గోరటి వెంకన్నను సన్మానిస్తున్న వీసీ ముత్యాలునాయుడు తదితరులు
జానపద మూలాలను అన్వేషించి,వాటిని వెలికితీసి భావితరాలకు అందించాలని ప్రముఖ రచయిత, ప్రజా కవి, గాయకుడు గోరటి వెంకన్న సూచించారు. అప్పుడే జానపద సాహిత్యంలోని ఔనత్యం ప్రజలకు అందుతుందన్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించిన అంతర్జాతీయ జానపద విజ్ఞాన దినోత్సవంలో ఆయన మాట్లాడారు.
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం): జానపద మూలాలను అన్వేషించి, వాటిని వెలికితీసి భావితరాలకు అందించాలని ప్రముఖ రచయిత, ప్రజా కవి, గాయకుడు గోరటి వెంకన్న సూచించారు. అప్పుడే జానపద సాహిత్యంలోని ఔనత్వం ప్రజలకు అందుతుందన్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించిన అంతర్జాతీయ జానపద విజ్ఞాన దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి ఒడిలో నుంచి జానపదం పుట్టిందన్నారు. అందుకే జానపద మూలాలు ప్రకృతిలోనే ఉన్నాయన్నారు. ఆధునికత పేరుతో నేడు మానవుడు ఆ ప్రకృతికి దూరంగా జీవిస్తున్నాడని, సంస్కృతికి కూడా దూరమవుతున్నాడని చెప్పారు. ప్రాచీన కాలం నుంచి పాట ప్రజల నోట ఉండేదని, అందుకే పని, పాట అనేవారని గుర్తు చేశారు. ఇప్పటికే జానపద విజ్ఞానంపై అవగాహన కలిగిన వారు మరింత లోతైన పరిశోధనలు చేసి భావితరాలకు అందించాలన్నారు. జానపదంపై నేటితరాలకు కూడా అర్థమయ్యే విధంగా సినిమాలు రావాలన్నారు. వీసీ ఆచార్య ఎం.ముత్యాలునాయుడు మాట్లాడుతూ ప్రాంతాలు వేరైనా, పాలకులు వేరైనా మనమంతా ఒక్కటే, ఒకే భాషకు, ఒకే సంస్కృతికి చెందిన వారమన్నారు. సాహిత్యానికి ఎల్లలు లేవని, కవులకు ప్రాంతాలు అడ్డుకావన్నారు. మన సంస్కృతిని కాపాడుతున్న సైనికులు వీరేనన్నారు.
అలరించిన కళా ప్రదర్శనలు
సుమారు 30 మంది కళాకారులు కోలాటం, తాషా విన్యాస నృత్యం తదితర పలు జానపద కళారూపాలు ప్రదర్శించారు. అనంతరం ఆ కళాకారులను సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎస్ రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సదస్సు కన్వీనర్ డాక్టర్ టి.çసత్యనారాయణ, రిజిస్ట్రార్ డాక్టర్ టి.అశోక్, కో–ఆర్డినేటర్ డాక్టర్ జి.ఎలీషాబాబు, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుబ్బారావు, డీన్ ఆచార్య ఎస్.టేకి, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ డి.జ్యోతిర్మయి, తెలుగు విభాగం అధ్యాపకులు డాక్టర్ తలారి వాసు, డాక్టర్ వరప్రసాద్, డాక్టర్ నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment