బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ భాగాన మహారాష్ట్రలో ఉన్న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను ఆదివారం త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో పైకి ఎత్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏటా జూలై 1న బాబ్లీ గేట్లు ఎత్తి, అక్టోబర్ 28 వరకు తెరిచి ఉంచాలి. ఈ నేపథ్యంలో తెలంగాణ, మహారాష్ట్ర అధికారులు, సీడబ్ల్యూసీ ప్రతినిధుల సమక్షంలో గేట్లు ఎత్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్సారెస్పీ ఈఈ రామారావు, డిప్యూటీ ఈఈ జగదీశ్, మహారాష్ట్ర తరఫున నాందేడ్ ఈఈ ఖాలేకర్, సెంట్రల్ వాటర్ కమిషన్ ఈఈ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఈఈ మోహన్‌రావు నీటి విడుదలను పర్యవేక్షించారు.
ఉదయం 11.00 గంటల నుంచి గేట్లు ఎత్తడం ప్రారంభించి ప్రతి 45 నిమిషాలకొక గేటు చొప్పున సాయంత్రం వరకు 14 గేట్లు ఎత్తినట్లు అధికారులు తెలిపారు. బాబ్లీలో నీరు నిండుగా ఉంది. గేట్లు ఎత్తడంతో దిగువన ఎస్సారెస్పీలోకి ప్రస్తుతం 0.3 టీఎంసీల నీరు వచ్చే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. గత నెల 11, 12 తేదీల్లో కూడా మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా బాబ్లీ ప్రాజెక్ట్ నిండుకుండలా మారడంతో నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
దీంతో ఎస్సారెస్పీలోకి 3.98 టీఎంసీల నీరు వచ్చి చేరింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు అక్టోబర్ 28 వరకు తెరిచి ఉంచుతారు. ఆ రోజు గేట్లు దించి మళ్లీ జూన్ 30 వరకు మూసి ఉంచుతారు. గేట్ల మూసివేత సమయంలో మహారాష్ట్ర పరిధిలో నీరు నిలిచి పోయినందుకు ప్రతిగా ఏటా మార్చి 1న బాబ్లీ గేట్లు ఎత్తి 0.6 టీఎంసీల నీటిని ఎస్సారెస్పీకి వదలాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment