ఆగిరిపల్లి : స్థానిక ఆంధ్రాబ్యాంకులో రైతులు తీసుకున్న బంగారం రుణాలపై బ్యాంకు అధికారులు శనివారం చేపట్టిన వేలం పాటను సీపీఎం, వైఎస్సార్‌సీపీ నేతలు అడ్డుకున్నారు. బ్యాంకు ఎదుట ఆందోళన నిర్వహించారు. నూజివీడు డివిజన్ సీపీఎం కార్యదర్శి మూఢగాని మధు మాట్లాడుతూ రైతుల వ్యవసాయ రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తామని చెప్పిందన్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి నిర్ణయం రాకముందే బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని వేలం వేయడం అన్యాయమని చెప్పారు.
తనఖా పెట్టిన బంగారాన్ని ఈ నెల 28న వేలం వేస్తామంటూ బ్యాంకు అధికారులు నోటీసులు పంపడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వివిధ కమిటీల పేరుతో కాలయాపన చేయడం వల్ల బ్యాంకు అధికారులు వ్యవసాయం నిమిత్తం తీసుకున్న బంగారం రుణాలను వ్యవసాయేతర రుణాలుగా చూపించి రైతులకు వేలం నోటీసులు పంపుతున్నారని ఆయన విమర్శించారు.
ఇది దారుణమైన చర్య అని, తక్షణమే ప్రభుత్వం బ్యాంకు ఉన్నతాధికారులతో చర్చలు జరిపి వేలం పాటల నిలిపివేతకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశాడు. అనంతరం బ్యాంకు మేనేజర్‌తో మాట్లాడి వేలం పాటను రద్దు చేయాలని కోరారు. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడిన బ్యాంక్ మేనేజర్ వీవీ రాఘవులు వేలాన్ని నిలిపివేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేత, ఎంపీటీసీ మాజీ సభ్యుడు చిన్ని వెంకటేశ్వరరావు, సీపీఎం మండల కార్యదర్శి సత్తు కోటేశ్వరరావు, నాయకులు జె.గోపాలరావు, ఘంటా అజయ్‌గోష్, రైతులు పాల్గొన్నారు.
బంగారం వేలం అడ్డగింపు
Published Sun, Jun 29 2014 1:37 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement