సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టేలా చేసిన ప్రకటనలపై అన్ని రాజకీయ పార్టీలకూ నోటీసులు జారీ చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈసీ జారీ చేసిన నోటీసులపై వారి వద్ద నుంచి వచ్చిన సమాధానాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.
కుల మతాలపై విద్వేషపూరితమైన ప్రకటనలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఐపీసీ సెక్షన్ 153 ఏ, ప్రజాప్రతినిధ్య చట్టం సెక్షన్ 125 ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల అభ్యర్ధులు ఇచ్చే ఫాం బీపై అభ్యర్ధులు ఏ పెన్నుతో సంతకం చేసినా అభ్యంతరం లేదని చెప్పారు. రిటర్నింగ్ అధికారులకు ఈ విషయంలో కొంత గందరగోళముందని అన్నారు. నామినేషన్లను ఆమోదించటంలో రిటర్నింగ్ అధికారే కీలకం అని తెలిపారు. కానీ రిటర్నింగ్ అధికారి వద్ద తప్పుదొర్లితే నేరుగా హైకోర్టును ఆశ్రయించాల్సిందేనని చెప్పారు.
ఎన్నికల నేపథ్యంలో సర్వేలు, వాటి విశ్లేషణల వెల్లడి ఎన్నికల పరంగా తప్పుకాదు. సోషల్ మీడియాలో నకిలీ పోస్టింగులు పెట్టి తప్పుదారి పట్టించేలా వ్యవహరిస్తే ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సీ.విజిల్ యాప్ ద్వారా వస్తున్న ఫిర్యాదులు 50 శాతం మేర నకిలీవేనన్నారు. జనవరి 11 తుది ఎన్నికల జాబితా నుంచి ఈ రోజు వరకూ 23 లక్షల ఓట్లు పెరిగాయని అన్నారు. ఉత్తర ప్రదేశ్ తరహా ప్రయోగం ఇక్కడి రాజకీయ పరిస్థితుల కారణంగా ఫలితాలు ఇవ్వవని బావిస్తున్నామన్నారు. పోలింగ్ సమయంలో సాంకేతికంగా ఈవీఎంలకు వచ్చే ఇబ్బందులను పరిష్కరించేందుకు 600 మంది నిపుణులు ప్రతీ నియోజకవర్గంలోనూ ఓ సాంకేతిక నిపుణుడిని అందుబాటులో ఉంచుతామని గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment