బాబు తీరు మారనేలేదు
పంగులూరు: ‘నేను మారాను..నన్ను నమ్మండని’ ఎన్నికల సమయంలో ఎన్నో మాయమాటలు చెప్పిన సీఎం చంద్రబాబు తీరు రైతుల పట్ల ఏమాత్రం మారలేదని జిల్లా రైతుసంఘం నాయకుడు ఎం.గోపీనాథ్ ఆరోపించారు. పంగులూరు తహ శీల్దారు కార్యాలయం వద్ద జిల్లా కౌలు రైతుసంఘం అధ్యక్షుడు రాయిని వినోద్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కౌలు రైతుల ధర్నాలో ఆయన మాట్లాడారు. కౌలు రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని ప్రభుత్వానికి పలుమార్లు మొర పెట్టుకున్నా వారికి తగిన న్యాయం జరగలేదన్నారు.
జిల్లా కౌలురైతు సంఘ అధ్యక్షుడు రాయిని వినోద్ మాట్లాడుతూ ఒకే గ్రూపులో ఒకరిద్దరికి రుణమాఫీ జరగగా, మిగిలిన వారికి ఎందుకు వర్తించలేదని ప్రశ్నించారు. సీఐటీయూ జిల్లా నాయకుడు గంగయ్య మాట్లాడుతూ ప్రతి రైతుకూ రుణమాఫీ చేస్తామన్న చంద్రబాబు వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. అనంతరం ధర్నా వద్దకు వచ్చిన తహశీల్దారు డి.నిర్మల బ్యాంకు అధికారులతో మాట్లాడి కౌలు రైతుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
బ్యాంకు అధికారులతో తహశీల్దార్ చర్చలు:
తన కార్యాలయంలో తహశీల్దార్ నిర్మల ఏర్పాటు చేసిన సమావేశానికి పంగులూరు ఎస్‌బీఐ మేనేజర్ జె రఘు, చందలూరు సిండికేట్ బ్యాంకు మేనేజర్ అశోక్‌బాబు, ముప్పవరం వైశ్యా బ్యాంకు మేనేజర్ సీతారామయ్య హాజరయ్యారు. రైతుసంఘం పక్షాన గోపీనాథ్, వినోద్, గంగయ్య, తల్లపనేని రామారావు హాజరై కౌలు రైతుల స్థితిగతులపై చర్చించారు. తహ శీల్దారు నిర్మల లీడ్ బ్యాంకు మేనేజర్‌తో ఫోన్‌లో మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు. రుణమాఫీ పొందని రైతులు జనవరి 6వ తేదీ లోగా ఆధారాలతో కూడిన జిరాక్స్ కాపీలు సంబంధిత వీఆర్‌వోలకు అందజేయవచ్చని తెలిపారు.
పంగులూరు బ్యాంకు మేనేజర్ సమావేశానికి రావడం ఆలస్యం కావడంతో రైతులు బ్యాంకు వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు గుడిపాటి మల్లారెడ్డి, తల్లపనేని రామారావు, రాయిని వెంకట సుబ్బారావు, సరికొండ రామచంద్రరాజు, తల్లపనేని సుబ్బారావు, 21 గ్రామాలకు చెందిన 300 మందికి పైగా కౌలు రైతులు, మహిళా రైతులు హాజరయ్యారు.