
బంగారం వేలం వేస్తాం
- రైతు రుణ మాఫీ పథకం మాకు గుదిబండగా మారింది
- ఆంధ్రాబ్యాంకు సీఎండీ సీవీఆర్ రాజేంద్రన్ వ్యాఖ్యలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బంగారం కుదువ పెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలకు రుణ మాఫీ వర్తించని పక్షంలో వెంటనే చెల్లించాలని నోటీసులిస్తున్నామని, గడువు తీరినా కూడా చెల్లించకపోతే ఆభరణాలను వేలం వేయటానికి వెనకాడబోమని ఆంధ్రాబ్యాంక్ స్పష్టంచేసింది. రుణ మాఫీపై వాస్తవ పరిస్థితులను రైతులకు వివరంగా చెబుతున్నామని, రుణం ఎన్‌పీఏగా మారిన తరవాత కూడా దాన్ని చెల్లించని పక్షంలో ఆభరణాలు వేలం వేస్తామని బ్యాంకు సీఎండీ సీవీఆర్ రాజేంద్రన్ స్పష్టంచేశారు.
నిజానికి రుణ మాఫీకి విధించిన నిబంధనల కారణంగా బంగారు ఆభరణాలను తనఖా పెట్టి తీసుకున్న రుణాల్లో చాలా వాటికి మాఫీ వర్తించడం లేదు. ఎందుకంటే రుణ మాఫీ వర్తింప చేయడంలో ముందుగా పంట రుణానికి, ఆ తర్వాత కన్వర్టెడ్ పంట రుణాలకు ప్రాధాన్యమివ్వాలని, ఆ తర్వాతే బంగారు రుణాలను పరిగణనలోకి తీసుకోవాలని నిబంధనలు చెపుతున్నాయి. వీటికి తోడు కుటుంబంలో ఒక ఖాతాకు మాత్రమే మాఫీ వర్తింపజేస్తుండటంతో చాలావరకూ తొలి ప్రాధాన్యంలో ఉన్న పంట రుణాలకే ఇది వర్తిస్తోంది. చాలా గోల్డ్ లోన్స్‌కు మాఫీ జాడే లేకుండా పోతోంది. ఈ పరిస్థితులన్నీ రైతులకు వివరంగా చెబుతున్నామని రాజేంద్రన్ తెలియజేశారు.
డిఫాల్టర్లలో వీరే అధికం
ఆంధ్రాబ్యాంక్ వద్ద పెద్ద మొత్తంలో రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన వారిలో సినిమా స్టార్లు, రాజకీయ నాయకులే ఎక్కువగా ఉన్నట్లు రాజేంద్రన్ వ్యాఖ్యానించారు. ‘‘నిరర్థక ఆస్తులను తగ్గించుకొని బ్యాంకును కాపాడుకోవడానికి రికవరీ సిబ్బంది మాత్రమే కాకుండా మొత్తం 18,000 మంది ఉద్యోగులూ రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఎగవేతదారుల ఇళ్లు, ఆస్తుల ముందు బ్యాంకు సిబ్బంది నిరసన చేపడుతున్నారు’’ అని తెలియజేశారు. వ్యక్తిగతంగా ఎగవేతదారుల పేర్లు చెప్పలేనని, వారి ఇంటి ముందు నిరసన చేసినప్పుడు అవే తెలుస్తాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారాయన. మొత్తం 2.86 లక్షల ఎన్‌పీఏ ఖాతాలుండగా, అందులో కోటి అంతకంటే ఎక్కువ మొత్తం కలిగిన ఖాతాలు 1,038 మాత్రమే. ప్రస్తుతం ఆంధ్రాబ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు రూ.7,118 కోట్లకు చేరుకొని ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.
రికార్డు స్థాయికి వ్యవసాయ రుణ ఎన్‌పీఏలు
ఆంధ్రాబ్యాంక్ చరిత్రలోనే తొలిసారిగా వ్యవసాయ రుణాల్లో 6.6 శాతం నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) జాబితాలోకి చేరాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2014 మార్చి నాటికి రూ.332 కోట్లుగా ఉన్న వ్యవసాయ రుణాల ఎన్‌పీఏలు రుణ మాఫీ పథకం పుణ్యమాని ఈ తొమ్మిది నెలల్లో ఏకంగా రూ.919 కోట్లకు చేరుకున్నాయి. ఎన్‌పీఏల్లో ఇప్పటి వరకు రూ.370 కోట్ల వరకు వసూలయ్యాయని, ప్రస్తుతం నికరంగా రూ.882 కోట్ల మేర వ్యవసాయ ఎన్‌పీఏలు ఉన్నాయని రాజేంద్రన్ తెలియజేశారు. అదే తెలంగాణాలో అయితే వ్యవసాయ రుణాల నికర నిరర్థక ఆస్తులు రూ.405 కోట్లుగా ఉన్నాయి. ‘‘ఆంధ్రా బ్యాంక్ చరిత్రలో వ్యయసాయ రుణాల్లో ఎన్‌పీఏలు ఏనాడూ సగటున రెండు శాతానికి మించి లేవు. కానీ ఈ రుణ మాఫీ పథకం వల్ల ఇప్పుడివి సుమారు ఏడు శాతానికి చేరుకున్నాయి.
భారీగా పెరిగిన పని ఒత్తిడి...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రుణ మాఫీ పథకంలో అనేక నిబంధనలు పెట్టడంతో బ్యాంకు ఉద్యోగులపై తీవ్రమైన పని భారం పడుతోందని రాజేంద్రన్ చెప్పారు. ‘‘ఒక ఉద్యోగి రోజుకు 20-30 ఖాతాలు పునరుద్ధరించగలరు. మాఫీని వేగంగా చేయడానికి మా సిబ్బంది శని, ఆదివారాల్లో కూడా పనిచేస్తున్నారు. రోజుకు 50 ఖాతాల వరకు పూర్తి చేస్తున్నారు. బహుళ వ్యవసాయ రుణాలున్న రైతులకు ఒక రుణానికి మాత్రమే మాఫీ వర్తించడంతో ఏ ఖాతాకు వర్తిస్తుందో, దేనికి వర్తించదో తేల్చడం భారంగా మారింది.మార్చికల్లా 80 శాతం ఖాతా ల్ని పునరుద్ధరించలమన్న నమ్మకం ఉం ది’’ అని తెలియజేశారు. రాత్రింబవళ్లు పనిచేస్తున్నా... బ్యాంకుల వల్లే మాఫీ వర్తింప చేయలేకపోతున్నామని మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు సిబ్బంది మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఒక బ్యాంకు మేనేజర్ వ్యాఖ్యానించారంటే వారిపై ఏ స్థాయి ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు.