
సాక్షి, ఒంగోలు టౌన్: జిల్లాలోని ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చల్లటి వార్త చెప్పారు. 2019–2020 బ్యాచ్ విద్యార్థులకు ఒంగోలులోనే తరగతులు నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఎప్పుడో మూడేళ్ల కిందటే కళాశాల మంజూరైనా ఎలాంటి మౌలిక వసతులు కల్పించకపోవడంతో వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయకు వెళ్లి చదువుకోవాల్సి వచ్చేది. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సరిగ్గా మూడేళ్ల క్రితం ఒంగోలుకు ట్రిపుల్ ఐటీ కాలేజీ మంజూరైంది. దానికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టారు. ప్రతి ఏటా వెయ్యి మంది విద్యార్థులకు ఈ కాలేజీలో అడ్మిషన్లు ఇస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ ఐటీ కాలేజీ ఒంగోలుకు మంజూరైనప్పటికీ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దానికి సంబంధించి భవనాల నిర్మాణాలు, విద్యార్థులకు వసతి వంటి సౌకర్యాల కల్పించకపోవడంతో ఒంగోలు ట్రిపుల్ ఐటీ కాలేజీ ఇడుపులపాడుకు తరలింది. గత మూడేళ్ల నుంచి అక్కడే తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాకు చెందిన విద్యార్థులు ఇడుపులపాడుకు వెళ్లి చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
ప్రస్తుతం నాలుగో బ్యాచ్‌కు సంబంధించిన అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన కార్యాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఒంగోలులోని ట్రిపుల్ ఐటీ కాలేజీ గురించి కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. మూడేళ్ల క్రితం ఒంగోలుకు ట్రిపుల్ ఐటీ కాలేజీ మంజూరైనప్పటికీ ఇంతవరకు దానికి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై వెంటనే స్పందించారు. 2019–2020 బ్యాచ్‌కు సంబంధించి ఒంగోలులోనే తరగతులు నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఆర్‌అండ్‌ఎన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాట్లు..
ఒంగోలులో ట్రిపుల్ ఐటీ కాలేజీని దక్షిణ బైపాస్‌రోడ్డులోని రావ్ అండ్ నాయుడు ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఇంజనీరింగ్ కాలేజీ కొన్నేళ్ల క్రితం మూతపడింది. ట్రిపుల్ ఐటీ తరగతుల నిర్వహణకు రావ్ అండ్ నాయుడు ఇంజనీరింగ్ కాలేజీలోని బ్లాక్‌లను ఉన్నతాధికారులు పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న గదులను పరిశీలించిన అనంతరం ట్రిపుల్ ఐటీకి అనుకూలంగా ఉండేలా కొన్ని మార్పులు చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ కాలేజీకి నిర్వహణకు సంబం«ధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం ఆదేశాలతో ఈ పనులు మరింత ఊపందుకోనున్నాయి.
ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రక్రియ పూర్తయి తరగతులు ప్రారంభించే నాటికి ఈ కాలేజీని ట్రిపుల్ ఐటీకి సిద్ధం చేయనున్నారు. ఈ కాలేజీ రెండువేల మంది విద్యార్థులకు సరిపోతుంది. వాస్తవానికి నాలుగు వేల మంది విద్యార్థులకు కాలేజీ ఉండాలి. తాజా బ్యాచ్‌కు ఇక్కడ నుంచే తరగతులు నిర్వహించనున్నారు. రెండవ, మూడవ, నాల్గవ సంవత్సరం విద్యార్థులకు సంబంధించిన విషయమై ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. ఒంగోలుకు సమీపంలో స్థలాన్ని సేకరించి ట్రిపుల్ ఐటీకి శాశ్వత భవనాలు నిర్మించి పూర్తి స్థాయిలో తరగతులు నిర్వహించే విషయమై ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
అభద్రతకు గురిచేసిన చంద్రబాబు..
ఒంగోలు ట్రిపుల్ ఐటీ కాలేజీకి సంబంధించి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అభద్రతా భావానికి గురిచేశారు. గత ఏడాది ఆగస్టు 7వ తేదీ జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు పామూరులో 208.4 ఎకరాల భూమిలో ట్రిపుల్ ఐటీ నిర్మించేందుకు శిలాఫలకం వేశారు. ఒంగోలుతోపాటు పరిసర ప్రాంతాల్లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేస్తే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు అనువుగా ఉండే ప్రాంతాన్ని వదిలేసి దూరంగా ఉన్న పామూరులో చంద్రబాబు శిలాఫలకం వేయడం విమర్శలకు తావిచ్చింది.
పామూరులో తాగునీటి సమస్య ఉండటం, ఉన్న నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండటంతో ట్రిపుల్ ఐటీ చదివేందుకు అక్కడకు వెళ్లి తమ పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడతారోనని వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. శిలాఫలకం వేసినప్పటికీ దానికి సంబంధించిన నిధులను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఉన్నతాధికారులు ఇడుపులపాడులోనే తరగతులు నిర్వహిస్తూ వస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా ట్రిపుల్ ఐటీ తరగతులను ఒంగోలులోనే నిర్వహించాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో సంతోషం రెట్టింపైంది.
Comments
Please login to add a commentAdd a comment