం వెనక్కి వెళ్తాయి. నీటిని వెనక్కు లాక్కునే విధంగా బాబ్లీ ప్రాజెక్ట్‌కు రివర్స్ గేట్లను నిర్మించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం 1072 అడుగులకు చేరిన తర్వాత ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు నిలిచి పోతే నికర జలాలను వారు దోచేసుకోవచ్చు. అక్టోబర్‌లోనే గేట్లు దించితే శ్రీరాంసాగ ర్ ప్రాజెక్ట్ ఎగువ భాగన నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను అక్టోబర్‌లోనే కిందికి దించితే.. ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీలోకి వచ్చే నీరు నిలిచిపోతుంది. దీంతో ఖరీఫ్‌లో ఎస్సారెస్పీ నిండుకుండలా ఉన్నప్పటికీ.. రబీపై మాత్రం తీవ్ర ప్రభావం పడుతుంది. బాబ్లీ ప్రాజెక్ట్ 2.74 టీఎంసీల సామర్థ్యం అయినప్పటికీ అందులో నుంచి పంపింగ్ ద్వారా ఇతర జలాశయాలకు నీటిని సరఫరా చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఎగువ నుంచి తమకు వరదనీరు రాకపోతే శ్రీరాంసాగర్‌లో నుంచి దాదాపు 56టీఎంసీల నీటిని రివర్స్గేట్ల ద్వారా బాబ్లీలోకి మళ్లించుకోవచ్చు. ఇలా ఎస్సారెస్పీ మొత్తం 90టీఎంసీల్లో 56టీఎంసీల వర కు బాబ్లీ గండం ఉంటుంది. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎస్సారెస్పీపై ఆధారపడిన 18 లక్షల ఎకరాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. 10.50లక్షల ఎకరాలు ప్రశ్నార్థకం బాబ్లీ ప్రాజెక్ట్ వల్ల ఎస్సారెస్పీ ఆయకట్టులో సాగవుతున్న 10.50 లక్షల ఎకరాల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది. ఒక్క టీఎంసీ నీటితో 20వేల ఎకరాల పంటకు నీరందించవచ్చని అధికారుల లెక్కలే తెలుపుతున్నాయి. అంటే 56 టీఎంసీల నీటితో 10.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించవచ్చు. ఉత్తర తెలంగాణలోని నల్గొండ,ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో 18 లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీ నీటిని అందిస్తుంది. బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణం వలన ఎస్సారెస్పీ ఆయకట్టులో 60 శాతం ఎడారిగా మారే ప్రమాదముంది. పాలకులు స్పందించి శ్రీరాంసాగర్ ఆయకట్టును కాపాడాలని రైతులు కోరుతున్నారు.