చోరీ అయిన బంగారం.. 43 ఏళ్ల తర్వాత చేతికి
⇒ జడ్జి సమక్షంలో బంగారాన్ని అప్పగించిన పోలీసులు
⇒ ఆనందం వ్యక్తం చేసిన మహిళ
రాజమహేంద్రవరం క్రైం: పోగొట్టుకున్న విలువైన వస్తువు దశాబ్దాల తర్వాత దొరికితే ఎంత ఆనందంగా ఉంటుంది.. ఇప్పుడు ఇదే ఆనందం రాజమహేంద్రవరానికి చెందిన మహిళకు దక్కింది. 43 ఏళ్ల క్రితం చోరీ అయిన బంగారం మళ్లీ ఆవిడ చెంతకు చేరింది. స్థానిక త్రీటౌన్ సీఐ శ్రీరామ కోటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వర నగర్‌కు చెందిన వైట్ల సూర్యావతి 1974లో ఇక్కడి మహిళా కళాశాలలో ఇంటర్ చదివారు. ఆ సమయంలో ఒక రోజు కాలేజీకి వెళ్తుండగా ఒక ఆగంతకుడు సూర్యావతి మెడలోని 22 గ్రాముల బంగారు నగలు చోరీ చేసి పరారయ్యాడు. అప్పట్లో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అప్పటి ఎస్సై సీఎస్‌ఆర్ ప్రసాద్ దొంగను పట్టుకుని బంగారం రికవరీ చేశారు. అయితే సూర్యావతి ఇచ్చిన ఫిర్యాదులో సరైన చిరునామా లేకపోవడం, వివాహం చేసుకొని వేరే ప్రాంతానికి వెళ్లిపోవడంతో బంగారం అప్పగించలేకపోయారు. బంగారం గురించి మర్చిపోయిన ఆమె మళ్లీ పోలీసులను సంప్రదిం చలేదు. అయితే 43 ఏళ్ల తర్వాత త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుళ్లు నాగేశ్వరరావు, రాజశేఖర్.. స్థానిక కోర్టు ఆదేశాల మేరకు మహిళా కళాశాలలోని పాత రికార్డులు పరిశీలించి సూర్యావతి చిరునామాను కనుగొన్నారు. 3వ ఏజేఎఫ్‌సీఎం జడ్జి డి.శ్రీదేవి సమక్షంలో ఆ 22 గ్రాముల బంగారాన్ని అప్పగించారు.
నమ్మలేకపోయా...
బాధితురాలు వైట్ల సూర్యవతి మాట్లాడుతూ.. పోగొట్టుకున్న బంగారం 43 సంవత్సరాల తర్వాత తనకు దక్కడం నమ్మలేకపోతున్నానని అన్నారు. అసలు ఫిర్యాదు చేసిన విషయం కూడా మర్చిపోయానని తెలిపారు. చిన్న వయస్సులో పోగొట్టుకున్న బంగారు ఇప్పుడు 61 ఏళ్ల వయస్సులో సొంతం చేసుకోవడం నిజంగా ఆనందంగానూ, ఆశ్చర్యంగానూ ఉందని చెప్పారు.